వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకుంది. మహానగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలితో సిటీజనులు గజగజలాడుతున్నారు. రాత్రి వేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. కోర్ సిటీతో పోలిస్తే శివార్లతో చలి తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. ఉదయం ఐదు గంటలకే నిద్రలేచే నగరం ఎనిమిదైనా ముసుగు తీయడం లేదు. వాతావరణంలో వస్తున్న మార్పులకు శరీరం తట్టుకోలేకపోతోంది. వాయు కాలుష్యంతో పాటు చలి తీవ్రతకు అస్తమా రోగులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు. జుట్టు రాలడంతో పాటు హృద్రోగ సమస్యలు రెట్టింపవుతాయి. డిసెంబర్, జనవరి నెలల్లో చలి మరింత ముదిరే అవకాశమున్నందున ఈ కాలంలో వచ్చే సమస్యలకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
– సాక్షి,సిటీబ్యూరో
సాక్షి : చలికాలంలో దాని తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడడం సర్వసాధారణం. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పును దేహం స్వీకరించే స్థితిలో ఉండదు. ఈ క్రమంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాస నాళాలు మూసుకుపోయి, చెవి, గొంతు వంటి ఆరోగ్య సంబంధ సమస్యలతో పాటు ఇన్‌ఫెక్షన్లు రెట్టింపవుతుంటాయి. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు త్వరగా ఫ్లూ భారిన పడే ప్రమాదముంది. ప్రస్తుత వాతావరణం ‘హెచ్1ఎన్1’ స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌కు అనుకూలంగా ఉండడంతో అది మరింత విజృంభించే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది.
ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది.
చర్మం జాగ్రత్త
ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది టూ వీలర్‌పైనే ప్రయాణిస్తుంటారు. ఉదయం చలితో పాటు దట్టమైన పొగమంచు ఉంటుంది. ఈ కాలంలో ఉదయం విధులకు వెళ్లేవారు కాళ్లు, చేతులు, ముఖానికి చలిగాలులు తాకడం వల్ల చర్మం దెబ్బతింటుంది. కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడతాయి. దురద పుట్టి గోకినప్పుడు పగుళ్లు పుండ్లుగా మారే ప్రమాదం ఉంది. జుట్టు రాలిపోవడంతో పాటు చుండ్రు సమస్య తలెత్తవచ్చు. ఇప్పటికే సోరియాసిస్ వంటి చర్మ రోగాలతో బాధపడుతున్న వారు ఈ సీజన్‌లో మరింత ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో శరీరంలో ‘కార్టిసో’ హార్మోన్ ఉత్పత్తి అయ్యి రక్త నాళాల సైజు తగ్గి, బ్లడ్ క్లాట్‌కు కారణమవుతుంది.
నీరు అధికంగా తాగాలి
రాత్రి వేళ శరీరానికి మాయశ్చర్ క్రీములు రాసుకోవడం ద్వారా చర్మ పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో పెదాలు తరచూ ఆరిపోతుంటాయి. ఉపశమనం కోసం ఉమ్మితో తడుపుతూ చిగుళ్లను పంటితో కొరుకుతుంటారు. దాంతో చర్మం చిట్లిపోయి రక్తం కారుతుంది. ఇలా చేయకుండా పెదాలకు లిప్‌గార్డ్ వంటివి రుద్దడం ద్వారా కాపాడుకోవచ్చు. ఈ సీజన్‌లో నీరు సమృద్ధిగా తాగాలి. లేదంటే బాడీలో నీటి శాతం తగ్గి స్కిన్‌గ్లో తగ్గిపోతుంది. సోరియాసిస్ బాధితులు స్నానానికి ముందు ఒంటికి ఆయిల్ అప్లయ్ చేసుకోవాలి. చల్లటి నీరు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. పిల్లలకు కాళ్లు, చేతులు బయటికి కనిపించకుండా ఉన్ని దుస్తులు వేయాలి. సాధ్యమైనంత వరకు హృద్రోగ బాధితులు చలిలో తిరగక పోవడమే ఉత్తమం. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారు సూర్యోదయం తర్వాత కాస్త ఎండ వచ్చాక వాకింగ్ చేయడం మంచిది.
– డాక్టర్ మన్మోహన్, డెర్మటాలజిస్ట్
ఆయిల్ ఫుడ్డ్ దూరం..
చలికాలంలో త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడమే మంచిది. మజ్జిగ, కాయకూరలు, సీజనల్‌గా లభించే పండ్లు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు మద్యం, మాంసాహారాన్ని దూరం పెట్టాలి. ఆయిల్ ఫుడ్, మసాల వేపుళ్లకు సాధ్యమైంతన తినకపోవడమే మంచిది. నిల్వ చేసిన ఆహార పదార్థాలకు బదులు వేడివేడి పదార్థాలే తినాలి. దాహం వేయకలేదని చాలా మంది నీరు తాగరు. కానీ ఈ కాలంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగడం చాలామంచిది.
– డాక్టర్ మధుసూదన్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
ఏది పడితే అది తినొద్దు
చలికాలంలో వేడివేడి వంటకాలను ఇష్టపడుతుంటారు. ఆయిల్ వేపుడు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకుంటారు. శరీర ఉష్ణోగ్రతలను పెంచుకునేందుకు మద్యం, మాంసం తింటుంటారు. దాంతో ఫ్యాటీలివర్ వంటి సమస్యలతో పాటు రకరకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. సరిపడు నీరు తాగక పోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. ఆయిల్ ఫుడ్డు ఎక్కువ తీసుకోవడం వల్ల అల్సర్, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్ట బిగుసుకు పోయి ఇబ్బందిగా మారుతుంది. ఛాతిలో భరించలేని మంట ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
చెవి, ముక్కు, గొంతు భద్రం
గ్రేటర్ పరిధిలో చిన్నాపెద్దా కలిపి దాదాపు 50 వేల పరిశ్రమలు ఉండగా.. 55 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో కలుస్తున్నాయి. ఈ కాలుష్యానికి చలి తీవ్రత తోడయింది. వాతావరణంలో ‘రెస్పిరబుల్ సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్’ (ఆర్‌ఎస్‌పీఎం) నిర్ణీత ప్రమాణాలకు మించి నమోదవుతోంది. సాధారణంగా వాతావరణంలో ఇది క్యూబిక్ మీటరు గాలిలో 60 మైక్రో గ్రాముల వరకు ఆర్‌ఎస్‌పీఎం ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీపావళి తర్వాత వాతావరణ కాలుష్యంతో పాటు చలి తీవ్రత మరింత పెరిగింది. సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలు పొగమంచులో కలిసిపోతున్నాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలితో పాటు నేరుగా అవి ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ రసాయానాలు పరోక్షంగా చెవి, ముక్కు, గొంతు ఇన్‌ఫెక్షన్లను తెచ్చిపెడుతున్నాయి.
తలెత్తే ఇబ్బందులు ఇవీ..
► శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
► మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది
► రాత్రి వేళల్లో నిద్రపట్టక పోవడం, ఉబ్బసం వంటి సమస్యలు
► గ్గు, జలుబు, తలనొప్పి, చెవి నొప్పి వంటి సమస్యలు
► చికాకుతో పాటు శరీరంపై దద్దుర్లు, ఇతర సమస్యలు
కనిపిస్తుంటాయి
► చలికి చర్మం కమిలిపోవడంతో పాటు పగుళ్లు ఏర్పడుతుంటాయి
ముందు జాగ్రత్తలే మందు
► శ్వాస నాళాల పనితీరును నాడీశోధన ద్వారా మెరుగుపర్చుకోవచ్చు
► రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్‌లో తిరిగే
ఫ్యాను కిందే గడపాలి
► సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన
పదార్థాలకు దూరంగా ఉండాలి
► మంచు కురిసే సమయంలో ఆరుబయట
తిరగడం, వ్యాయమం వంటి చేయరాదు
► ప్రస్తుత చలి వాతావరణంలో ఫ్లూతో పాటు
రకరకాల బ్యాక్టీరియా విస్తరించి ఉంటుంది. బయటికు
వెళ్లాల్సి వస్తే ముక్కుకు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు
లక్షణాలను ఇలా గుర్తించవచ్చు..
♦ సాధారణ ఫ్లూ జ్వరాలలో కనిపించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి.
♦ ప్రధానంగా ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు
♦ కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి
♦ కొందరికి వాంతులు, విరేచనాలు కూడా అవుతుంటాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
⇒జనసమూహం ఎక్కువగా ఉండే తీర్థయాత్రలు,
⇒పర్యాటక ప్రాంతాలు, ఎగ్జిబిషన్లకు ఈ సీజన్‌లో
వెళ్లకపోవడమే ఉత్తమం
⇒అనివార్యమైతే ముక్కుకు విధిగా మాస్కు ధరించాలి
⇒తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి
⇒వీలైనంత ఎక్కువసార్లు నీళ్లు తాగాలి
⇒పౌష్టికాహారం కాయకూరలు, పండ్లు,
⇒డ్రైఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి
⇒బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు
⇒ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటి వాటికి తాత్కాలికంగా స్వస్తి చెప్పాలి
⇒పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు
⇒ఆరోగ్యంలో మార్పులు కనిపించినా.. అనుమానం
వచ్చినా వ్యాధి నిర్థారణ కోసం పరీక్షలు చేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment