
సాక్షి,నెహ్రూనగర్(గుంటూరు)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ కోసం కేటాయించిన ఈ–ఆటోలను ఈ నెల 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం 516 ఈ–ఆటోలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీడీఎంఏ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ, ఇతర అధికారులను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఆదేశించారు.
కాగా గుంటూరు నగరపాలక సంస్థకు గతంలో 220 ఈ–ఆటోలు కేటాయించిన సంగతి తెలిసిందే. వీటిని ప్రభుత్వం రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. పూర్తి స్థాయిలో గురువారం నుంచి ఈ–ఆటోలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇంటింటా చెత్త సేకరణ వేగంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే శ్రమ, ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుందని అంటున్నారు. అంతేకాకుండా క్లీన్‌న్‌గుంటూరు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికులకు ఇప్పటికే ఈ–ఆటో డ్రైవింగ్‌లో అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment