CM YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్‌ | CM YS Jagan Made Clear Andhra Pradesh Economic Situation Better | Sakshi
Sakshi News home page

‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్‌’.. గణాంకాలతో వివరించిన సీఎం వైఎస్‌ జగన్‌

Published Sat, Sep 17 2022 2:51 AM | Last Updated on Sat, Sep 17 2022 8:09 AM

CM YS Jagan Made Clear Andhra Pradesh Economic Situation Better - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే, అవి చంద్రబాబునాయుడుకు ఉండి ఉండాలని అన్నారు. ఆర్థిక పరంగా రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కోవాలనేది చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా ఆశ అని చెప్పారు. అయితే ఆరి్థకంగా రాష్ట్రం బాగుండటంతో దుష్టచతుష్టయం జీర‍్ణించుకోలేక పోతోందని దుయ్యబట్టారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగోలా డబ్బులు రాకుండా ఆపేయాలనే దుర్బుద్ధితో అప్పులపై కేంద్రానికి, రిజర్వ్‌ బ్యాంకు, బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు తప్పుడు ఉత్తరాలు రాయడంతో పాటు కోర్టుల్లో తప్పుడు కేసులు కూడా వేస్తూ రాత్రీ పగలనక దుష్టచతుష్టయంశక్తులు కష్టపడుతున్నాయని చెప్పారు. ఆర‍్థిక వ్యవస్థ బాగుండక పోతే చంద్రబాబు, ఎల్లో మీడియాకు బాగుంటుందని, ఆర్థిక వ్యవస్థ బాగుండటం వారికి చేదువార్త అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధిపై శుక్రవారం ఆయన అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడారు. మెరుగైన ప్రభుత్వ పాలన, చర్యల వల్లే దేశంలోనే 2021–22 ఆరి్థక ఏడాదిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిలో ఏపీ అగ్రగ్రామిగా ఉందని తెలిపారు. దుష్టచతుష్టయం పదే పదే అప్పులపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడుతూ వాస్తవ పరిస్థితిని కాగ్‌ గణాంకాలతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.

‘అప్పులపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5తో పాటు దత్తపుత్రుడు చేస్తున్న ద్రుష్పచారాన్ని నమ్మొద్దు. గత చంద్రబాబు ప్రభుత్వం కన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. బాబు హయాంలో కన్నా అప్పులు తక్కువ, క్యాపిటల్‌ వ్యయం ఎక్కువగా చేశాం. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా దీన్ని జీర్థించుకోలేని స్థితిలో ఉంది. కోవిడ్‌ విసిరిన పెద్ద సవాళ్లు, విలయంలో కూడా మెరుగైన ఆర్థిక క్రమశిక్షణతో పాలన సాగిస్తున్నాం. తద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించగలిగాం. 5.3 కోట్ల ప్రజల కోసం ఇంటింటికి సంక్షేమం, అభివృద్ధి అందిస్తూ మేనిఫెస్టోలో చెప్పిన 98.4% హామీలను అమలు చేశాం. ఇదంతా గిట్టకే ఎలాగైనా ఈ పథకాలన్నీ నిలిచి పోవాలని వారు విష ప్రచారం చేస్తున్నారు. ’

– అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

శ్రీలంక అంటూ ఊహాజనిత వార్తల సృష్టి 
► రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నా కూడా.. బాగోలేదని, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో పడిందని, చంద్రబాబు ఆయనతో పాటు ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, తోడుగా ఉన్న దత్తపుత్రుడు దు్రష్పచారం చేస్తున్నారు. వీళ్లంతా ఒక బ్యాచ్‌. దోచుకో, పంచుకో, తినుకో అనే దొంగల ముఠా. వీళ్లంతా రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని రకరకాల ఊహాజనిత వార్తలు ప్రజల్లో సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు.  

►  వీళ్ల చేతుల్లో పేపర్లు, టీవీలు ఉన్నాయి. వీళ్లు రాయాలనుకున్నది రాస్తారు. చూపాలనుకున్నది చూపిస్తారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ల దగ్గరున్న పత్రికలు, టీవీల ద్వారా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. 

గతం కన్నా బాగున్న జీడీపీ  
► రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రధాన సూచిక అయిన జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) గమనిస్తే.. గతంలో కంటే చాలా బాగుంది. దేవుడి దయ వల్ల కోవిడ్‌ దాడిని కూడా మనం తట్టుకుని నిలబడ్డాం. 2018–19లో అంటే చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీడీపీలో పెరుగుదల 5.36 శాతం కాగా.. మన హయాంలో 2019–20లోకి వచ్చేసరికి 6.89 శాతంతో దేశంలో 6వ స్థానానికి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో జీడీపీ పరంగా 21వ స్థానంలో ఉన్నాం. ఈ మూడేళ్లలో మనం టాప్‌ మూడు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాం. 

► 2021–22లో ఇప్పటి దాకా కేంద్రం విడుదల చేసిన, అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.43 శాతం పెరుగుదలతో దేశంలోనే ఇప్పటి వరకు ప్రకటించిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్నాం. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటాను పోల్చి చూస్తే...2014–19 మధ్య.. అంటే గత ప్రభుత్వ హయాంలో 4.45 శాతమే ఉంటే ఇప్పుడు అది మన హయాంలో 2019–22 మధ్య మూడేళ్లలోనే 5 శాతానికి పెరిగింది. గత ప్రభుత్వం కంటే మెరుగైన పనితీరు కనపర్చాం. అంటే దేశ జీడీపీలో మన వాటా పెరిగింది. ఈ లెక్కన సహజంగానే రాష్ట్ర ప్రజల తలసరి జీడీపీ కూడా పెరుగుతుంది.

కోవిడ్‌ విలయంలోనూ జీడీపీ పెరుగుదల 
► గత రెండేళ్లుగా కోవిడ్‌ సృష్టించిన విలయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల జీడీపీ, ప్రపంచ వ్యాప్తంగా స్థూల ఉత్పత్తి తగ్గిపోవటం చూస్తున్నాం. అందుకు భిన్నంగా, దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే జీడీపీ పడిపోకుండా పెరుగుదల నమోదైంది. ఆ నాలుగింటిలో ఏపీ ఒకటి. మణిపూర్, పశ్చమబెంగాల్, తమిళనాడు, ఏపీలో మాత్రమే పెరుగుల కనిపిస్తుంది. 

 ఇందుకు ముఖ్య కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా, వస్తువులకు డిమాండ్‌ పడిపోకుండా  కాపాడేలా మన ప్రభుత్వం అమ్మఒడి, చేయూత ,ఆసరా, సామాజిక పెన్షన్లు వంటి ఇతర కార్యక్రమాల పేద వర్గాలను ఆదుకోగలిగాం. నాడు–నేడు వంటి కార్యక్రమాలు, జలయజ్ఞం ద్వారా పెట్టుబడి వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌) చేయగలిగాం. వీటన్నింటి వల్ల మనం మాత్రం పాజిటివ్‌ గ్రోత్‌ రేట్‌ నమోదు చేయగలిగాం.

అప్పుల పెరుగుదల తక్కువే 
 2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు రూ.1,20,556 కోట్లు అయితే.. 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పు రూ.2,69,462 కోట్లు. ఇవన్నీ కాగ్‌ రిపోర్ట్స్‌ ప్రకారం. అంటే ఆ ఐదేళ్లలో రాష్ట్ర రుణం 123.52 శాతం పెరిగింది. అదే ‘కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌’ (సీఏజీఆర్‌) ప్రకారం చూస్తే ఆ ఐదేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 17.45 శాతంగా కనిపిస్తోంది.  

► 2019 మే నెలలో మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి ఉన్న గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2,69,462 కోట్లు. ఈ మూడేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ప్రభుత్వ రుణం రూ.3,82,165 కోట్లు. అంటే ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 41.83 శాతం. అదే సీఏజీఆర్‌ ప్రకారం చూస్తే, మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పులు 12.73 శాతం మాత్రమే.  

► మరి ఇంతగా ఆక్రందనలు చేసే ఈనాడు, టీవీ5.. చంద్రబాబు హయంలో చేసిన అప్పులు, మన హయాంలో చేసిన అప్పుల గురించి ఎందుకు రాయరు అన్నది ఆలోచించాలి. గత ప్రభుత్వ హయాంలో కంటే, మన ప్రభుత్వం వచ్చాక ఈ మూడేళ్లలో పెరిగిన అప్పులు చాలా తక్కువ. ఈ గణాంకాలన్నీ కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలో స్పష్టంగా ఉన్నాయి.

గ్యారెంటీలూ బాబు హయాంలోనే ఎక్కువ 
 ప్రభుత్వ గ్యారెంటీలు కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ. 2014లో రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు, ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాలు రూ.14,028.23 కోట్లు. 2019 మే నెలలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాలు ఎగబాకి మొత్తం రూ.59,257.31 కోట్లు. 

దీంతో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.3,28,719 కోట్లు. అంటే ఆ ఐదేళ్లలో పెరిగిన రుణాలు ఏకంగా 144.25 శాతం. ఇక సీఏజీఆర్‌ పరంగా చూస్తే ఆ ఐదేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం సాలీనా 19.55 శాతం.

గత ప్రభుత్వ హయాంలో 144 శాతం.. ఇప్పుడు 52 శాతం 
 2019 మే నెలలో మన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు, ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాలు రూ.59,257.31 కోట్లు ఉంటే.. ఈ మూడేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాల మొత్తం రూ.1,17,730.33 కోట్లు. అంటే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు రూ.4,99,895 కోట్లు. అంటే ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 52.07 శాతం.  

► అదే సగటున ఏడాదికి సీఏజీఆర్‌ ప్రకారం చూస్తే, మూడేళ్లలో సాలీనా పెరిగిన రాష్ట్ర అప్పు 15.46 శాతం మాత్రమే. అంటే గత ప్రభుత్వ హయాంలో 144 శాతం పెరిగితే... మన ప్రభుత్వ హయాంలో 52 శాతం పెరుగుదల. గత ప్రభుత్వం హయాంలో సాలీనా పెరుగుదల 19.55 శాతం అయితే మన ప్రభుత్వ హయాంలో 15.46 శాతం మాత్రమే. 

కేంద్రంతో పోల్చి చూస్తే ఇప్పుడు మనం ఎంతో మెరుగు 
 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే కేంద్రం చేసిన అప్పులు (డెట్‌ టు జీడీపీ) పతాక స్థాయికి చేరుకున్నాయి. కోవిడ్‌ సమయంలో దాని ప్రభావం ఎలా పడిందో కనిపిస్తోంది. 2020–21తో పాటు, 2021–22లో డెట్‌ టు జీడీపీ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. 2014–15లో స్థూల దేశీయ ఉత్పత్తి రూ.124 లక్షల కోట్లు అయితే, ఆ ఏడాది కేంద్రానికి ఉన్న అప్పులు రూ.62,42,220 కోట్లు. ఈ అప్పులు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు పరిగణనలోకి తీసుకోకుండా చెప్పినవి. అంటే  డెట్‌ టు జీడీపీ 50.07 శాతం. 

► 2020–21లో జీడీపీ రూ.198,00,913 కోట్లు కాగా, ఆ ఏడాది కేంద్రం అప్పులు రూ.120,79,018 కోట్లు. అంటే డెట్‌ టు జీడీపీ ఏకంగా 61 శాతానికి పెరిగింది. దేశానికే ఈ రకమైన తల్లడిల్లే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఏడాది 2021–22లో జీడీపీ రూ.236,64,636 కోట్లు కాగా, అప్పుల మొత్తం రూ.135,88,193 కోట్లు. అంటే డెట్‌ టు జీడీపీ 57.42 శాతం. ఈ విషయం బడ్జెట్‌ డాక్యుమెంట్లతో పాటు, గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐ) నివేదికలో స్పష్టంగా ఉంది. 

► రాష్ట్ర విభజనకు ముందు నుంచి కేంద్రంతో పోలిస్తే, రాష్ట్ర రుణాల పెంపు తక్కువగానే ఉంది. రాష్ట్ర విభజనకు ముందే, అంటే 2014 మే 31 నాటికి, కేంద్రానికి ఉన్న రుణాలు రూ.59,09,965.48 కోట్లు. 2019 మే 31 నాటికి ఆ రుణం రూ.94,49,372.03 కోట్లకు చేరింది. అంటే ఐదేళ్లలో కేంద్రం అప్పులు 59.88 శాతం పెరిగాయి. ‘కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌’ (సీఏజీఆర్‌) ప్రకారం చూస్తే ఆ ఐదేళ్లలో పెరిగిన కేంద్ర రుణం 9.84 శాతం.  
 
కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువ అప్పు (కరోనా సమస్యను ఎదుర్కొంటూనే) చేసింది. అదే చంద్రబాబు హయాంలో చూస్తే అప్పటి కేంద్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ అప్పులు చేసింది. పైగా బాబు హయాంలో కరోనా కూడా లేదు. ఈ పరిస్థితిలో ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి.. దోచుకో, పంచుకో, తినుకో అని దోచేశారో ప్రజలకు తెలియాల్సి ఉంది. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా ఎల్లో మీడియా, చంద్రబాబు పనికట్టుకుని దు్రష్పచారం చేస్తున్నారు. 

ఇదీ చదవండి: ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement