
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. బుధవారం విశాఖలో అన్ని జిల్లాల డీఆర్‌డీఏ పీడీలు, అదనపు పీడీలతో నిర్వహించిన గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ (సెర్ప్) వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. మహిళా సాధికారతకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడమేకాక, దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
కోటి మంది మహిళలు ఉన్న సంస్థ సెర్ప్ మాత్రమేనని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన నవరత్నాలలో మూడు ‘ సెర్ప్ ద్వారానే అమలవుతున్నాయంటే.. ఈ సంస్థకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో తెలుస్తుందన్నారు. గత మూడేళ్లలో సెర్ప్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులు, సాధించిన విజయాలపై సంస్థ సీఈవో ఎండీ ఇంతియాజ్ అహ్మద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఉన్నతి పథకం ద్వారా 1.08 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలు రూ.500 కోట్లు లబ్ధి పొందనున్నారని తెలిపారు.
వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు స్కోచ్ అవార్డులు వచ్చాయన్నారు. వైఎస్సార్ చేయూతలో తొలి విడతలో దాదాపు 24 లక్షల మంది, రెండో విడతలో 25 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. వైఎస్సార్ ఆసరాలో మొదటి విడతలో 7,87,524 స్వయం సహాయక సంఘాలు, రెండో విడతలో 7,96,532 సంఘాలు లబ్ధి పొందాయని చెప్పారు. 95 శాతనికి పైగా స్వయం సహాయక సంఘాలు ఎ, బి గ్రేడ్లలో ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. డ్వాక్రా రుణాల్లో 99 శాతం తిరిగి చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు గాను స్కోచ్ అవార్డు కూడా వచ్చిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 80 లక్షల మంది మహిళలకు డిజిటల్ ఆర్థిక లావాదేవిలపై శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.
దిగ్గజ వ్యాపార సంస్థలతో ఎంవోయూలు
సెర్ప్ దిగ్గజ సంస్థలతో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు చేసుకొంది. అమూల్ ఉత్పత్తుల విక్రయానికి ఒప్పందం జరిగింది. స్వయం సహాయక గ్రూపుల మహిళలకు డిజిటల్ లావాదేవీల్లో శిక్షణకు అయికార్ట్æ, సీఎస్‌సీలతో ఎంఓయూలు జరిగాయి. స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, లైవ్లీహుడ్ డైరెక్టర్ విజయకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment