రెండు సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి దెబ్బకు బతుకులు దయనీయంగా మారిన తీరు అందరికీ జ్ఞాపకం ఉంది. కొన్నాళ్లపాటు లాక్‌డౌన్ పేరున అందరూ తలుపులు పెట్టుకుని ఇళ్లలోనే బందీలు అయిన సంగతి వెంటాడుతూనే ఉన్నది. అయినా చాలా మంది మూతికి మాస్కులు పెట్టుకోవాలి అన్న సంగతి మరచిపోయారు. గుంపులు గుంపులుగా చేరడం గురించి ఎవరూ భయపడడం లేదు. చేతులు, పరిసరాలను శానిటైజ్ చేసుకోవడమూ తగ్గిపోయింది. బహుశా కోవిడ్ కేసులు బాగా తగ్గిపోవడం వల్లనే చాలామంది ఇలా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నట్టున్నారు. అయితే కోవిడ్ పీడ ఇంతటితో విరగడైందని భావించరాదు. మహమ్మారి మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
‘సైన్స్’ పత్రికలో గ్రెచెన్ ఫోగెల్ అనే పరిశోధకుడు ఈ మధ్యనే ఒక పరిశోధన పత్రం వెలువరించాడు. మరొక పెద్ద కోవిడ్ వేవ్ రానున్నదని ఆ పత్రంలో ఆయన ప్రకటించాడు. కోవిడ్ గురించి బాగా పట్టించుకున్న వాళ్లకు ఒమిక్రాన్ అన్న పేరు జ్ఞాపకం ఉంటుంది. సార్స్ కోవ్ 2 అనే వైరస్ వల్ల కోవిడ్ వచ్చిందని తెలుసు. ఆ వైరస్‌లో జన్యు మార్పులు జరిగి కొత్త రకాలు వచ్చినట్టు కూడా తెలుసు. అందులో చివరిది ఒమిక్రాన్. అది కూడా మళ్లీ ఒకసారి మార్పులకు గురైందట. ఫలితంగా వచ్చిన మరో కొత్త రకానికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తట్టుకునే బలం ఎక్కువగా ఉందట. అటువంటి రకాలు ఒకటి కన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పరిశోధకులు.
చలికాలం ముంచుకు వస్తున్నది. అప్పటికల్లా ఈ కొత్త రకాలు తలెత్తవచ్చు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద కొత్త కోవిడ్ కేసులు బాగా తరిగిన మాట వాస్తవమే. కానీ చైనా, యూరప్‌లలో అవి మళ్లీ తలెత్తుతున్నాయి. యూరప్‌లో వచ్చిన కేసులను బాగా పరిశీలించారు. అక్కడ రెండు రకాల వైరస్‌లు కనిపించాయి. అవి రెండూ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే బలం గలవని కూడా తెలిసింది.
టీకా వేయించుకున్న వారికీ, అంతకుముందు వ్యాధి వచ్చి తగ్గిన వారికి కూడా ఈ కొత్త వైరస్ రకాల వల్ల వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అమెరికా లాంటి దేశాలలో ఎక్కువ వైరస్ రకాల మీద పనిచేయగల వ్యాక్సిన్లను ఇచ్చారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ ఎక్కడ వచ్చినా ప్రపంచమంతటా వ్యాపించడానికి అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ‘సైన్స్’ వ్యాసంలో వ్యాధి ముందుగా అమె రికా, యూరప్‌లలో కని పిస్తుంది అని వివరించారు.
కరోనా వైరస్ కనిపించకుండా పోయింది, ఇక వచ్చే అవకాశం లేదు అని చాలామంది భ్రమలో ఉన్నారు. కానీ ఈ కొత్తరకం వైరస్‌లు త్వరలోనే ప్రపంచాన్ని మళ్లీ గడగడలాడించ నున్నాయని మరికొన్ని పత్రికలు కూడా రాశాయి. కొత్త వేవ్‌ను తట్టుకునేందుకు ఏం చేయాలనే సంగతులపైనా పరిశోధనలు మొదలయ్యాయి. ప్రస్తుతం బీఏ 2.75.2, బీక్యూ 2.1 అనే స్ట్రెయిన్లు కొత్తగా కనిపిస్తున్నాయి.
మనిషిలోని రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే బలం ఈ రెంటిలోనూ ఇంతకు ముందు వచ్చిన అన్నిరకాల కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశోధకులు. ఇందులో బీక్యూ 2.1 రకం త్వరగా వ్యాపిస్తుంది కూడా! త్వరలోనే ఇది ప్రపంచమంతటా ఉత్పాతం కలిగిం చనుందనేది పరిశోధకుల అభి ప్రాయం. ఈ చలి కాలంలో వైరస్ గనుక వచ్చిందంటే దానితో పోరాడ డానికి అన్ని రకాలా మనం సిద్ధంగా ఉండాలి అని వారు హెచ్చ రిస్తున్నారు. వ్యాధి వచ్చినప్పుడు తొందరగా ఏదో చేయాలని టీకాలు వేశారు తప్పిస్తే, ఎక్కువ కాలం ఆ వ్యాక్సిన్లు పనిచేసే తీరును గురించి పరిశీలించడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆ దిశలోనూ శోధన జరగాలి.
శాస్త్రవేత్తలు జనాన్ని భయపెట్టడం కోసం ఇటువంటి హెచ్చ రికలు చేయడం లేదు. రానున్న ముప్పు గురించి ముందుగానే జాగరూకులను చేయడం వారి విధి. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత. మన అజాగ్రత్త మరో మృత్యుహేలను సృష్టిస్తుందనేది అందరూ గుర్తించాలి.
కేబీ గోపాలం
వ్యాసకర్త అనువాదకుడు, రచయిత
Comments
Please login to add a commentAdd a comment