గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాల విషయమై నెలలో నాలుగు బుధవారాల్లో ఒక్కో వారం ఒక్కో దశలో (సచివాలయాలు, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో) ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి. తద్వారా గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం వస్తుందా.. లేదా? ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేస్తుందా.. లేదా? సచివాలయంలో కనెక్టివిటీ ఉందా.. లేదా? అన్నది తెలుస్తుంది. ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది.
సమగ్ర భూ సర్వే తొలి దశలో నిర్ణీత కాల పరిమితితో 5,500 గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది. 2023 జూన్ నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ప్రక్రియ ముగుస్తుంది. సర్వే అవగానే రికార్డులు అప్‌డేట్ అవుతాయి. యజమానులకు కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం. ఆ తర్వాత ప్రతి గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వస్తుంది. ఈ దృష్ట్యా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలి. ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది.
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో దాదాపు 80 శాతం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మిగిలిన 20 శాతం మంది పనితీరును కూడా మెరుగు పరిచేలా వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు మంచి పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూత ఇవ్వాలని, ఈ విషయంలో కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్ల సేవలపై దృష్టి పెట్టాలని, వారు మెరుగైన సేవలు అందించేలా కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. వారు అప్‌గ్రేడ్ అయ్యేలా చేయూతనిచ్చి, తీర్చిదిద్దాలని చెప్పారు. అప్పటికీ సేవలు అందించడంలో ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలని, ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
‘స్పందన’పై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఫిర్యాదులు పరిష్కరించాలి
► గ్రామ, వార్డు సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలి.
► అక్టోబర్ 29, 30 తేదీల్లో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టాలి. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమం కొనసాగాలి. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు.. బృందాలుగా వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలి.
సచివాలయాల్లో మౌలిక సదుపాయాలు
► ప్రతినెలలో తొలి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలి. సిబ్బంది, వలంటీర్లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనాలి.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. మొబైల్స్, గౌరవ వేతనం, సీఎఫ్‌ఎంఎస్ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలి.
► నెలలో రెండో బుధవారం మండలం లేదా యూఎల్‌బీ స్థాయిలో సమావేశం జరగాలి. నెలలో మూడో బుధవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సమావేశం కావాలి. నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలి. అప్పుడే మనకు ప్రతి సచివాలయంలో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు మెరుగుపడ్డాయి. దీనిని కొనసాగించాలి. తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరి. గతంలో వ్యక్తం చేసిన సమస్యలను పరిష్కరించామా? వాటిని సరిచేశామా.. లేదా? అన్నది చూడాలి.
► ఏటా జూన్, డిసెంబర్‌లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు కచ్చితంగా అమలు చేయాలి.
సమగ్ర భూ సర్వే విప్లవాత్మకం
► జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం విప్లవాత్మకమైనది. 100 సంవత్సరాల తర్వాత సర్వే, రికార్డులను అప్‌డేట్ చేస్తున్నాం. సర్వే పూర్తయితే గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుంది.
► గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో జరుగుతోంది. ఇది పూర్తవగానే జాతికి అంకితం చేస్తాం. సమగ్ర సర్వే పూర్తి చేసి, కొత్త పాసుపుస్తకాలు, రికార్డులు ఇస్తాం. మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌కల్లా పూర్తవుతుంది.
గృహ హక్కులతో 47.4 లక్షల మంది పేదలకు లబ్ధి
► జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల 47.4 లక్షల మంది లబ్ధి పొందుతారు. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
► ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టండి.
► గ్రామాల్లో తొలి విడతలో 4,314 వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలను నిర్మిస్తున్నాం. వీటిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
► అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత కార్యక్రమం, 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాల కార్యక్రమం ఉంటుంది. అర్హులెవరూ మిగిలిపోకూడదు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 10 రోజుల పాటు ఆసరా కార్యక్రమాలను బాగా నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు.
ఉద్యోగులూ.. శభాష్
Published Fri, Oct 22 2021 2:28 AM | Last Updated on Fri, Oct 22 2021 7:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment