మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటి తదితరులు
పరిశ్రమల నిర్వహణకు రాష్ట్రంలో పూర్తి అనువైన వాతావరణం, పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి అవకాశాలను వినియోగించుకుంటూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులను కోరుతున్నాం. ఈ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాలా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం.
రాష్ట్రంలోని నౌకాశ్రయాలు, ఓడ రేవులన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేసేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. సరుకు రవాణాకు నౌకా యానంపైనే ఎక్కువగా ఆధారపడే తయారీ రంగం, పెట్రో కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్ రంగాలలో పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాం.
ఈ రంగంలో నైపుణ్యాలను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, టెస్టింగ్ ల్యాబ్‌లు, శీతల గిడ్డంగులు (కోల్డ్ చైన్ ఫెసిలిటీ) కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నింటితో ఆయా పోర్టుల ద్వారా కార్గో రవాణాలో ఆక్వా, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం.
సాక్షి, అమరావతి: సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలన్న ప్రధాని మోదీ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో పలు కీలక చర్యలు చేపట్టామని చెప్పారు. విశాఖ పోర్టు సాంబమూర్తి ఆడిటోరియంలో ఫిక్కి(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న మారిటైమ్ ఇండియా సమ్మిట్ – 2021ను మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. 974 కిలోమీటర్లతో దేశంలోనే రెండో సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు తూర్పున అతి పొడవైన తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో 4 శాతం వాటా కలిగిన రాష్ట్రం 2030 నాటికి దానిని 10 శాతానికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విశాఖలో మేజర్ పోర్టు, ఇతరత్రా 5 రాష్ట్ర పోర్టుల (మైనర్) నిర్వహణలో ఏటా 170 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తూ దేశంలోనే గుజరాత్ తర్వాత రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరో 10 ప్రతిపాదిత (నిర్మాణానికి గుర్తించిన) పోర్టులు ఉన్నాయని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
మూడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుల నిర్మాణం
► రాష్ట్రంలో ఓడ రేవులు ప్రధాన కేంద్రంగా అనేక పారిశ్రామికవాడలు (నోడ్స్) ఏర్పాటయ్యాయి. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మరో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల నిర్మాణం చేపడుతున్నాం.
► 2023 నాటికి రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో గ్రీన్ ఫీల్డ్ పోర్టులను నిర్మించడం ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
► ఈ పోర్టుల నిర్వహణ చేపట్టే ప్రైవేటు సంస్థలకు ఎటువంటి నష్ట భయం లేకుండా వినూత్నమైన విధానంలో వీటిని నిర్మిస్తున్నాం. ఈ మూడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అభివృద్ధి చేసి, వ్యాపారంలో వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి అత్యధికంగా వచ్చే విధంగా పోటీ బిడ్డింగ్ విధానంలో ప్రైవేటు సంస్థను ఎంపిక చేస్తామన్నారు.
బ్లూ ఎకానమీలో అపార అవకాశాలు
► సముద్ర ఆధారిత వాణిజ్యంలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశీయ వాణిజ్యంలో పరిమాణం పరంగా 95 శాతం, విలువ పరంగా 70 శాతం నౌకాయానం ద్వారానే జరుగుతోంది.
► గతేడాది(2019–20)లో దేశంలోని నౌకాశ్రయాల ద్వారా 1.2 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా జరిగింది. ఈ రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం వంటి సంస్కరణలతో పాటు, మేకిన్ ఇండియా, సాగర్ మాల, భారత్ మాల వంటి కార్యక్రమాలు ఈ రంగంలో విశేష పురోగతికి దోహదం చేస్తాయి.
► ఆ దిశలో రూపొందించిన మారిటైమ్ ఇండియా విజన్ 2030 డాక్యుమెంట్ ఈ రంగంలో ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకిత భావానికి నిదర్శనం. తద్వారా ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన అనుబంధ విభాగాలు.. ఆక్వా కల్చర్, సముద్రయానం (మారిటైమ్), సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటక రంగం, రసాయన, జీవ సాంకేతిక పరిశోధన, నౌకల నిర్మాణం(షిప్ బిల్డింగ్), నౌకాశ్రయాలపై ఆధారపడిన అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా వృద్ధి అవకాశాలతోపాటు, సుస్థిరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోందనడానికి గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన మొట్ట మొదటి జాతీయ మత్స్య విధాన ముసాయిదా ఓ ఉదాహరణ.
► ఓడరేవులు, వీటిపై ఆధారపడిన పరిశ్రమలను ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక పురోగతి సాధించడంతోపాటు, సువిశాల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో నూతన ఆర్థిక నగరాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
50 మంది గ్లోబల్ సీఈవోలు.. 160 మంది వక్తలు
పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు సాంబమూర్తి ఆడిటోరియంలో ప్రారంభమైన మారిటైం ఇండియా సమ్మిట్ 2021లో అన్ని పోర్టుల చైర్మన్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర పోర్టులు, నౌక, జల రవాణా మంత్రి మన్షుక్ మాండవీయ ఉపన్యాసంతో సదస్సు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 8 దేశాల మంత్రులు, 50 మందికి పైగా గ్లోబల్ సీఈవోలు, 160 మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారు. ఇందులో 24 దేశాల నుండి 115 మంది అంతర్జాతీయ వక్తలు ఉండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సదస్సులో పాల్గొనడానికి లక్ష మందికి పైగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్, గుజరాత్ సీఎం విజయరూపానీ, ఫిక్కి జాతీయ అధ్యక్షుడు ఉదయశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామమోహనరావు, డిప్యూటీ చైర్మన్ దుర్గేష్‌కుమార్ దుబే, పోర్టు ఉన్నతాధికారులు, ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భాగస్వాములయ్యారు. ఇక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా దీన్ని వీక్షించే ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment