ఇళ్ల యజ్ఞం పూర్తి చేస్తాం | CM YS Jagan In AP Assembly Sessions about Houses To Poor People | Sakshi
Sakshi News home page

ఇళ్ల యజ్ఞం పూర్తి చేస్తాం

Published Fri, Mar 18 2022 3:14 AM | Last Updated on Fri, Mar 18 2022 3:09 PM

CM YS Jagan In AP Assembly Sessions about Houses To Poor People - Sakshi

చరిత్ర ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం వల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి 71 లక్షల టన్నుల సిమెంట్, 7.56 లక్షల టన్నుల స్టీల్, 312 లక్షల టన్నుల ఇసుక, 1,250 కోట్ల ఇటుకలు అవసరం. కార్మికులకు 21.4 కోట్ల పని దినాల ఉపాధి లభిస్తుంది. వృత్తి నైపుణ్య కార్మికులకు అదనంగా మరో 10.60 కోట్ల పని దినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతగానో దోహద పడతాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. 
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు సొంతం చేసి తీరతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి, నిరుపేదలందరినీ ఇంటి యజమానులు చేయాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశాం. 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో దశల వారీగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. తొలి దశలో 10,067 కా>లనీల్లో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి.

పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశాం. ఇందుకోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాల్లో సేకరించాం. ఈ భూమి విలువే కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుంది. పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్న 17,005 కాలనీల్లో మౌలిక వసతుల కోసమే రూ.32,909 కోట్లు వెచ్చించనున్నాం. నిర్మాణాలు పూర్తయితే రూ.4 లక్షల కోట్ల సంపద పేదల చేతుల్లో ఉంటుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి సమకూరుతుంది’ అని తెలిపారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే ఈ మిషన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మల ఫొటోతో సహా పట్టాను ఇస్తున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందమే తమకు శక్తినిస్తుందని, తమను ముందుకు నడిపిస్తుందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

సొంతింటితో సామాజిక హోదా
► త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక సొంత ఇల్లుతో అక్కచెల్లెమ్మలకు సామాజిక హోదా వస్తుంది. భద్రతతో పాటు భరోసా వస్తుంది. 
► ఇటువంటి భద్రత ప్రతి అక్క, చెల్లెమ్మకు ఇవ్వాలని, ఆత్మ విశ్వాసం పెంచే గొప్ప ఆస్తిని వారి చేతిలో పెట్టాలని మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరుగుతుంది. 

ఎమ్మెల్యేలు గర్వపడే పరిస్థితి
► ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగితే పెన్షన్‌ రాలేదనో.. ఇల్లు లేదనో.. ఫలానా పథకం అందలేదనో.. అర్హత ఉన్నా ఇవ్వలేదనో ఇలా.. గతంలో రకరకాల ఫిర్యాదులు వినిపించేవి. 
► ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఎమ్మెల్యే సగర్వంగా, కాలర్‌ ఎగరేసుకునే పరిస్థితులు తీసుకువచ్చాం. ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తూ లంచాలు, వివక్షకు తావు లేకుండా అందిస్తున్నాం. 
► అర్హత ఉంటే చాలు మన పార్టీయా, మరో పార్టీయా అని ఎక్కడా చూడటం లేదు. కులం, ప్రాంతం, మతం, పార్టీ చూడకుండా అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. 

ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నాం
► 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించినవి 2.62 లక్షల ఇళ్లు ఉన్నాయి. అందులోనూ అన్‌ డివైడెడ్‌ షేర్‌ అప్‌ ల్యాండ్‌ లబ్ధిదారులకు వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే.. మా ప్రభుత్వం కొత్తగా 17,005 కాలనీలు నిర్మిస్తోంది.
► కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్‌ పంచాయితీల సైజులో కనిపిస్తున్నాయి. ఇవాళ మేం కడుతోంది ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం అని చెబుతున్నా. 
► ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు సేకరించగలిగాం కాబట్టే కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. 17,005 కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్‌.. తదితర మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 
► ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కొన్ని సంవత్సరాల పాటు ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తాం. 

సకల వసతులు, నాణ్యతతో నిర్మాణం
► గతంలో చంద్రబాబు హయాంలో ఇంటి విస్తీర్ణం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 215 చదరపు అడుగులు. ఇవాళ మనం కడుతున్న ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు. ప్రతి ఇంట్లో బెడ్‌ రూమ్, లివింగ్‌ రూమ్, కిచెన్, బాత్‌రూమ్‌ కమ్‌ టాయ్‌లెట్, వరండా.. ఇవన్నీ ఉంటాయి. 
► ప్రభుత్వమే దగ్గరుండి తొలుత 20 ఇళ్లు కట్టించింది. ఎంత ఖర్చవుతుందో లెక్క వేసేందుకు ఆ పని చేశాం. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని ఏ విధంగా అయినా తగ్గించగలిగితే పేదలకు మెరుగ్గా ఇళ్లు కట్టంచగలుగుతామని రకరకాల ఆలోచనలు చేసి ఒక కార్యాచరణ రూపొందించాం.
► సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారా ఇంటి తలుపులు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్‌ పరికరాలు వంటి 14 రకాల నాణ్యమైన సామగ్రిని తీసుకువచ్చాం. సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అయితే రివర్స్‌ టెండరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. నాణ్యత కూడా ఉంటుంది. సామగ్రిని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో ధరలు కూడా తగ్గుతాయి. 
► ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్‌ పడుతుంది. మార్కెట్‌లో సిమెంట్‌ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉంది. సిమెంట్‌ కంపెనీలతో మాట్లాడి పేదల ఇళ్లకు మాత్రం పీపీసీ సిమెంట్‌ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేట్లు ఒప్పించాం. ప్రతి లబ్ధిదారుడికి అవసరమైన 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా డోర్‌ డెలివరీ చేస్తున్నాం. దాదాపు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మార్కెట్‌ రేటు కన్నా తక్కువకే కొనుగోలు చేశాం. 

300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితం 
► టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీ ప్లస్‌ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆ ఇళ్లు కడుతుండగా, వాటిలో 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. 
► ఇవే ఇళ్లకు చంద్రబాబు హయాంలో.. ఒక చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున ఒక్కో ఇంటి వ్యయం రూ.6 లక్షలుగా లెక్కేశారు. అందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ.3 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించే వారు. ఆ రుణం తీర్చేందుకు పేద కుటంబం నెలకు రూ.3 వేల చొప్పున ఏకంగా 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాల్సి వచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం అవే ఇళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి పేదలకు ఇస్తోంది.
► 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ.25 వేల చొప్పున, 430 చదరపు అడుగుల ఇళ్లకు రూ.50 వేల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఆ విధంగా వారికి కూడా మేలు చేస్తున్నాం. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 1,07,814 ఇళ్లు పూర్తి కాగా, మరో 63,306 ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ ఇళ్ల పంపిణీని గత జనవరిలో మొదలు పెట్టాం. వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం.

ఎప్పటికప్పుడు బిల్లులు
► ప్రభుత్వ పని అంటే నాసిరకం అని గతంలో పేరు ఉండేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏ పని చేసినా పూర్తి నాణ్యత ఉంటుందనే పేరు తెచ్చుకున్నాం. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించాం.
► అధికారులు, సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని నిర్దేశించాం. గతంలో ఇళ్లు కట్టిన తర్వాత బిల్లులు రావడం కాదు కదా.. చివరకు ఆ బిల్లులు తయారు చేయడం కూడా గగనమై పోయేది. ఇవాళ సచివాలయాల్లో ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు బిల్లులు జనరేట్‌ చేస్తున్నారు. ఆ వెంటనే సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం.

పుట్టగతులు ఉండవనే టీడీపీ కుట్ర
 ఈ యజ్ఞం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఆందోళనతోనే టీడీపీ ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు.
► ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులా ప్రయత్నించింది. ఈ  ఇళ్ల నిర్మాణం పూర్తయితే జగన్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది.. దీంతో తమ అడ్రస్‌ పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతో ఏవేవో కారణాలు చూపుతూ కోర్టులను ఆశ్రయించారు. 
► నా నియోజకవర్గం పులివెందులతో పాటు విశాఖపట్నం, ఇతర చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. ఆ విధంగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
► విశాఖపట్నంలో భూముల సేకరణకు హైకోర్టు ఇటీవలే క్లియరెన్స్‌ ఇచ్చింది. దాంతో ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేయండని అధికారులను ఆదేశించాం. ఏప్రిల్‌లో విశాఖపట్నం వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వెంటనే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతాం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement