దేవుడి భూములకు విముక్తి | Geo-tagging of 65000 places of worship for security Temple lands | Sakshi
Sakshi News home page

దేవుడి భూములకు విముక్తి

Published Mon, Oct 25 2021 2:02 AM | Last Updated on Mon, Oct 25 2021 2:06 AM

Geo-tagging of 65000 places of worship for security Temple lands - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లగా దేవుడి భూములను ఆక్రమించుకొని హైకోర్టు, ఇతర కింది స్థాయి కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటూ.. సుదీర్ఘ కాలం పాటు కోర్టు కేసు వాయిదాల పేరుతో అక్రమంగా అనుభవిస్తున్న వారికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ తరహా కేసులను సత్వరమే పరిష్కరించి ఆక్రమణదారుల చెరలో ఉన్న దేవుడి భూములను విడిపించేందుకు ప్రతి జిల్లాకు వేర్వేరుగా ప్రత్యేక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ ఆక్రమణదారుల విషయంలో ప్రభుత్వ పరంగా కఠిన శిక్షలు అమలు చేసేందుకు దేవదాయ శాఖ చట్టానికి పలు సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇటీవల దేవదాయ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ (నిర్ణయాల ముసాయిదా)ను దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం తాజాగా సిద్ధం చేసింది. పెద్ద సంఖ్యలో దేవుడి భూములు ఆక్రమణకు గురైనట్టు దేవదాయ శాఖ అధికారులు తేల్చినా, వాటిని విడిపించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలు కనీస చర్యలు చేపట్టలేదు. 

పెండింగ్‌లో 8,254 ఆక్రమణ కేసులు 
► దేవదాయ శాఖ పరిధిలో ఉండే మొత్తం ఆలయాల పేరిట 4,09,226 ఎకరాల దేవుడి భూములు ఉన్నాయి. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 66,478.17 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. వాటిలో కొన్ని మూడు నాలుగేళ్లుగా.. మరికొన్ని 50–60 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్నాయి. 
► మరో 17,839 ఎకరాలకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణీత లీజు గడువు ముగిసినా సంబంధిత లీజుదారులు ఆ భూములను ఖాళీ చేయకుండా వాటిని అనుభవిస్తున్నారు.
► 10,247.50 ఎకరాల సర్వీసు ఇనాం భూములకు సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో, అంతకు ముందు.. కొందరు రైతు వారీ పట్టాలు పుట్టించుకొని, ఆ దేవుడి భూములకు తామే యజమానులుగా చలామణీ అవుతున్నారు.
► మొత్తంగా 1.12 లక్షల ఎకరాల దేవుడి భూములకు సంబంధించి ఎక్కడికక్కడ ఆలయాల ఈవోలు, జిల్లా దేవదాయ శాఖ అధికారులు కోర్టుల్లో కేసులు దాఖలు చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇలాంటివి 8,254 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. 
► ఇందులో రాష్ట్ర హైకోర్టులోనే 2,727 కేసులు (భూ ఆక్రమణలు, ఆలయాలకు సంబంధించిన ఇతర కేసులు) పెండింగ్‌లో ఉన్నాయి. కింది స్థాయి కోర్టుల్లో సివిల్‌ కేసుల రూపంలో 1,230, దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో 4,297 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరిలో అత్యధికం
► వ్యవసాయ భూములకు అత్యధిక విలువ ఉండే తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దేవుడి భూముల ఆక్రమణకు సంబంధించిన కేసులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
► కృష్ణా జిల్లాలో 1,915 కేసులు,  తూర్పు గోదావరి జిల్లాలో 1,338, గుంటూరు జిల్లాలో 876 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.  
► అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది.

ఎస్పీల నేతృత్వంలో కమిటీల ఏర్పాటు 
► హైకోర్టుతో పాటు కింది స్థాయి కోర్టుల్లో ఉన్న కేసుల్లో కాలయాపన కాకుండా సత్వర న్యాయ పరిష్కారం కోసం జిల్లాకో స్టాండింగ్‌ కౌన్సిల్‌ (న్యాయవాదుల టీం) ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దేవదాయ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. 
► దేవదాయ శాఖలో ఏడు పెద్ద ఆలయాలు.. శ్రీశైలం, అన్నవరం, దుర్గ గుడి, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, సింహాచలం, కాణిపాకం ఆలయాలతో పాటు వేలాది ఎకరాల భూములున్న మాన్సాస్‌ ట్రస్టు కేసులకు వేరుగా ప్రత్యేక స్టాండింగ్‌ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
► ఆదాయం తక్కువగా ఉండే ఆలయాలకు సంబంధించి భూములు ఆక్రమణకు గురైన చోట, ఆయా ఆలయాలకు కోర్టు కేసుల ఖర్చులను సీజీఎఫ్‌ నిధుల నుంచి కొంత మొత్తం అందజేసే అంశంపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌తో చర్చించి జిల్లాకో స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
► దేవుడి భూముల ఆక్రమణల విషయంలో కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ నేతృత్వంలో సర్వే శాఖ ఏడీ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్‌ కమిషనర్లతో అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమై కోర్టు తీర్పులకు అనుగుణంగా అక్రమణదారుల నుంచి దేవుడి భూములను స్వాధీనం చేసుకుంటుంది. 

ఆలయాలకు పటిష్ట భద్రత
ప్రభుత్వంపై దుష్ప్రచారం, మత విద్వేషాలను రగిల్చేందుకు కొన్ని పార్టీలు ఆలయాలు, ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు, దేవదాయ శాఖలు సమన్వయంతో ఆరు విధాలుగా కార్యాచరణ చేపట్టాయి. ఆ వివరాలు ఇలా.. 
► రాష్ట్రంలో మతపరమైన ప్రాధాన్యం, గుర్తింపు ఉన్న 65,299 ప్రదేశాలను మ్యాపింగ్‌ చేసి, జియో ట్యాగింగ్‌ చేశారు. రాకపోకలు, అనుమానితుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు. 
► అన్ని ప్రధాన ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల వద్ద మొదటి దశలో 51,053 సీసీ కెమెరాలను అమర్చారు.
► రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో ప్రభుత్వం సోషల్‌ ఆడిట్‌ నిర్వహించింది. భద్రతాపరమైన మౌలిక వసతులు కచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టింది. అగ్నిమాపక పరికరాలు, జనరేటర్, వాచ్‌మేన్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. నిర్దేశిత కాలపరిమితితో మౌలిక వసతుల కల్పన, ఇతర సిబ్బంది నియామకం పూర్తి చేసేలా పర్యవేక్షించింది. 
► ఆలయాలు, ప్రార్థనా మందిరాల భద్రత కోసం స్థానికులతో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేస్తోంది.  ఇప్పటికే 18,895 గ్రామ రక్షక దళాలలను నియమించింది.  
► అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆలయాల్లో విధ్వంసం కేసుల్లో 632 మందిని అరెస్టు చేసింది. వీరిలో వీరిలో 323 మంది టీడీపీ హయాంలో ఆలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన వారు కావడం గమనార్హం. ఈ తరహా కేసుల్లో గత ప్రభుత్వ ఉదాసీనతకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. 
► గుప్త నిధుల కోసం ఆలయాల్లో తవ్వకాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలకు పోలీసులు సమర్థంగా చెక్‌ పెట్టారు. ఇప్పటి వరకు ఏడు అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్టు చేశారు. 

ఆలయ భూముల వివరాలు (ఎకరాల్లో)
మొత్తం భూములు : 4,09,229  
మూడేళ్లు, అంతకు ముందు నుంచే ఆక్రమణలో ఉన్నవి : 66,478.17 
అక్రమంగా రైతు వారీ పట్టాలు పుట్టించుకున్నవి : 10,247.50  
గడువు ముగిసినా లీజుదారుల ఆధీనంలోనే ఉన్నవి : 17,839 
రెవిన్యూ రికార్డుల మేరకు దేవుడి భూములుగా కొత్తగా వెలుగులోకి వచ్చినవి :18,221.89 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement