సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల ప్రయోజనాలను కొనసాగించడమే లక్ష్యంగా అన్ని వర్గాలకు అండగా నిలిచేలా 2022 – 23 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. వరుసగా రెండో దఫా కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. మహిళలు, పిల్లలకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయ రంగంతో పాటు విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయనున్నారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభివృద్ధి నిధి కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.రెండు కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లను బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు సమాచారం.
అవ్వా తాతలు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం బడ్జెట్‌లో ఏకంగా రూ.18 వేల కోట్లకుపైగా కేటాయించే వీలుంది. అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి రాబడులు గణనీయంగా తగ్గినప్పటికీ ఏ పథకానికి లోటు లేకుండా నిధుల కేటాయింపులపై సీఎం వైఎస్ జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సుదీర్ఘ కసరత్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉప ప్రణాళికలకు భారీ కేటాయింపులు చేయనున్నారు. వరుసగా రెండో ఏడాది ఆర్థికంగా వెనుకబడిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం కోసం బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయింపులు చేయనున్నారు.
వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు గత మూడేళ్లలో ఎంత ఆర్థిక సాయం అందిందనే వివరాలతో పాటు ఈ బడ్జెట్‌లో ఎంత సాయం అందుతుందో ప్రకటించనున్నారు. విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు–నేడు ద్వారా బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అన్నదాతలకు గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తారు. 2022–23 వార్షిక బడ్జెట్ రూ.2.55 లక్షల కోట్ల నుంచి రూ.2.56 లక్షల కోట్ల మధ్యలో ఉండవచ్చని సమాచారం.
జనరంజకంగా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం వరుసగా నాలుగోసారి ప్రవేశపెడుతున్న పూర్తి బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. పొదుపు సంఘాలకు వైఎస్సార్ ఆసరా కోసం బడ్జెట్‌లో రూ.6,400 కోట్లు కేటాయించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో నాడు–నేడు కింద మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,500 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కోసం రూ.3,000 కోట్లు కేటాయించనున్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.2,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.3,500 కోట్లు కేటాయింపులు చేయనున్నారు. పారిశ్రామిక రాయితీల కోసం రూ.1,200 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపులు చేయనున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల కోసం రూ.500 కోట్లు కేటాయింపులు చేయనున్నారు.
వ్యవసాయ రంగానికి పెద్ద పీట
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటికీ కలిపి రూ.31 వేల కోట్లకు పైగా కేటాయిస్తూ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు అదనంగా వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ బయట నుంచి మరో రూ.పది వేల కోట్లకు పైగా వ్యయం చేయనున్నట్లు సమాచారం.
నేడు ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 9 గంటలకు సచివాలయ మొదటి బ్లాకు మంత్రివర్గ సమావేశ మందిరంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2022–23 వార్షిక బడ్జెట్‌కు ఇందులో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ఉదయం 10.15 గంటలకు బడ్జెట్
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ఉదయం 10.15 గంటలకు శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయానికి మండలిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి బడ్జెట్ చదవనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన వెంటనే శాసనసభలో మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment