న్యూఢిల్లీ: దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్‌కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మరో డోసు(ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇస్తామని తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్రిస్మస్, వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం భరోసానిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడినవారికి కూడా అదనపు డోసు ఇస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో సంరక్షణా విధానాలు పాటించడమే కోవిడ్‌పై పోరాటంలో అతిపెద్ద ఆయుధమని, అందువల్ల ప్రజలంతా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనవసరంగా భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అత్యంత కీలకంగా ఆయన అభివర్ణించారు. త్వరలో ముక్కు ద్వారా ఇచ్చే టీకా, ప్రపంచ తొలి డీఎన్‌ఏ ఆధారిత టీకాలు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
లోతైన అధ్యయనం తర్వాతే..
కరోనాపై పోరులో దేశీయ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు. టీకాలు, డోసులపై వీరు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే అదనపు డోసు, పిల్లలకు టీకా వంటి నిర్ణయాలను సూచించారని చెప్పారు. సైంటిస్టులు ఒమిక్రాన్ వేరియంట్ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, 1.4 లక్షల ఐసీయూ పడకలు సిద్దమని, దేశవ్యాప్తంగా 3వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, 4 లక్షల ఆక్సిజన్ సిలెండర్లు దేశమంతా సరఫరా చేశామని తెలిపారు. భారత్‌లో ఇంతవరకు 141 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు మోదీ చెప్పారు.
దేశంలో ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ ఆధారిత పడకలు, 1.4 లక్షల ఐసీయూ పడకలు ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా దాదాపు 90 వేల పడకలు కేటాయించాం. దేశవ్యాప్తంగా 3 వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. దేశమంతా 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాం.
– మోదీ
Comments
Please login to add a commentAdd a comment