సాక్షి, అమరావతి: కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. అదే విధంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ బస్ డిపోను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. కడప డిపోకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరులో ఆర్టీసీ డిపో ద్వారా ప్రజల కల సాకారమైందన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌పీ ఠాకూర్, ఆర్టీసీ ఈడీలు కృష్ణమోహన్, కోటేశ్వరరావుతో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నుంచి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, పలువురు ఎమ్మెల్యేలు, కడప నుంచి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్యెల్యేలు, కడప మేయర్ సురేష్‌బాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
దేవుడు నాకిచ్చిన అదృష్టం: సీఎం వైఎస్ జగన్
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ‘‘ఈ రోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పుంగనూరులో బస్సు డిపోను ప్రారంభించడం, అదే మాదిరిగా కడపలో డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖతో పాటు, ఆర్టీసీ కూడా ఆస్పత్రిని ప్రారంభించి, సేవలు అందించడం అభినందనీయం. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. వీటిపై ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇది దేవుడు నాకిచ్చిన అదృష్టం. మీకు ఇంకా మంచి చేయాలని, ఆ అవకాశం దేవుడు నాకివ్వాలని కోరుకుంటున్నానని’’ సీఎం జగన్ అన్నారు..
సంస్థ కు ప్రాణం పోశారు: మంత్రి పేర్ని నాని
‘‘గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సు డిపోలు మూతబడే పరిస్థితి తీసుకువచ్చి, దాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరిగింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. 50 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రూ.3600 కోట్ల భారం ఏటా పడుతున్నా, ప్రభుత్వం వెనుకంజ వేయలేదు. అంత గొప్ప మనసున్న వ్యక్తి సీఎం జగన్. కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభం. మరో వైపు పుంగనూరు డిపోను ఇవాళ ప్రారంభించారు. కార్మికుల కోసం ఇంతగా ఆలోచిస్తున్న ఇలాంటి సీఎం మనకు ఉండటం ఎంతో అదృష్టమని’’ మంత్రి పేర్ని నాని అన్నారు.
పుంగనూరు ప్రజలకు వరం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
‘సీఎం వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ఇవాళ నిలబెట్టుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పుంగనూరు డిపోను ప్రారంభించారు. పుంగనూరు ప్రజలకు ఇది ఎంతో వరం. ఆ పట్టణం 40 ఏళ్లుగా మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు డిపో లేదు. కానీ అది ఇవాళ అది సాకారం అయ్యింది. మహానేత వైఎస్సార్ హయాంలో పనులు మొదలు పెట్టినా, ఆ తర్వాత కాలంలో అవి ముందుకు సాగలేదు. మళ్లీ ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ దాన్ని పూర్తి చేశారని’’ పెద్దిరెడ్డి పేర్కొన్నారు
కాగా, మొత్తం 7.5 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో పుంగనూరు బస్సు డిపో నిర్మాణం చేశారు. 65 బస్సులతో డిపో ఏర్పాటు కాగా, ఆ డిపోను ఒక మోడల్ డిపోగానూ, అదే విధంగా డిపోలో మోడల్ వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు ఇక కడపలో ఆర్టీసికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు కాగా, మరో రూ.2 కోట్లతో మెడికల్ ఎక్విప్‌మెంట్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించారు.
1.6 ఎకరాలలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా, ఈ ఆస్పత్రిలో 7 గురు వైద్య నిపుణులు, 25 మంది పారా మెడికల్ సిబ్బందితో పాటు, హౌజ్ కీపింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్య నిపుణులు కూడా ఉన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు. దాదాపు 90 వేల మందికి కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి సేవలు అందించనుంది. దీంతో పాటు కడప ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా పేరు మార్పు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment