వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అనంతపురం డివిజన్ డీఈ ఎస్.నారాయణనాయక్ తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్: వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అనంతపురం డివిజన్ డీఈ ఎస్.నారాయణనాయక్ తెలిపారు. మంటపాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ విద్యుత్ సరఫరా కోసం సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్, సెక్షన్ ఆఫీసు, పాతవూరు పవర్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసుల్లో ఎక్కడైనా సంప్రదించవచ్చన్నారు. తాత్కాలిక సరఫరా కింద సర్వీసు కోసం అనుమతి తీసుకుని డీడీ రూపంలో డబ్బు చెల్లించాలన్నారు. లేదంటే సమీపంలో ఉన్న నివాసాల నుంచి కూడా అనుమతితో సరఫరా తీసుకునే వీలుందన్నారు. ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ కొక్కీలు తగిలించడం, ఇతరత్రా అక్రమంగా విద్యుత్‌ను వాడితే అపరాధ రుసుము విధించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
లైన్‌మెన్, ఏఈ, ఏడీఈ, డీఈలను సంప్రదిస్తే విద్యుత్ సరఫరా, ఇరతత్రా జాగ్రత్తలపై అవసరమైన చర్యలు, అలాగే ఫోన్ నంబర్లు కూడా ఇస్తారని తెలిపారు. మంటపాలకు విద్యుత్ సరఫరా చేసే సమయంలో స్టాండర్డ్ సర్వీసు వైర్లు ఉపయోగించాలన్నారు. ఎటువంటి జాయింట్లు ఉండకూడదన్నారు. ఫీజు కటౌట్లు, మంటలు ఆర్పడానికి అవసరమైన సామగ్రి (ఫైర్ ఎక్స్‌టెన్యుడసర్) అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే సోడియం వెపర్ లైట్లు కాకుండా ఎల్‌ఈడీ లేదా సీఎస్‌ఎల్ బల్బులు వాడితే మేలన్నారు. పెద్ద పెద్ద మంటపాల నిర్వాహకులు ఎలక్ట్రీషియన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వివరాలకు 08554–276567, 08554–272213, లేదంటే 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.