
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,745 మంది సోమవారం రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. రక్తదానం చేయడం ద్వారా జననేత జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి వరుసగా మూడో ఏడాది కూడా ఒరవడిని కొనసాగించారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే సోమవారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ప్రతినిధి జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.
మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శిబిరాన్ని ప్రారంభించగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, శాప్ చైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్రహౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దివంగతనేత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తొలుత రక్తదానం చేశారు. జగన్ సీఎం అయ్యాక తొలుత 2019లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 2,043 మంది రక్తదానం చేయగా, 2020లో 2,143 మంది రక్తదానం చేశారు. ఈ ఏడాది 2,745 మంది రక్తదానం చేసి రికార్డు నెలకొల్పారు. ఉభయ గోదావరి జిల్లాల జెడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.