AP: ఇళ్లకు పావలా వడ్డీ రుణాలు | CM YS Jagan Mandate to collectors on Pavala Vaddi Loans | Sakshi
Sakshi News home page

AP: ఇళ్లకు పావలా వడ్డీ రుణాలు

Published Thu, Aug 26 2021 4:12 AM | Last Updated on Thu, Aug 26 2021 8:23 AM

CM YS Jagan Mandate to collectors on Pavala Vaddi Loans - Sakshi

స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉన్నతాధికారులు, మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులైన పేదలకు పావలా వడ్డీ కింద రుణాలు ఇప్పించేలా బ్యాంకర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులకు పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్‌ చేశామని, అత్యవసర సమయాల్లో వీటి మీద రుణం తెచ్చుకునేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పావలా వడ్డీ మాత్రమే లబ్ధిదారుడికి పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. రుణ సదుపాయం వల్ల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మరింత ఊపందుకుంటుందన్నారు.

కొన్ని జిల్లాల్లో సెర్ప్, మెప్మా సహకారంతో లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారని తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీ, గృహ నిర్మాణంతో పాటు ఖరీఫ్‌ సన్నద్ధత, వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష, పరిశ్రమలపై ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

పది రోజుల్లో ప్లాట్ల మ్యాపింగ్‌ 
హౌసింగ్‌ లే అవుట్లలో లబ్ధిదారుల ప్లాట్ల మ్యాపింగ్‌ 10 రోజుల్లోగా పూర్తిచేయాలి. దీనివల్ల అర్హులైన వారికి మిగిలిన ప్లాట్లను వెంటనే కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా దరఖాస్తులు స్వీకరించి అర్హులుగా గుర్తించిన వారికీ ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న సుమారు 8 వేల దరఖాస్తుల వెరిఫికేషన్‌ వెంటనే పూర్తి చేయాలి. ప్రస్తుత లే అవుట్ల ద్వారా 45,212 మందికి పట్టాలు ఇవ్వబోతున్నాం. కొత్త లే అవుట్లలో 10,801 మందికి పట్టాలు ఇస్తాం. మరో 1,43,650 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. 

నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ
తొలిదశలో 15.60 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. ఇప్పటివరకు 10.11 లక్షల ఇళ్లు  గ్రౌండింగ్‌ అయ్యాయి. ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ప్రతి ఇంటి నిర్మాణ ప్రగతిపై ఆన్‌లైన్‌ స్టేజ్‌ అప్‌డేషన్‌ చేయాలి. హౌసింగ్‌పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి.

అక్టోబర్‌ 25 నుంచి ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణం 
ఆప్షన్‌–3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం అక్టోబర్‌ 25 నుంచి మొదలవుతుంది. ఆప్షన్‌ 3 లబ్ధిదారుల సంఖ్య 3.25 లక్షలు కాగా ఇప్పటికే 1.77 లక్షల ఇళ్లకు సంబంధించి 12,855 గ్రూపులు ఏర్పాటయ్యాయి. మిగిలిన చోట్ల గ్రూపుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. అక్టోబరు 25లోగా అన్ని సన్నాహాలు పూర్తి కావాలి. నీరు, కరెంట్‌ సదుపాయాలను సెప్టెంబర్‌ 15లోగా కల్పించేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

ధరలు పెంచితే కఠిన చర్యలు
కొన్ని జిల్లాల్లో మెటల్‌ ధరలను అనూహ్యంగా పెంచారన్న సమాచారం వస్తోంది. కలెక్టర్లు దీనిపై చర్యలు తీసుకోవాలి. వెంటనే రేట్లు నిర్ణయించాలి. ధరలు పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పంపాలి. లే అవుట్ల సమీపంలోనే ఇటుకల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. వారానికి ఒకసారి కలెక్టర్లు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయాలి. 

ఇ–క్రాపింగ్‌ చాలా కీలకం..
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మండలాలు మినహా సాధారణ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ సాగు లక్ష్యం 92.21 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకూ 59.07 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. ఇందులో 37.25 లక్షల ఎకరాల్లో ఇ–క్రాపింగ్‌  పూర్తైంది. మిగిలిన చోట్ల కూడా ఇ–క్రాపింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు 10% ఇ– క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. జేడీఏలు, డీడీఏలు 20 శాతం ఇ–క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్‌ అధికారులు 30 శాతం తనిఖీ చేయాలి. సీజన్‌తో సంబంధం లేకుండా ఇ– క్రాపింగ్‌ జరగాలి. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లను రైతుల నుంచి డిమాండ్‌ చేయకూడదు. రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట సేకరణ, పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు సరఫరా ఇలా అన్నింటికీ ఇ–క్రాపింగ్‌ చాలా కీలకం. 

వ్యవసాయ సలహా మండళ్లు
వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు కొనసాగాలి. వీటిని కలెక్టర్లు పర్యవేక్షించి సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల్లో, రెండో శుక్రవారం మండల స్థాయిల్లో, ప్రతి 3వ శుక్రవారం జిల్లాల స్థాయిలో సలహా మండళ్ల సమావేశాలు జరగాలి. జిల్లాస్థాయి సమావేశాలకు కలెక్టర్‌ హాజరు కావాలి.

కల్తీపై కొరడా..
ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువుల తదితరాల పంపిణీ, నాణ్యతపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ఎక్కడా కల్తీలకు చోటు ఉండకూడదు. ప్రైవేట్‌ దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలి. రైతులకు రుణాలతో పాటు ఇతర బ్యాంకింగ్‌  సేవలు అప్పుడే సక్రమంగా అందించగలుగుతాం. 

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష
జగనన్న శాశ్వత భూహక్కు  భూరక్ష చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం. కలెక్టర్ల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. భూ వివాదాల్లేని రాష్ట్రం దిశగా ఏపీలో ఈ సర్వేను నిర్వహిస్తున్నాం.

ఎంఎస్‌ఎంఈలకు 3న ప్రోత్సాహకాలు
ఎంఎస్‌ఎంఈలకు సెప్టెంబరు 3న ప్రోత్సాహకాలు విడుదల చేయబోతున్నాం. కలెక్టర్లు నెలలో ఒకరోజు ఎంఎస్‌ఎంఈలకు, మరో రోజు ఇతర పరిశ్రమలకు కేటాయించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. అప్పుడే పారిశ్రామిక రంగం ప్రగతి సాధిస్తుంది. కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్న ఇండస్ట్రియల్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ నెలలో ఒకరోజు సమావేశం కావాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాల విడుదలకు మార్గం సుగమమవుతుంది. భూముల కేటాయింపులు, కాలుష్య నివారణ తదితర అంశాలపై కూడా దృష్టి సారించవచ్చు.

75% ఉద్యోగాలు స్థానికులకే 
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించే చట్టం అమలుపైనా కలెక్టర్లు సమీక్షించాలి. పరిశ్రమలకిచ్చే రాయితీలకు ఈ చట్టంతో సంబంధం ఉంది. 75 శాతం స్ధానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాయితీలకు అర్హత ఉండదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపైనా దృష్టి పెట్టాలి. విజయదశమి రోజున వీటి నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను పెండింగ్‌లో పెట్టారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దిష్ట తేదీ ప్రకటించి ఇన్సెంటివ్స్‌ ఇస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, ఇతర పరిశ్రమలకు కరెంటుపై రాయితీతోపాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం. అప్పుడే పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. నెలకు మూడు రోజులు కలెక్టర్లు సమయం కేటాయిస్తే పారిశ్రామిక వేత్తలకు భరోసా కలిగి ముందుకు వస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement