![CM Jagans high review on the new variant of Corona - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/23/ys%20jagan%20sir.jpg.webp?itok=Te9Mml4V)
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘జేఎన్ – 1’ వ్యాప్తి నేపథ్యంలో కట్టడి చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత బలమైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను అప్రమత్తం చేయాలని సూచించారు.
శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆస్పత్రులకు రాకుండానే రికవరీ
జేఎన్–1 వేరియంట్‌పై ప్రస్తుతానికి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. దీని బారిన పడ్డవారు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆస్పత్రుల వరకూ రాకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. దీనికి డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తెలిపారు. అయితే జేఎన్–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందన్నారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్‌కు తరలించి వేరియంట్‌లను విశ్లేషిస్తున్నామన్నారు.
సచివాలయాల్లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్, ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చికిత్సకు అవసరమైన మందులన్నీ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ సదుపాయాలను సిద్ధం చేస్తున్నామన్నారు. పీఎస్‌ఏ ప్లాంట్లు సత్వర వినియోగానికి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, డి–టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు ఇందులో పాల్గొన్నారు.
సన్నద్ధత ఇలా..
♦ రాష్ట్రవ్యాప్తంగా జీజీహెచ్‌లలోని 13 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను యాక్టివేట్ చేసిన వైద్య శాఖ. రోజుకు కనీసం వెయ్యి పరీక్షల నిర్వహణ.
♦ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ ఉన్న రోగులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణ.
♦ వైరస్ అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేలా గ్రామ/వార్డు సచివాలయాల్లో ఐదు చొప్పున ర్యాపిడ్ కిట్‌లు అందుబాటులో.
♦ శబరిమల, కేరళ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకు స్క్రీనింగ్. వీరిపై ప్రత్యేకంగా ఫోకస్.
♦ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 12,292 జనరల్, 34,763 ఆక్సీజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకల చొప్పున మొత్తం 56,741 పడకలు అందుబాటులో.
Comments
Please login to add a commentAdd a comment