కోర్టు కేసులతో 3,70,201 మందికి అందని ఇళ్ల స్థలాలు | CM Jagan says TDP has unjustly prevented poor people from getting house rails | Sakshi
Sakshi News home page

కోర్టు కేసులతో 3,70,201 మందికి అందని ఇళ్ల స్థలాలు

Published Thu, Jun 17 2021 4:05 AM | Last Updated on Thu, Jun 17 2021 11:35 AM

CM Jagan says TDP has unjustly prevented poor people from getting house rails - Sakshi

సాక్షి, అమరావతి: పేదవాడికి ఇంటి పట్టాలు రాకూడదని టీడీపీ లాంటి ప్రతిపక్షాలు అన్యాయంగా కేసులు వేసి అడ్డుకున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల కారణంగా 3,70,201 మంది పేదలకు ఇళ్ల స్థలాలు రాలేదని అన్నారు. ఇప్పుడు హైకోర్టు సెలవులు కూడా ముగిసినందున, ఈ కేసులపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి రోజూ రివ్యూ చేసి ఈ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా 3.7 లక్షలకుపైగా కుటుంబాలకు ఎనలేని మేలు జరుగుతుందని తెలిపారు.

స్పందనలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేదల గృహ నిర్మాణం,  ఉపాధి హామీ పనులు, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్, ఇళ్ల పట్టాలు, జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారికి  90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ‘ఇప్పటి దాకా వచ్చిన దరఖాస్తుల్లో 1.72 లక్షల మందికిపైగా అర్హులని అధికారులు తేల్చారు. ఇందులో 38 వేల మందికి ఇప్పుడున్న లే అవుట్లలోనే పట్టాలు ఇస్తున్నారు. మరో 9,794 మందికి కొత్త లే అవుట్లలో ఇస్తున్నారు. వీరికి వచ్చే స్పందనలోగా పట్టాలు ఇవ్వాలి. మిగతా 1.24 లక్షల మందికి వీలైనంత త్వరగా భూసేకరణ చేసి పట్టాలు ఇవ్వాలి. పెండింగులో ఉన్న 11,741 దరఖాస్తులను వచ్చే స్పందనలోగా పరిష్కరించాలి’ అని చెప్పారు.

పేదల ఇళ్ల నిర్మాణం
► తొలివిడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. జగనన్న కాలనీలకు సంబంధించి 4,120 చోట్ల తాగునీరు, కరెంటు ఏర్పాటు చేశారు. మిగిలిన కాలనీల్లో జూన్‌ నెలాఖరు కల్లా తాగునీరు, కరెంటు సౌకర్యాల ఏర్పాటు పూర్తి కావాలి. సొంత స్థలాలు ఉన్న వారికి 3.84 లక్షల ఇళ్లు ఇచ్చాం. వాటిని శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి.
► ఇళ్ల నిర్మాణం విషయంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. దీనివల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుస్తాయి. తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 
► ఇసుక రీచ్‌లు 40 కిలోమీటర్ల లోపల ఉంటే, లే అవుట్ల వద్దే ఇసుకను ఇవ్వండి. 40 కిలోమీటర్ల కన్నా దూరంగా ఉంటే.. జేపీ వెంచర్స్‌ లిమిటెడ్‌ ద్వారా లే అవుట్లకు ఇసుకను చేరవేయాలి. జూన్‌ 30లోగా కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై డీపీఆర్‌లు తయారు చేయాలి.

ఉపాధి హామీ పనుల్లో వేగం పెరగాలి
► ఉపాధి హామీ పనుల ప్రగతి మెరుగు పడాల్సి ఉంది. కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. ప్రతి జిల్లాలో మొక్కల పెంపకంపై దృష్టి పెట్టండి. స్కూళ్లు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టి పెట్టండి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్‌ పనులు చురుగ్గా సాగాలి.     ఒక గ్రామంలో ఒకరితోనే కాకుండా పనులను పంపిణీ చేయండి. తద్వారా పనుల్లో ప్రగతి ఉంటుంది.  ఉపాధి హామీ పనుల చెల్లింపులను క్రమం తప్పకుండా ఇస్తున్నాం. గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్కులు, ఆర్బీకేల నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 

బీఎంసీలు–ఏఎంసీలు
► 9,899 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల ఏర్పాటు దశల వారీగా చేపడుతున్నాం. వీటి ద్వారా పాలు పోసే ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా ఒక భరోసా లభిస్తుంది. వారు పోసే పాలు ఏ క్వాలిటీ, ఎన్ని లీటర్లు, ఎంత డబ్బు వస్తుందన్నది అక్కడికక్కడే స్లిప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 
► వారి కళ్ల ముందే, వాళ్ల ఊరులోనే ఈ రకమైన సౌకర్యం పొందవచ్చు. దీనివల్ల ఎలాంటి మోసానికి ఆస్కారం ఉండదు. ఈ కార్యక్రమం పైన కూడా కలెక్టర్లు దృష్టి పెట్టండి.
 
డిజిటల్‌ లైబ్రరీలు
► ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ తీసుకువస్తున్నాం. డిసెంబర్‌ నాటికల్లా సుమారు 2,824 గ్రామ పంచాయతీలకు ఫైబర్‌ గ్రిడ్‌ చేరుతుంది. అక్కడ స్థలాలు గుర్తించి, లైబ్రరీలు నిర్మించడంపై దృష్టి పెట్టాలి.
► ఎన్‌ఆర్‌జీఎస్‌ పనులను జేసీ డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలి. సెకండరీ ఫుడ్‌ప్రాసెసింగ్‌ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వచ్చే స్పందన నాటికి భూములు గుర్తించాలి.  
► జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమం కోవిడ్‌ కారణంగా ఆశించినంత వేగంగా కదలడం లేదు. ఇది పూర్తైతే వివాదాలకు పూర్తిగా చెక్‌ పడుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం ప్రగతిని పర్యవేక్షిస్తాను.
► జూన్‌ 22న చేయూత పథకాన్ని, జూలైలో విద్యా దీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తాం. జూలై 1న వైఎస్సార్‌ బీమా ప్రారంభం అవుతుంది. వీటికి కలెక్టర్లు  సిద్ధం కావాలి. 
► జూన్‌ 17 నుంచి జూలై 2 వరకు భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహించబోతున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. భవనాల వారీగా విశ్లేషణ, రోజువారీ సమీక్షలు, పనులు శీఘ్రగతిన జరిగేలా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement