
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో జేఎన్టీయూ శాశ్వత భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.80 కోట్లతో వ్యయంతో పరిపాలనా,బోధన,హాస్టల్ భవనాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలని తమ ప్రయత్నం అని, ఈ కాలేజీ శంకుస్థాపనే దీనికి ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులందరికి మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. (వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి)
‘‘2016లో ఫస్ట్‌బ్యాచ్ పిల్లలను తీసుకున్నారు. మనం శంకుస్థాన చేసేసరికి అప్పుడు చేరిన పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌కు వచ్చేశారు. వారికోసం కాలేజీ కట్టాలన్న ఆలోచన ఇప్పటివరకూ చేయలేదు ఇప్పటివరకూ ప్రైవేటు కాలేజీలు, ల్యాబుల్లో నడుపుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితులను మార్చాలని మనం ప్రయత్నంచేస్తున్నాం. వెనకబడ్డ పల్నాడు ప్రాంతానికి మేలు జరుగుతోంది. రూ.80 కోట్లు ఈ సంవత్సరానికి శాంక్షన్ చేశాం. వచ్చే సంవత్సరం మరోరూ.40 కోట్లు శాంక్షన్ చేస్తాం. మొత్తంగా రూ.120 కోట్లు ఖర్చు చేస్తున్నామని’ సీఎం జగన్ తెలిపారు.