నామినేటెడ్ పదవుల జాబితాను ప్రకటిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ. చిత్రంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఎంపీ సురేష్, హోం మంత్రి సుచరిత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
సాక్షి, అమరావతి: రాజకీయంగా సామాజికన్యాయ సాధన దిశగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయ సాధనలో స్వర్ణయుగాన్ని తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. మహిళలకు సమున్నత స్థానం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా 58 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మహిళలకు ఏకంగా 50.40 శాతం పదవులు దక్కాయి.
రాష్ట్ర ప్రభుత్వం శనివారం 137 నామినేటెడ్ పదవులను ప్రకటించగా వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 79 పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళలకు 69 పదవులు ఇవ్వడం విశేషం. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు నామినేటెడ్ పదవుల్లో సమ ప్రాధాన్యమిచ్చారు. 13 జిల్లాల్లోని అన్ని రెవెన్యూ డివిజన్లకూ ప్రాతినిధ్యం కల్పిస్తూ పదవులను ప్రకటించారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన అర్హులు, సమర్థులైన నేతలను నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయడం ద్వారా తగిన గుర్తింపునిచ్చారని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు పెద్దపీట
రాజకీయ అధికారాన్ని కల్పించడం ద్వారానే బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించగలరన్న తన విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అనుసరించారు. కేవలం రిజర్వేషన్లు ఉన్న స్థానాలకే వారిని పరిమితం చేయాలన్న గత పాలకులకు భిన్నంగా నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కనీసం 50 శాతం పదవులు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా చట్టం తీసుకురావడం ద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆ చిత్తశుద్ధిని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపిస్తూ ప్రభుత్వం శనివారం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకు 58 శాతం పదవులు కేటాయించడం విశేషం. మొత్తం 137 పదవుల్లో ఆ వర్గాలకు ఏకంగా 79 పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అందులో కూడా కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్లుగా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారిని ఎంపిక చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీ టిడ్కో, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ), రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, విశాఖపట్నం–కాకినాడ పెట్రోలియం– కెమికల్ – పెట్రో కెమికల్ పెట్టుబడుల సంస్థ, విశాఖపట్నం రీజనల్ మెట్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (వీఎంఆర్డీఏ), సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్, ఎడ్యుకేషన్ వెల్ఫేర్–ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు, సాహిత్య అకాడమి.. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్, గిరిజన సహకార సంస్థ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ మొదలైన కీలక సంస్థల చైర్మన్ పదవులను బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వర్గాలకు అన్ని జిల్లాల్లోనూ కనీసం 50 శాతం పదవులు దక్కేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.
మహిళ సాధికారత దిశగా ముందడుగు
మహిళలకు అన్ని రకాల అవకాశాల్లోనూ సగభాగం కల్పించడమే తన విధానమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తున్నారు. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లోనూ అదే విధానాన్ని అనుసరించారు. ఏకంగా 50.40 శాతం పదవులు వీరికి కేటాయించడం ద్వారా తాను మహిళా పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారు. శనివారం ప్రకటించిన 137 పదవుల్లో మహిళలకు ఏకంగా 69 పదవులు ఇవ్వడం విశేషం. అత్యంత ప్రాముఖ్యమైన కార్పొరేషన్లకు మహిళలను చైర్‌పర్సన్లుగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్కాబ్, రాష్ట్ర సైన్స్ – టెక్నాలజీ కార్పొరేషన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ), రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఐడీసీ), రాష్ట్ర పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్, గిరిజన సహకార సంస్థ, విశాఖపట్నం రీజనరల్ మెట్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (వీఎంఆర్డీఏ), విశాఖపట్నం–కాకినాడ పెట్రోలియం – కెమికల్ – పెట్రో కెమికల్ పెట్టుబడుల సంస్థ, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి, సాహిత్య అకాడమి, రాష్ట్ర నాటక అకాడమి, రాష్ట్ర దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కార్పొరేషన్ మొదలైన కీలకమైన కార్పొరేషన్ల చైర్‌పర్సన్ పదవులను మహిళలకే కేటాయించారు. వారిలో అత్యధికులు రాజకీయంగా పెద్దగా గుర్తింపు లేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గుంటూరులోని 23వ వార్డులో వలంటీర్‌గా ఉన్న పఠాన్ ముంతాజ్‌ను రాష్ట్ర దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమించడమే ఇందుకు తార్కాణం. అన్ని జిల్లాల్లోనూ మహిళలకు సమ ప్రాధాన్యమిచ్చారు.
ఇది సామాజిక న్యాయ స్వర్ణయుగం
► అణగారిన వర్గాల రాజకీయ, ఆర్థిక అభ్యున్నతి సాధనే ఏకైక లక్ష్యంగా రాష్ట్రంలో సామాజిక న్యాయ స్వర్ణ యుగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారు. అందుకోసం రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం కేటాయించడం వైఎస్సార్‌సీపీ విధానంగా ఆయన ఎన్నికల ముందే ప్రకటించారు.
► 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతానికిపైగా సీట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సంప్రదాయంగా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్న కర్నూలు, అనంతపురం, హిందూపురం, రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గాలను కూడా తొలిసారిగా బీసీలకు కేటాయించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.
► ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలోనూ ఏకంగా 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు.
► ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవినీ బీసీ వర్గాలకు ఇచ్చారు. అనంతరం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించారు. ఆ ప్రకారమే దేవలయాలు, మార్కెట్ కమిటీలు, ఇతర పాలక మండళ్లలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులు ఇచ్చారు.
► నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు బీసీలనే ఎంపిక చేశారు. తొలిసారిగా శెట్టిబలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాస్ చంద్రబోస్, మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించారు.
► 2019లో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ తరఫున, గవర్నర్ కోటాలో 15 మందిని ఎమ్మెల్సీలుగా శాసనమండలికి పంపారు. వీరిలో 11 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషం. ఎస్సీలకు 4, బీసీలకు 4, మైనార్టీలకు 3 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు.
► 11 మున్సిపల్ మేయర్లు, 74 మున్సిపల్ చైర్‌పర్సన్ల పదవుల్లో 78 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. ఈ పదవులన్నింటిలో 60.46 శాతం మహిళలకు ఇవ్వడం విశేషం.
► రాష్ట్రంలో తొలి సారిగా బీసీ వర్గాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. 2019 ఎన్నికల ముందు కూడా బీసీ వర్గానికి చెందిన సుభాస్ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తిలను ఎమ్మెల్సీలు చేశారు.
► మాల, మాదిగ, రెల్లి కులాలకు వేర్వేరు కార్పొరేషన్ల ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు.
► జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం టికెట్లు ఇచ్చారు. మొత్తం టికెట్లలో మహిళలకు 50 శాతం కేటాయించడం విశేషం. అయితే కోర్టులో కేసు కారణంగా ఈ ఎన్నికల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment