ఆర్బీకేల్లో ప్రైమరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌  | CM YS Jagan advised the authorities to arrange Primary Food Processing at Rythu Bharosa Centres | Sakshi
Sakshi News home page

ఆర్బీకేల్లో ప్రైమరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 

Published Sat, Aug 15 2020 4:37 AM | Last Updated on Sat, Aug 15 2020 4:41 AM

CM YS Jagan advised the authorities to arrange Primary Food Processing at Rythu Bharosa Centres - Sakshi

గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీలపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి:  రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ప్రాథమిక స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (ఆహార శుద్ధి) చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్బీకేల వద్ద గోడౌన్లు, గ్రేడింగ్‌ ఎక్విప్‌మెంట్, సార్టింగ్‌ పరికరాలను అందుబాటులోకి తెచ్చి వీటి ద్వారా ప్రైమరీ ప్రాసెసింగ్‌ (ప్రాథమిక స్థాయిలో శుద్ధి) చేయాలన్నారు. జనతా బజార్ల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. 

ఆర్బీకేలలో ప్రాథమికంగా ప్రాసెస్‌.. 
రైతు భరోసా కేంద్రాల స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రాథమికంగా ప్రాసెస్‌ చేయాలి. తర్వాత దశల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండాలి. ప్రతి మండలానికి కోల్డు స్టోరేజీ సదుపాయం కల్పించాలి. గిరిజన ప్రాంతాల్లో కూడా గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీ లాంటి సదుపాయాలు ఉండాలి. నియోజకవర్గానికి ఒక ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఉండాలి.  

రైతులు భరోసాగా ఉండగలగాలి.. 
పంటలు అమ్ముకోలేక పోయామంటూ భవిష్యత్తులో రైతులు ఎక్కడా ఆందోళన చెందే పరిస్థితి రాకూడదు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి, వేరుశనగ, కందులు, మొక్కజొన్న, మినుములు, శనగలు, జొన్న తదితర పంటలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాటి మార్కెటింగ్‌తోపాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలి. 

అప్పుడే ఆలోచించాం.. 
నియోజకవర్గాల వారీగా అవసరమైన మేరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడిస్తాం. టమాటా, చీనీ, మొక్కజొన్న, మామిడి, అరటి తదితర పంటలకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జరుగుతుంది. ఆర్బీకేల గురించి ఆలోచన వచ్చినప్పుడే వీటన్నిటిపై దృష్టి పెట్టాం. వ్యవసాయంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను ఆర్బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం.  

జనం కోసం జనతా బజార్లు.. 
రైతులు పండించిన ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించేలా ప్రత్యేక ఫ్లాట్‌ఫాం కూడా తెస్తున్నాం. గ్రామాల్లో జనతా బజార్లను తెచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. దీనివల్ల వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడమే కాకుండా రైతులకూ మేలు జరుగుతుంది. 

భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా గిడ్డంగుల నిర్మాణం 
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగుల నిర్మాణం చేపట్టాలి. ప్రతిపాదనల రూపకల్పన సమయంలోనే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి వేగంగా శీతలీకరించేందుకు ఐక్యూఎఫ్‌లను ఏర్పాటు చేయాలి.  

అక్క చెల్లెమ్మలను ఆదుకుంటున్నాం.. 
► చేయూత, ఆసరా పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటున్నాం.  
► అమూల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. పాడి పశువుల పెంపకం ద్వారా జీవనోపాధి మార్గాలను పెంచుతున్నాం. పాల సేకరణకు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మౌలిక సదుపాయాల విషయంలో సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. నిధుల సమీకరణ ప్రణాళికనూ ఖరారు చేయాలి. 
కొన్ని సమస్యలున్నా.. 
► ఫిషరీస్, ఆక్వాకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. పంట చేతికి వచ్చేసరికి ధరలు తగ్గిపోయే పరిస్థితిపై దృష్టి పెట్టాం. అమూల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయి. 
► సీఎం సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్నతో, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement