AP CM YS Jagan Video Conference With Collectors On Spandana About Coronavirus Pandemic Situation, Vaccination process - Sakshi
Sakshi News home page

తగ్గిందని అలసత్వం వద్దు

Published Thu, Jun 17 2021 3:05 AM | Last Updated on Thu, Jun 17 2021 12:08 PM

CM Jagan Video Conference With Collectors On Spandana about Covid - Sakshi

పర్యవేక్షణ చాలా ముఖ్యం 
కేసులు తగ్గినప్పుడు కాస్త రిలాక్స్‌ మూడ్‌ వస్తుంది. ఇలాంటి సమయంలో కలెక్టర్లు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి మొత్తం సమీక్షించుకుని తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 439 ఆస్పత్రులు నిర్వహిస్తున్నాం. ఈ ఆస్పత్రుల్లో పర్యవేక్షణ అన్నది చాలా ముఖ్యం. ఆరోగ్య మిత్రలు చురుగ్గా పనిచేసేలా చూడాలి. నోడల్‌ ఆఫీసర్లు పర్యవేక్షించాలి. 

సడలింపులతో కర్ఫ్యూ 
మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చింది. కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతోంది. జూన్‌ 20 తర్వాత సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాలి. జాగ్రత్తలు తీసుకుంటూనే కోవిడ్‌ను ఎదుర్కోవాలనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. 

104తో పరిష్కారం
104 నంబర్‌ను ఓన్‌ చేసుకోవాలి. కాల్‌ చేయగానే స్పందన ఉండాలి. మనకు కాల్‌ చేసిన తర్వాత వైద్యులు కాల్‌ చేయడం, వారి యోగ క్షేమాలు కనుక్కోవడం, బెడ్స్‌ ఇప్పించడం చేయాలి. కోవిడ్‌ సంబంధిత అంశాలకు సంబంధించి 104 అనేది ఒన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి.  

మూసేయడానికి వెనుకాడొద్దు 
కోవిడ్‌ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి. రెండోసారి కూడా తప్పు చేస్తే 
క్రిమినల్‌ కేసులు పెట్టాలి. అలాంటి వాటిని మూసి వేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దు. 

సాక్షి, అమరావతి:  కోవిడ్‌ కేసులు తగ్గుతున్నాయని రిలాక్స్‌ అవ్వొద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. కోవిడ్‌ జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలన్నారు. కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్‌ వేవ్‌పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి స్పందనలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఫీవర్‌ సర్వేలో కోవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించి, ఫోకస్డ్‌గా (లక్షణాలు ఉన్నవారిపైనే దృష్టి సారించడం)  వారికే టెస్ట్‌లు చేయాలని.. గ్రామాల్లో ఫీవర్‌ సర్వే ప్రతి వారం కొనసాగాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేసి పరీక్షలు చేయాలని, ఎవరు కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని చెప్పారు. ఎవరైనా పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. వచ్చే వారంలో కేసులు ఇంకా తగ్గుముఖం పడతాయని, బహుశా ఈ స్థాయిలో టెస్టుల అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. జాగ్రత్తలు తీసుకుంటూనే కోవిడ్‌ను ఎదుర్కోవాలనే విషయాన్ని మనం ఎప్పటికీ మరిచిపోకూడదని చెప్పారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని.. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలని, ఇవి మన జీవితంలో భాగం కావాలని సూచించారు. జూన్‌ 20 తర్వాత కొన్ని సడలింపులిస్తూనే కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉందన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు 

కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పని చేశారు.. 
► కోవిడ్‌ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పని చేశారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుతోంది.
► పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోంది. మే 15న 25.56 శాతానికి పైగా పాజిటివిటీ ఉంటే.. ప్రస్తుతం 5.97 శాతం ఉంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయకుండా, సమాజంలో ఏ వర్గాన్నీ కష్టపెట్టకుండా చేయగలిగాం. 
► ఈ సీజన్‌లో బాధితుల్లో 89 శాతం మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారు. ఈ విషయంలో కలెక్టర్లందరికీ అభినందనలు. ఈ రోజు 16,112 మందికి కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ జరుగుతుంటే.. 14,359 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.

104 సేవలు గర్వకారణం
► 104 నంబర్‌ను తప్పనిసరిగా ఓన్‌ చేసుకోవాలి. గడిచిన 2 నెలల్లో 104 నంబర్‌ ద్వారా 5 లక్షల ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ వస్తే, 6.65 లక్షల అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ చేశాం. ఇది చాలా గర్వకారణం.104కు రోజుకు గరిష్టంగా 19 వేల కాల్స్‌ వచ్చాయి. ప్రస్తుతం 3 వేల కాల్స్‌ వస్తున్నాయి. కేసులు తగ్గాయనడానికి ఇదే నిదర్శనం.
► 104 కు కాల్‌ చేయగానే కచ్చితంగా స్పందన ఉండాలి. మనకు కాల్‌ చేసిన తర్వాత వైద్యులు కాల్‌ చేయడం, వారి యోగ క్షేమాలు కనుక్కోవడం, బెడ్స్‌ ఇప్పించడం చేయాలి. కోవిడ్‌ సంబంధిత అంశాలకు సంబంధించి 104 అనేది వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి. 

సేవల్లో నాణ్యత.. 
► ఆస్పత్రుల సేవల్లో నాణ్యత చాలా ముఖ్యం. సీరియస్‌నెస్‌ ఎప్పుడూ తగ్గకూడదు. రోగులకు అందిస్తున్న ఆహారం, సేవలు బాగుండాలి. పారిశుధ్యం, మందులు, సిబ్బంది, హెల్ప్‌ డెస్క్, ఆరోగ్య మిత్ర, సీసీ టీవీలు తదితర అంశాల్లో చక్కటి పనితీరు, సేవల్లో నాణ్యత ఉండాలి.  
► ప్రతివారం ఫీవర్‌ సర్వేతో పాటు వారానికి ఒకసారి ఫీవర్‌ క్లినిక్స్‌ కూడా కచ్చితంగా నిర్వహించాలి. మనం గుర్తిస్తున్న అంశాలను ఫాలో అప్‌ చేయాలి. 104 కాల్‌ సెంటర్‌ ద్వారా వైద్యులతో టెలిమెడిసిన్‌ వైద్యం కొనసాగాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం.

ఆ మూడు ఆస్పత్రులకు భూములు గుర్తించాలి
► పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నాం. వైజాగ్‌లో ఒకటి, కృష్ణా–గుంటూరు ప్రాంతంలో ఇంకొకటి, తిరుపతిలో మరొకటి తీసుకు వస్తున్నాం. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా వీటిని నిర్మిస్తున్నాం. వీటికి సంబంధించి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలి.
► వీటితోపాటు కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులను మొదలు పెడుతున్నాం. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేవలం 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉంటే, రెండేళ్ల కాలంలో మనం 16 ఆస్పత్రుల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. 11 పాత బోధనాస్పత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. 

వ్యాక్సినేషన్‌
► వ్యాక్సినేషన్‌ అన్నది చాలా ముఖ్యమైనది. వ్యాక్సినేషన్‌ కెపాసిటీ దేశమంతటా పెరగాల్సిందే. ఆలోగా మనకు వచ్చే వ్యాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలి. మన, పర భేదం చూపొద్దు. మనం కరెక్టుగా ఉంటే.. వ్యవస్థలు కూడా సక్రమంగా నడుస్తాయి. 
► మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటే.. ఇందులో 26,33,351 మందికి మాత్రమే రెండు డోసులు ఇవ్వగలిగాం. మరో 69,04,710 మందికి ఒకడోసు మాత్రమే ఇచ్చాం. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అందుకనే నిర్దేశించుకున్న విధివి«ధానాల ప్రకారం వ్యాక్సినేషన్‌ కొనసాగించాలి.  
► ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించండి
► కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రేట్ల కన్నా.. ఎక్కువ చార్జి చేయకూడదు. అలా ఎవరైనా వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 
► ఆ విధంగా వసూలు చేసిన ఆస్పత్రులను మూసి వేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దు. మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకుతినే ఆలోచనలు ఉన్న వారిపై కఠినంగా వ్యవహరించాలి. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి. రెండోసారి కూడా తప్పు చేస్తే క్రిమినల్‌ కేసులు పెట్టాలి. 

కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌పై కార్యాచరణ
► థర్డ్‌ వేవ్‌ వస్తుందో, రాదో మనకు తెలియదు. సన్నద్ధంగా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెబుతున్నారు. వారికి చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి. 
► జిల్లా స్థాయిలో వచ్చే 2 నెలలకు తగినట్లుగా కార్యాచరణ సిద్ధం చేసి, అమలు చేయాలి. టీచింగ్‌ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్ల క్వాలిటీని పరిశీలించండి. శిశువులకు వైద్యం అందించే విషయంలో సదుపాయాల్లో నాణ్యత ఉందా.. లేదా.. చూడండి.
► సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉంచేలా చూసుకోండి. వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా.. లేవా.. తనిఖీ చేయాలి. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోండి. సీహెచ్‌సీ స్థాయి వరకు మందులు అందుబాటులో ఉంచుకోండి. 
► జిల్లాలో చిన్న పిల్లల వైద్యులు ఎక్కడ ఉన్నారు? ఎంత మంది ఉన్నారు? అన్నదానిపై మ్యాపింగ్‌ చేయండి. అవసరమైన సమయంలో వారి సేవలను మనం వినియోగించుకునేలా ఉండాలి. అవసరమైన వారిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్‌ చేస్తూనే, మిగిలిన వారిని కూడా మ్యాపింగ్‌ చేయాలి.
► శిశువులు, చిన్న పిల్లలకు వైద్యం విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి.

ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటు.. ప్రోత్సాహకాలు
► దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ప్రైవేటు సెక్టార్‌లో సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి కార్పొరేషన్‌లో 16 చోట్ల ప్రైవేటు మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను పెట్టించడానికి ప్రోత్సాహకంగా భూములు ఇవ్వాలని నిర్ణయించాం.
► మూడేళ్ల కాలంలో రూ.100 కోట్లు ఆస్పత్రి రూపేణా పెట్టుబడి పెట్టాలి. ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాలకు నలువైపులా ఈ ప్రైవేటు ఆస్పత్రులు వచ్చేలా చూడాలి. వీటిని ఆరోగ్య శ్రీతో ఎంప్యానెల్‌ చేస్తాం. అప్పుడే పేద వాడికి ఉచితంగా మంచి వైద్యాన్ని అందించ గలుగుతాం. ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి మార్గదర్శకాలు తయారు చేస్తున్నారు. దీనిపై కలెక్టర్లు దృష్టి సారించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement