ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నడక నేల మీదే అంటూ చేసిన ప్రసంగానికి అనుగుణంగానే ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమర్పించిన బడ్జెట్ వాస్తవిక ధోరణితో ఉందని చెప్పాలి. ఈ ప్రభుత్వం కీలకంగా భావించే తన ఎన్నికల మానిఫెస్టోలో ఏవైతే చెప్పిందో వాటిని ఆచరించే క్రమంలో బడ్జెట్ లో నవరత్నాల స్కీమ్ లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అదే సందర్భంలో అభివృద్ది, పరిశ్రమలు, సాగునీరు తదితర రంగాలను కూడా సమతుల్యంగా చేసుకునే యత్నం చేసింది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి జవాబు చెప్పారు.
ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అర్దవంతంగా ఉన్నాయి. 'నా నడక నేలమీదే!. సామాన్యులతోనే నా ప్రయాణం, నా లక్ష్యం పేదరిక నిర్మూలనే" అని ఆయన పేర్కొన్నారు. తన ఎకనామిక్స్, తన పాలిటిక్స్ ఇదే అని, తన తండ్రిని చూసి నేర్చుకున్న హిస్టరీ ఇదని.. ఇవన్నీ కలిపితే మీ జగన్ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సహజంగానే అందరిని ఆకట్టుకుంటాయి. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరూ ఇలాంటి ప్రసంగాలలో ఇంత బలంగా సెంటిమెంట్‌ను చొప్పించలేకపోయారనే చెప్పాలి
వారు తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేయదలచిన కార్యక్రమాల గురించి మాట్లాడి, చివరికి ఎవరివైనా కొటేషన్‌లు ప్రస్తావించి ముగిస్తుండేవారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా గ్రాఫిక్స్, ఊహాజనిత లెక్కలతో ఏమార్చే ప్రయత్నం చేసేవారన్న విమర్శలు ఉండేవి. జగన్ అలాకాకుండా వాస్తవిక ధోరణిలో మాట్లాడారు. అదే టైమ్‌లో జగన్ తనే సొంతంగా కొటేషన్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. నడక, నేల, సామాన్యులు, ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ, అన్నీ కలిపి జగన్ అన్నది ఆయన కొటేషన్ గా చెప్పాలి.
తన ప్రభుత్వం గత నాలుగేళ్లుగా సామాన్యుడి కోసమే పని చేసిందని వక్కాణించి వివరించారు. పేదలు, పెత్తందార్ల మధ్య తేడాను, వారి మధ్య సహజంగా జరిగే పెనుగులాటను జగన్ తన ప్రసంగంలో కొట్టొచ్చినట్లు చెప్పే యత్నం చేశారు. నవరత్నాల స్కీమ్‌ల ద్వారా నేరుగా పేదల ఖాతాలలోకి సుమారు రెండు లక్షల కోట్ల నగదును బదిలీ చేసిన వైనాన్ని వివరించి, తద్వారా అవినీతి లేకుండా చేయగలిగామని, పేదల సంక్షేమాన్ని కాపాడుకున్నామని, వారి ఆర్దిక పురోభివృద్దికి కృషి చేశామని జగన్ చెప్పారు. పేద కుటుంబాలు ఆర్దికంగా బాగుపడితేనే పేద కులాలు కూడా బాగుపడతాయని, వారికి సాధికారికత కల్పిస్తేనే సమాజం బాగుపడుతుందన్న తన విధానాన్ని ఆయన తేటతెల్లం చేశారు.
ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ భోధన, పరిపాలనలో సంస్కరణలు, ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు, రైతు భరోసా, విలేజ్ క్లినిక్స్, చేయూత, కాపు నేస్తం, చేనేత నేస్తం.. ఇలా ఆయా కార్యక్రమాలన్నీ పేదల పురోగతికి ఉద్దేశించినవేనని జగన్ అన్నారు. ఈ స్కీమ్ లన్నిటిలోను మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన వివరించారు. అటు ప్రభుత్వ పరంగా, ఇటు రాజకీయపరంగా స్త్రీలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను తెలియచెప్పారు.
అదే టైమ్‌లో పరిశ్రమలు, ఇతర అభివృద్ది రంగాలలో చేస్తున్న కృషిని కూడా ఆయన వివరించారు. ఎన్నికల సంవత్సరంలో తమ ఎజెండా మారదని ఆయన చెప్పకనే చెప్పారు. తమకు పరిశ్రమలు ఎంత ముఖ్యమో, పేదల అభ్యున్నతి కూడా అంతే ముఖ్యమని నిర్మొహమాటంగా తెలిపారు. ఐటి ఎంత ప్రధానమో, వ్యవసాయం కూడా అంతే ప్రధానమని తేల్చారు. ఈ రకంగా తమ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని అనుకోవచ్చు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పేయత్నం చేశారు.
నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఒకే మాట మీద ఉన్నారని చెప్పవచ్చు. ఎన్నికల మానిఫెస్టోని దగ్గరపెట్టుకుని వాటిని తు.చా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారు. 98.5 శాతం హామీలను నెరవేర్చిన సీఎంగా ఆయన రికార్డు సృష్టించారు. జగన్ చేసిన స్పీచ్‌కు అనుగుణంగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ఉన్నట్లు కనబడుతుంది. పార్టీ విధానం, ముఖ్యమంత్రి ఆలోచనలను మేళవించి ఆయన బడ్జెట్‌ను రూపొందించారు. తన సహజ శైలిలో అబ్దుల్ కలాం, వివేకానంద, జఫర్సన్, రవీంద్రనాద్ ఠాగూర్ వంటి వారి కొటేషన్‌లను చెప్పడమే కాకుండా గజేంద్రమోక్షం సన్నివేశంలోని పద్యాన్ని కూడా ఆలపించి అందరిని ఆకర్షించారు.
చదవండి: రామోజీ.. ఆరోజున జరిగింది మర్చిపోయారా?
బడ్జెట్‌లో సామాజిక పెన్షన్ లకు 21 వేల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం. వచ్చే జనవరి నుంచి ఇచ్చిన హామీ ప్రకారం వృద్దుల పెన్షన్‌ను మూడువేల రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగా బుగ్గన బడ్జెట్ ను కేటాయించారు. సుస్థిరాభివృద్ది విధానంగా జీవనోపాధి, సాధికారికత, సామాజిక భద్రత, పారిశ్రామికాభివృద్ది సాధన తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.
వ్యవసాయం, నీటిపారుదల, రవాణా,రోడ్లు, విద్యుత్ తదితర రంగాలకు సుమారు 67 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.విద్యారంగానికి రికార్డు స్థాయిలో 32 వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మరో వైపు వివిధ సంక్షేమ స్కీమ్ లకు 54 వేల కోట్లు కేటాయించినట్లు బుగ్గన తెలిపారు. మొత్తం మీద పరిశీలిస్తే జగన్ ముఖ్యమంత్రి అవడానికి ముందు ఏమి చెప్పారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఏటా దానిని ఆచరించి చూపుతున్నారు. అదే బుగ్గన బడ్జెట్ లో ప్రతి ఏటా కనిపిస్తుంది. ఈ రకంగా మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం ప్రజలలో గుర్తింపు పొందుతుందని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment