precautions must
-
Holi 2024: జాలీగా, హ్యాపీగా...ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!
పిల్లా పెద్దా అంతా సరదగా గడిపే రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహం గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం, నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణం కంటి గాయాలకు గురవుతున్న అనేక సంఘటనలు జరుగుతాయి.అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం. మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలను గమనించాలి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు , ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం , ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి.ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకుదారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం. సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగదు. పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి. లోషన్ లేదా నూనె : హోలీ ఆడటానికి వెళ్లే కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్‌ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు. దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని. రంగులనుఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలిన కోరుతూ హ్యాపీ హోలీ. -
జాగ్రత్తలు పాటించాల్సిందే!
రెండు సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి దెబ్బకు బతుకులు దయనీయంగా మారిన తీరు అందరికీ జ్ఞాపకం ఉంది. కొన్నాళ్లపాటు లాక్డౌన్ పేరున అందరూ తలుపులు పెట్టుకుని ఇళ్లలోనే బందీలు అయిన సంగతి వెంటాడుతూనే ఉన్నది. అయినా చాలా మంది మూతికి మాస్కులు పెట్టుకోవాలి అన్న సంగతి మరచిపోయారు. గుంపులు గుంపులుగా చేరడం గురించి ఎవరూ భయపడడం లేదు. చేతులు, పరిసరాలను శానిటైజ్ చేసుకోవడమూ తగ్గిపోయింది. బహుశా కోవిడ్ కేసులు బాగా తగ్గిపోవడం వల్లనే చాలామంది ఇలా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నట్టున్నారు. అయితే కోవిడ్ పీడ ఇంతటితో విరగడైందని భావించరాదు. మహమ్మారి మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘సైన్స్’ పత్రికలో గ్రెచెన్ ఫోగెల్ అనే పరిశోధకుడు ఈ మధ్యనే ఒక పరిశోధన పత్రం వెలువరించాడు. మరొక పెద్ద కోవిడ్ వేవ్ రానున్నదని ఆ పత్రంలో ఆయన ప్రకటించాడు. కోవిడ్ గురించి బాగా పట్టించుకున్న వాళ్లకు ఒమిక్రాన్ అన్న పేరు జ్ఞాపకం ఉంటుంది. సార్స్ కోవ్ 2 అనే వైరస్ వల్ల కోవిడ్ వచ్చిందని తెలుసు. ఆ వైరస్‌లో జన్యు మార్పులు జరిగి కొత్త రకాలు వచ్చినట్టు కూడా తెలుసు. అందులో చివరిది ఒమిక్రాన్. అది కూడా మళ్లీ ఒకసారి మార్పులకు గురైందట. ఫలితంగా వచ్చిన మరో కొత్త రకానికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తట్టుకునే బలం ఎక్కువగా ఉందట. అటువంటి రకాలు ఒకటి కన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పరిశోధకులు. చలికాలం ముంచుకు వస్తున్నది. అప్పటికల్లా ఈ కొత్త రకాలు తలెత్తవచ్చు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద కొత్త కోవిడ్ కేసులు బాగా తరిగిన మాట వాస్తవమే. కానీ చైనా, యూరప్‌లలో అవి మళ్లీ తలెత్తుతున్నాయి. యూరప్‌లో వచ్చిన కేసులను బాగా పరిశీలించారు. అక్కడ రెండు రకాల వైరస్లు కనిపించాయి. అవి రెండూ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే బలం గలవని కూడా తెలిసింది. టీకా వేయించుకున్న వారికీ, అంతకుముందు వ్యాధి వచ్చి తగ్గిన వారికి కూడా ఈ కొత్త వైరస్ రకాల వల్ల వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అమెరికా లాంటి దేశాలలో ఎక్కువ వైరస్ రకాల మీద పనిచేయగల వ్యాక్సిన్లను ఇచ్చారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ ఎక్కడ వచ్చినా ప్రపంచమంతటా వ్యాపించడానికి అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ‘సైన్స్’ వ్యాసంలో వ్యాధి ముందుగా అమె రికా, యూరప్‌లలో కని పిస్తుంది అని వివరించారు. కరోనా వైరస్ కనిపించకుండా పోయింది, ఇక వచ్చే అవకాశం లేదు అని చాలామంది భ్రమలో ఉన్నారు. కానీ ఈ కొత్తరకం వైరస్లు త్వరలోనే ప్రపంచాన్ని మళ్లీ గడగడలాడించ నున్నాయని మరికొన్ని పత్రికలు కూడా రాశాయి. కొత్త వేవ్‌ను తట్టుకునేందుకు ఏం చేయాలనే సంగతులపైనా పరిశోధనలు మొదలయ్యాయి. ప్రస్తుతం బీఏ 2.75.2, బీక్యూ 2.1 అనే స్ట్రెయిన్లు కొత్తగా కనిపిస్తున్నాయి. మనిషిలోని రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే బలం ఈ రెంటిలోనూ ఇంతకు ముందు వచ్చిన అన్నిరకాల కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశోధకులు. ఇందులో బీక్యూ 2.1 రకం త్వరగా వ్యాపిస్తుంది కూడా! త్వరలోనే ఇది ప్రపంచమంతటా ఉత్పాతం కలిగిం చనుందనేది పరిశోధకుల అభి ప్రాయం. ఈ చలి కాలంలో వైరస్ గనుక వచ్చిందంటే దానితో పోరాడ డానికి అన్ని రకాలా మనం సిద్ధంగా ఉండాలి అని వారు హెచ్చ రిస్తున్నారు. వ్యాధి వచ్చినప్పుడు తొందరగా ఏదో చేయాలని టీకాలు వేశారు తప్పిస్తే, ఎక్కువ కాలం ఆ వ్యాక్సిన్లు పనిచేసే తీరును గురించి పరిశీలించడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆ దిశలోనూ శోధన జరగాలి. శాస్త్రవేత్తలు జనాన్ని భయపెట్టడం కోసం ఇటువంటి హెచ్చ రికలు చేయడం లేదు. రానున్న ముప్పు గురించి ముందుగానే జాగరూకులను చేయడం వారి విధి. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత. మన అజాగ్రత్త మరో మృత్యుహేలను సృష్టిస్తుందనేది అందరూ గుర్తించాలి. కేబీ గోపాలం వ్యాసకర్త అనువాదకుడు, రచయిత -
15–18 ఏళ్ల వారికీ కోవిడ్ టీకా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్‌కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మరో డోసు(ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇస్తామని తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్రిస్మస్, వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం భరోసానిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడినవారికి కూడా అదనపు డోసు ఇస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో సంరక్షణా విధానాలు పాటించడమే కోవిడ్‌పై పోరాటంలో అతిపెద్ద ఆయుధమని, అందువల్ల ప్రజలంతా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనవసరంగా భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అత్యంత కీలకంగా ఆయన అభివర్ణించారు. త్వరలో ముక్కు ద్వారా ఇచ్చే టీకా, ప్రపంచ తొలి డీఎన్ఏ ఆధారిత టీకాలు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. లోతైన అధ్యయనం తర్వాతే.. కరోనాపై పోరులో దేశీయ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు. టీకాలు, డోసులపై వీరు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే అదనపు డోసు, పిల్లలకు టీకా వంటి నిర్ణయాలను సూచించారని చెప్పారు. సైంటిస్టులు ఒమిక్రాన్ వేరియంట్ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, 1.4 లక్షల ఐసీయూ పడకలు సిద్దమని, దేశవ్యాప్తంగా 3వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, 4 లక్షల ఆక్సిజన్ సిలెండర్లు దేశమంతా సరఫరా చేశామని తెలిపారు. భారత్‌లో ఇంతవరకు 141 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు మోదీ చెప్పారు. దేశంలో ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ ఆధారిత పడకలు, 1.4 లక్షల ఐసీయూ పడకలు ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా దాదాపు 90 వేల పడకలు కేటాయించాం. దేశవ్యాప్తంగా 3 వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. దేశమంతా 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాం. – మోదీ -
సిటీజనులు గజగజలాడుతున్నారు....
వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకుంది. మహానగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలితో సిటీజనులు గజగజలాడుతున్నారు. రాత్రి వేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. కోర్ సిటీతో పోలిస్తే శివార్లతో చలి తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. ఉదయం ఐదు గంటలకే నిద్రలేచే నగరం ఎనిమిదైనా ముసుగు తీయడం లేదు. వాతావరణంలో వస్తున్న మార్పులకు శరీరం తట్టుకోలేకపోతోంది. వాయు కాలుష్యంతో పాటు చలి తీవ్రతకు అస్తమా రోగులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు. జుట్టు రాలడంతో పాటు హృద్రోగ సమస్యలు రెట్టింపవుతాయి. డిసెంబర్, జనవరి నెలల్లో చలి మరింత ముదిరే అవకాశమున్నందున ఈ కాలంలో వచ్చే సమస్యలకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. – సాక్షి,సిటీబ్యూరో సాక్షి : చలికాలంలో దాని తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడడం సర్వసాధారణం. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పును దేహం స్వీకరించే స్థితిలో ఉండదు. ఈ క్రమంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాస నాళాలు మూసుకుపోయి, చెవి, గొంతు వంటి ఆరోగ్య సంబంధ సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లు రెట్టింపవుతుంటాయి. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు త్వరగా ఫ్లూ భారిన పడే ప్రమాదముంది. ప్రస్తుత వాతావరణం ‘హెచ్1ఎన్1’ స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌కు అనుకూలంగా ఉండడంతో అది మరింత విజృంభించే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. చర్మం జాగ్రత్త ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది టూ వీలర్‌పైనే ప్రయాణిస్తుంటారు. ఉదయం చలితో పాటు దట్టమైన పొగమంచు ఉంటుంది. ఈ కాలంలో ఉదయం విధులకు వెళ్లేవారు కాళ్లు, చేతులు, ముఖానికి చలిగాలులు తాకడం వల్ల చర్మం దెబ్బతింటుంది. కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడతాయి. దురద పుట్టి గోకినప్పుడు పగుళ్లు పుండ్లుగా మారే ప్రమాదం ఉంది. జుట్టు రాలిపోవడంతో పాటు చుండ్రు సమస్య తలెత్తవచ్చు. ఇప్పటికే సోరియాసిస్ వంటి చర్మ రోగాలతో బాధపడుతున్న వారు ఈ సీజన్లో మరింత ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో శరీరంలో ‘కార్టిసో’ హార్మోన్ ఉత్పత్తి అయ్యి రక్త నాళాల సైజు తగ్గి, బ్లడ్ క్లాట్‌కు కారణమవుతుంది. నీరు అధికంగా తాగాలి రాత్రి వేళ శరీరానికి మాయశ్చర్ క్రీములు రాసుకోవడం ద్వారా చర్మ పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో పెదాలు తరచూ ఆరిపోతుంటాయి. ఉపశమనం కోసం ఉమ్మితో తడుపుతూ చిగుళ్లను పంటితో కొరుకుతుంటారు. దాంతో చర్మం చిట్లిపోయి రక్తం కారుతుంది. ఇలా చేయకుండా పెదాలకు లిప్‌గార్డ్ వంటివి రుద్దడం ద్వారా కాపాడుకోవచ్చు. ఈ సీజన్లో నీరు సమృద్ధిగా తాగాలి. లేదంటే బాడీలో నీటి శాతం తగ్గి స్కిన్గ్లో తగ్గిపోతుంది. సోరియాసిస్ బాధితులు స్నానానికి ముందు ఒంటికి ఆయిల్ అప్లయ్ చేసుకోవాలి. చల్లటి నీరు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. పిల్లలకు కాళ్లు, చేతులు బయటికి కనిపించకుండా ఉన్ని దుస్తులు వేయాలి. సాధ్యమైనంత వరకు హృద్రోగ బాధితులు చలిలో తిరగక పోవడమే ఉత్తమం. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారు సూర్యోదయం తర్వాత కాస్త ఎండ వచ్చాక వాకింగ్ చేయడం మంచిది. – డాక్టర్ మన్మోహన్, డెర్మటాలజిస్ట్ ఆయిల్ ఫుడ్డ్ దూరం.. చలికాలంలో త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడమే మంచిది. మజ్జిగ, కాయకూరలు, సీజనల్‌గా లభించే పండ్లు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు మద్యం, మాంసాహారాన్ని దూరం పెట్టాలి. ఆయిల్ ఫుడ్, మసాల వేపుళ్లకు సాధ్యమైంతన తినకపోవడమే మంచిది. నిల్వ చేసిన ఆహార పదార్థాలకు బదులు వేడివేడి పదార్థాలే తినాలి. దాహం వేయకలేదని చాలా మంది నీరు తాగరు. కానీ ఈ కాలంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగడం చాలామంచిది. – డాక్టర్ మధుసూదన్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఏది పడితే అది తినొద్దు చలికాలంలో వేడివేడి వంటకాలను ఇష్టపడుతుంటారు. ఆయిల్ వేపుడు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకుంటారు. శరీర ఉష్ణోగ్రతలను పెంచుకునేందుకు మద్యం, మాంసం తింటుంటారు. దాంతో ఫ్యాటీలివర్ వంటి సమస్యలతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. సరిపడు నీరు తాగక పోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. ఆయిల్ ఫుడ్డు ఎక్కువ తీసుకోవడం వల్ల అల్సర్, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్ట బిగుసుకు పోయి ఇబ్బందిగా మారుతుంది. ఛాతిలో భరించలేని మంట ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెవి, ముక్కు, గొంతు భద్రం గ్రేటర్ పరిధిలో చిన్నాపెద్దా కలిపి దాదాపు 50 వేల పరిశ్రమలు ఉండగా.. 55 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో కలుస్తున్నాయి. ఈ కాలుష్యానికి చలి తీవ్రత తోడయింది. వాతావరణంలో ‘రెస్పిరబుల్ సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్’ (ఆర్‌ఎస్‌పీఎం) నిర్ణీత ప్రమాణాలకు మించి నమోదవుతోంది. సాధారణంగా వాతావరణంలో ఇది క్యూబిక్ మీటరు గాలిలో 60 మైక్రో గ్రాముల వరకు ఆర్‌ఎస్‌పీఎం ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీపావళి తర్వాత వాతావరణ కాలుష్యంతో పాటు చలి తీవ్రత మరింత పెరిగింది. సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలు పొగమంచులో కలిసిపోతున్నాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలితో పాటు నేరుగా అవి ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ రసాయానాలు పరోక్షంగా చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతున్నాయి. తలెత్తే ఇబ్బందులు ఇవీ.. ► శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ► మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది ► రాత్రి వేళల్లో నిద్రపట్టక పోవడం, ఉబ్బసం వంటి సమస్యలు ► గ్గు, జలుబు, తలనొప్పి, చెవి నొప్పి వంటి సమస్యలు ► చికాకుతో పాటు శరీరంపై దద్దుర్లు, ఇతర సమస్యలు కనిపిస్తుంటాయి ► చలికి చర్మం కమిలిపోవడంతో పాటు పగుళ్లు ఏర్పడుతుంటాయి ముందు జాగ్రత్తలే మందు ► శ్వాస నాళాల పనితీరును నాడీశోధన ద్వారా మెరుగుపర్చుకోవచ్చు ► రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్‌లో తిరిగే ఫ్యాను కిందే గడపాలి ► సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండాలి ► మంచు కురిసే సమయంలో ఆరుబయట తిరగడం, వ్యాయమం వంటి చేయరాదు ► ప్రస్తుత చలి వాతావరణంలో ఫ్లూతో పాటు రకరకాల బ్యాక్టీరియా విస్తరించి ఉంటుంది. బయటికు వెళ్లాల్సి వస్తే ముక్కుకు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు లక్షణాలను ఇలా గుర్తించవచ్చు.. ♦ సాధారణ ఫ్లూ జ్వరాలలో కనిపించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ♦ ప్రధానంగా ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు ♦ కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి ♦ కొందరికి వాంతులు, విరేచనాలు కూడా అవుతుంటాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ⇒జనసమూహం ఎక్కువగా ఉండే తీర్థయాత్రలు, ⇒పర్యాటక ప్రాంతాలు, ఎగ్జిబిషన్లకు ఈ సీజన్లో వెళ్లకపోవడమే ఉత్తమం ⇒అనివార్యమైతే ముక్కుకు విధిగా మాస్కు ధరించాలి ⇒తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి ⇒వీలైనంత ఎక్కువసార్లు నీళ్లు తాగాలి ⇒పౌష్టికాహారం కాయకూరలు, పండ్లు, ⇒డ్రైఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ⇒బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు ⇒ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటి వాటికి తాత్కాలికంగా స్వస్తి చెప్పాలి ⇒పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు ⇒ఆరోగ్యంలో మార్పులు కనిపించినా.. అనుమానం వచ్చినా వ్యాధి నిర్థారణ కోసం పరీక్షలు చేయించుకోవాలి. -
ఉత్సవాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అనంతపురం డివిజన్ డీఈ ఎస్.నారాయణనాయక్ తెలిపారు. మంటపాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ విద్యుత్ సరఫరా కోసం సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్, సెక్షన్ ఆఫీసు, పాతవూరు పవర్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసుల్లో ఎక్కడైనా సంప్రదించవచ్చన్నారు. తాత్కాలిక సరఫరా కింద సర్వీసు కోసం అనుమతి తీసుకుని డీడీ రూపంలో డబ్బు చెల్లించాలన్నారు. లేదంటే సమీపంలో ఉన్న నివాసాల నుంచి కూడా అనుమతితో సరఫరా తీసుకునే వీలుందన్నారు. ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ కొక్కీలు తగిలించడం, ఇతరత్రా అక్రమంగా విద్యుత్‌ను వాడితే అపరాధ రుసుము విధించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లైన్మెన్, ఏఈ, ఏడీఈ, డీఈలను సంప్రదిస్తే విద్యుత్ సరఫరా, ఇరతత్రా జాగ్రత్తలపై అవసరమైన చర్యలు, అలాగే ఫోన్ నంబర్లు కూడా ఇస్తారని తెలిపారు. మంటపాలకు విద్యుత్ సరఫరా చేసే సమయంలో స్టాండర్డ్ సర్వీసు వైర్లు ఉపయోగించాలన్నారు. ఎటువంటి జాయింట్లు ఉండకూడదన్నారు. ఫీజు కటౌట్లు, మంటలు ఆర్పడానికి అవసరమైన సామగ్రి (ఫైర్ ఎక్స్‌టెన్యుడసర్) అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే సోడియం వెపర్ లైట్లు కాకుండా ఎల్ఈడీ లేదా సీఎస్ఎల్ బల్బులు వాడితే మేలన్నారు. పెద్ద పెద్ద మంటపాల నిర్వాహకులు ఎలక్ట్రీషియన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వివరాలకు 08554–276567, 08554–272213, లేదంటే 1912 టోల్‌ఫ్రీ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.