మత్స్యకారుల జీవితాల్లో వెలుగు | CM YS Jagan Lays Foundation For Fishing Harbour | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల జీవితాల్లో వెలుగు

Published Sat, Nov 21 2020 9:59 PM | Last Updated on Sat, Nov 21 2020 10:13 PM

CM YS Jagan Lays Foundation For Fishing Harbour - Sakshi

సాక్షి, అమరావతి : మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పరచడం ద్వారా వారి జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పాటు మత్స్య పరిశ్రమ రూపు రేఖలను మార్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్‌ సదుపాయం కోసం రూ.3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రూ.1,510 కోట్లతో నిర్మించనున్న 4 ఫిషింగ్‌ హార్బర్లకు, తొలి దశలో 25 ఆక్వా హబ్‌లకు శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని మత్స్యకారులు, ఆక్వా రైతులను ఉద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. నవరత్నాల్లోని ప్రతిదాన్ని మత్స్యకారులకు అందిస్తూనే.. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. రాబోయే సంవత్సర కాలంలో చేపలు, రొయ్యలు, పీతలు సాగు చేసే రైతుల జీవితాలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో రూ.225 కోట్లతో ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపడతున్నామని వెల్లడించారు. రూ.10 వేల కోట్ల వ్యయంతో మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్ట్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

పండుగగా ప్రపంచ మత్స్య దినోత్సవం

  • ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. దీనిని మనం ఒక పండుగగా జరుపుకుంటున్నాం. మన దేశానికి 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే, మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. దేశంలో సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రెండవ రాష్ట్రం మనది. 
  • అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల జీవితాలు మాత్రం పెద్దగా ఎందుకు మారలేదని, మనమంతా మనస్సాక్షితో గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించాలి. మత్స్యకారుల జీవితాలు ఎంత దయనీయమైన స్థితిలో వున్నాయి అనేది నా పాదయాత్రలో నా కళ్లారా చూశాను.
  • మంచి చదువులు చదువుకోలేని పరిస్థితి. పక్కా ఇళ్లు లేని దుస్థితి. సరైన ఆరోగ్య వసతి, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేని పరిస్థితి. పట్టిన చేపలకు తగిన ధర రాని దైన్యం. మన కళ్లెదుటే ఇవన్నీ కనిపిస్తున్నాయి. 

మత్స్యకారుల జీవితాలను చూసి చలించిపోయాను

  • మన మత్స్యకారులు అతి తక్కువ జీతానికి ఎక్కడో ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ బతుకు దెరవు కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగిస్తున్న వారిని పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపితే, అక్కడ మనవాళ్లు మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
  • పాదయాత్రలో తీర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ కన్నీటి గాథ నన్ను చలింపచేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంపై మన ఎంపీలు తీవ్రమైన ఒత్తిడి తేవడంతో పాటు, నేను కూడా ప్రత్యేకంగా కేంద్రంతో మాట్లాడాను. 
  • ఆ జైళ్లలో మగ్గిపోతున్న మన వారిని తిరిగి ఇక్కడకు తీసుకు రావడానికి పెద్ద ప్రయత్నమే చేశాం. వారు తిరిగి వచ్చినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకు మన మత్య్సకారులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆలోచిస్తే బాధ కలిగింది. 

మత్స్యకారుల జీవితాలను మార్చాలన్న లక్ష్యంతో అడుగులు

  • పెద్ద సముద్రతీరం ఉన్నా.. మన రాష్ట్రానికి అవసరమైన పోర్ట్‌లను తెచ్చుకోలేక పోయాం. ఫిషింగ్ హార్బర్‌లను కట్టుకోలేక పోయాం. ఇన్ని సంవత్సరాల తరబడి మత్స్యకారులను పట్టించుకోవాలన్న ఆలోచన చేయలేదు. 
  • మత్స్యకారుల సమస్యలకు సమాధానాలు ఏమిటి? మొత్తంగా మత్స్య పరిశ్రమ పరంగా విస్తారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఒక రాష్ట్రంగా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల పరిపాలనలో ఇలా ఆలోచన చేశాం. వీరి జీవితాలు ఎలాగైనా మార్చాలని అడుగులు ముందుకు వేశాం. 
  • నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని కూడా మత్స్యకారులకు అందించడంతో పాటు ప్రత్యేకించి వారికి ఇచ్చిన ప్రతి  వాగ్దానాన్ని మొట్ట మొదటి ఏడాదిలోనే మన ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి, చెప్పిన ప్రతి దానిని నెరవేరిస్తేనే, మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని భావించి అడుగులు ముందుకు వేశాం.

ఇప్పుడు నాలుగు.. త్వరలో మరో నాలుగు

  • ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి అటు మత్స్యకారుల జీవితాలు, ఇటు రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమ రూపురేఖలను కూడా మార్చేందుకు దాదాపు రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్‌లకు నేడు శంకుస్థాపన చేస్తున్నాం. 
  • డిసెంబర్ 15 నాటికి ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని, పనులు కూడా ప్రారంభమవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నాం.

25 ఆక్వా హబ్‌లకు శంకుస్థాపన 

  • రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో.. ఒక్కొక్కటి చొప్పున ఆక్వా హబ్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నాం. తొలి దశలో భాగంగా 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. 
  • వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చి, పౌష్టికాహార భద్రతను కల్పించడంతో పాటు, జనతాబజార్లకు అనుసంధానం చేసి, మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. 
  • ఇందులో భాగంగా 8 ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు.. వీటన్నింటికీ కలిపి దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో చేపలు, పీతలు, రొయ్యలను సాగు చేస్తున్న రైతుల జీవితాలను పూర్తిగా మార్చే దిశగా.. కనీసం 30 శాతం మన రాష్ట్రంలోనే వాటి కొనుగోళ్లు జరిగేలా జనతాబజార్లకు అనుసంధానం చేస్తున్నాం.
  • మున్సిపాలిటీ వార్డుల్లో, గ్రామ సచివాలయాల పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేసి, వాటిల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక ఏడాది కాలంలోనే వీటి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. 

మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్ట్‌ల నిర్మాణం

  • మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో దాదాపు మరో రూ.10 వేల కోట్లతో మరో మూడు పోర్ట్‌లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీటికి సంబంధించి మరో రెండు, మూడు నెలల్లోనే టెండర్లను ఫైనలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. 
  • 2019 ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మేనిఫేస్టోలో చెప్పిన మూడు వాగ్దానాలు నెరవేర్చాం. మత్స్యకార అక్కచెల్లెమ్మల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాం. 

మత్స్యకారుల సంక్షేమం కోసం ఇలా..

  • ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిషేధ సమయం. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఎప్పుడూ సకాలంలో వారికి సాయం అందించలేదు. కొన్నిసార్లు ఇచ్చినా, అది కూడా అరకొరే. దానిని కూడా అందిరికీ ఇచ్చేవారు కాదు.
  • మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేట నిషేధ సమయంలో ఆదాయాన్ని కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు సాయంగా ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 2019-20లో మొత్తం1,02,332 కుటుంబాలకు రూ.102.33 కోట్లు అందించామని గర్వంగా చెబుతున్నాం.  
  • వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయం గత ఏడాది నవంబర్‌లో ఇచ్చాం. ఈ ఏడాది కూడా నవంబర్‌లోనే ఇవ్వాలనుకోకుండా మే నెలలోనే చెల్లించాం. గత ఏడాది ఇచ్చిన దానికన్నా ఎక్కువగా అంటే 1,09,2307 కుటుంబాలకు దాదాపు రూ.110 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశాం.

దేశీయ, నాటు, తెడ్డు తెరచాప మత్స్యకారులకు సాయం

  • గతంలో మర పడవల్లో చేపల వేటకు వెళ్లే వారికే ఈ సాయం అందించేవారు. అదికూడా రిజిస్ట్రేషన్ చేయకుండా అష్టకష్టాలు పెట్టే వారు.
  • ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ.. దేశీయ, నాటు, తెడ్డు, తెరచాప సహాయంతో వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా వేట నిషేధ సమయంలో రూ.పది వేల సాయం అందిస్తున్న ప్రభుత్వం మనది. 
  • మనం అధికారంలోకి రాకముందు మత్స్యకారుల బోట్లకు డీజిల్ లీటర్‌కు ఆరు రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఈ రోజు మన ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని ఆరు నుంచి తొమ్మిది రూపాయలకు పెంచింది. ఆ రాయితీని బంకులో డీజిల్ కొట్టే సమయంలోనే తగ్గించి తీసుకునేలా చర్యలు తీసుకున్నాం.
  • సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకార సోదరులు మరణిస్తే, గతంలో వారి కుటుంబానికి అందించే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాం. మీ బిడ్డగా, మీమీద మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశాను. 

గుజరాత్‌ బకాయి పెట్టినా, రూ.78 కోట్లు చెల్లించాం

  • గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ 2012లో మన రాష్ట్రంలోని సముద్ర తీరంలో డ్రిల్లింగ్ చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాల్లో 68 మత్స్యకార గ్రామాల్లోని 16,559 మత్స్యకార కుటుంబాలు జీవన భృతి కోల్పోయాయి.
  • 13 నెలల పాటు డ్రిల్లింగ్ జరిగింది. అయితే గుజరాత్ పెట్రోలియం సంస్థ ఆరు నెలల కాలానికి రూ.68 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన ఏడు నెలలకు చెల్లించాల్సిన రూ.78 కోట్లు బకాయి పెట్టింది. దీనిని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 
  • నా పాదయాత్రలో బాధిత మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ సమస్యను గుర్తు పెట్టుకుని, గత ఏడాది ఇదే మత్స్యకార దినోత్సవం రోజున రూ.78 కోట్ల బకాయిలను మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. కేంద్రం నుంచి ఈ మొత్తం ఎప్పుడు వస్తుందో తెలియదు.. అప్పటి వరకు మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సొమ్ము చెల్లించింది. 

ఆక్వా రైతులకు విద్యుత్‌ యూనిట్‌ రూ.1.50కే ఇస్తున్నాం

  • మొత్తంగా మత్స్యకార రంగానికి మద్దతుగా నిలుస్తున్నాం. ఆక్వా రైతులకు కరెంట్ యూనిట్ రూ.1.50కే అందిస్తున్నాం. ఇందుకోసం ఏకంగా రూ.720 కోట్ల సబ్సిడీని ఆక్వా రైతుల కోసం చిరునవ్వుతోనే ప్రభుత్వం భరిస్తోంది. 
  • అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు, మూడు నెలలు కూడా ఆగకుండా ఈ కార్యక్రమానిక శ్రీకారం చుట్టాం. దీనివల్ల సుమారు 55 వేల మంది ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది.
  • మత్స్యకారులకు అండగా నిలిచేందుకు సంబంధిత గ్రామ సచివాలయాల్లో 794 మంది మత్స్య సహాయకులను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నియమించాం. 
  • ఆర్బీకేల్లో రైతులకే కాదు, మత్స్యకారులు, ఆక్వా రైతులకు కూడా తోడుగా వుండి, వారిని చేయిపట్టుకని మత్స్య సహాయకులు నడిపిస్తున్నారు. 

ఏపీ ఫిష్ ఫీడ్ యాక్ట్, ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ 

  • నాణ్యమైన చేపలు, రొయ్యల మేత అందుబాటులో లేక రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో పాదయాత్రలో కళ్లారా చూశాను. క్వాలిటీ అనేది తెలియక, ఆ ఫీడ్‌లో ఫెస్టిసైడ్స్‌, కెమికల్స్ వుండటం వల్ల ఆక్వా ఉత్పత్తులు అమ్ముడు పోక రకరకాలుగా ఆక్వా రైతులు ఇబ్బంది పడ్డారు. 
  • ఆక్వా రైతులకు నాణ్యమైన మేత అందించాలనే ఉద్దేశంతో, నకిలీలను అడ్డుకునేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీ ఫిష్ ఫీడ్ చట్టాన్ని చేశాం. ఇందుకోసం ఆక్వా రైతులకు నాణ్యమైన చేప, రొయ్య పిల్లల సరఫరాకు ఏపీ ఫీష్ సీడ్ కంట్రోల్ ఆర్డినెన్స్‌ కూడా జారీ చేశాం. 
  • ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.50 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. 
  • నా పాదయాత్రలో ఆక్వా రైతుల కష్టాలను చూశాను. ఎక్కడా ల్యాబ్‌లు లేవు. కృష్ణా జిల్లాలో సమస్య వస్తే.. ఎక్కడికో కాకినాడ వరకు తీసుకుపోవాల్సి వచ్చేది. అంతదూరం పోలేక, ఎవరి దగ్గర దొరికితే.. వారి దగ్గర సీడ్ తీసుకునేవారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, క్వాలిటీ అనేది ప్రతి ఆక్వా రైతుకు కూడా అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. 

ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు

  • మత్స్య, ఆక్వా రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి, నైపుణ్యం పెంచడానికి, పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేశాం. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ పనులు ప్రారంభమవుతాయి. ఇవ్వన్నీ కూడా మంచి మనసుతో చేశాం. 
  • దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మరింతగా మీ అందరికీ మేలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను.
  • ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అగ్రికల్చర్‌ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మీ మేలు మరవలేం
‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని మీరు పాదయాత్రలో అన్నారు. సీఎం కాగానే మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు. తక్కువ టైంలో మా చేతికి రూ.10 వేల సాయం అందింది. మీరు చిన్న కర్ర తెప్పలను కూడా గుర్తించి వాళ్లకు కూడా రూ.10 వేలు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం. గతంలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఎవరైనా వేటకు వెళ్లి మరణిస్తే అందించే సాయాన్ని ఏకంగా రూ.10 లక్షలు చేశారు. పాకిస్తాన్‌, గుజరాత్‌తో చిక్కుకుపోయిన మత్స్యకారులను రప్పించిన మీ మేలు మరవలేం. మంచినీళ్లు పేట దగ్గర జెట్టీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మత్స్యకారులం అందరం మీకు రుణపడి ఉంటాం. ఎల్లకాలం మీరే సీఎంగా ఉండాలి. 
- లక్ష్మయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట, శ్రీకాకుళం.

మత్స్యకారుల జీవితాల్లో వెలుగు 
సముద్రంలో చేపల వేట నా వృత్తి. మీరు ఈ రోజు నిజాంపట్నం పోర్టు అభివృద్ధికి రూ.451 కోట్లు కేటాయించి మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఈ పోర్టు అభివృద్ధి చెందితే అక్కడ శీతల గిడ్డంగిలు, ఐస్‌ ప్లాంట్స్, ఆక‌్షన్‌ హాల్స్, విశ్రాంతి భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మాకు ఎన్నెన్నో అవకాశాలు అందివస్తాయి. ఏటా రూ.10 వేలు సాయం చేస్తున్నారు. ఆయిల్‌ సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచారు. ఆర్బీకేల పక్కన మత్స్య మార్కెటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యకారులందరి తరఫున మీకు ధన్యవాదములు.
- ఎన్‌.శివయ్య, మత్స్యకారుడు, నిజాంపట్నం గ్రామం, గుంటూరు జిల్లా

ఏ ప్రభుత్వం ఇలా మేలు చేయలేదు
మీరు ఆక్వా కల్చర్‌లో అన్ని అంశాలను ఒక గొడుగు కిందకు తెస్తూ.. ఆక్వాకల్చర్‌ అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల మా సమస్యలన్నింటికి పరిష్కారం కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ చూడనంత తీవ్రంగా, తీక్షణంగా మీరు మా సమస్యను చూసి పరిష్కరిస్తున్నారు. గతంలో ఇంత మేలు ఎప్పుడూ జరగలేదు. యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 చొప్పున ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకరకంగా ఈ రోజు రైతులు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు మీరే కారణం. కోవిడ్‌ సమయంలోనూ మద్దతు ధర కల్పించి ఆదుకుంటున్నారు. ఆక్వా హబ్‌లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, జనతా బజార్లు మా తల రాతలను మారుస్తాయనడంతో సందేహం లేదు. 
- కనుమూరి ప్రసాద్, గుడివాడ, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement