
హరియాణా సీఎంకు జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మ.1.05 గంటలకు విశాఖ రుషికొండ పెమా వెల్‌నెస్ కేంద్రానికి చేరుకున్న జగన్‌కు హరియాణా సీఎం ఖట్టర్ బయటకు వచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ ఆత్మీయ సత్కారం చేసి జ్ఞాపికను అందించారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్న అనంతరం వైఎస్ జగన్ తిరిగి విజయవాడకు పయనమయ్యారు.
సీఎం జగన్‌తో పాటు ఆయన సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డి.. సీఎం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం కూడా విశాఖ వచ్చారు. అంతకుముందు.. విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ శ్రేణుల్ని సీఎం జగన్ ఆత్మీయంగా పలకరించారు. సుమారు 50 నిమిషాల పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లతో ఆయన ముచ్చటించారు. గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్‌నా«థ్, దాడిశెట్టి రాజాతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.
నేచురోపతి కోసం వచ్చా
ఈ సందర్భంగా మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. తన మిత్రుడు సూచన మేరకు తాను ఇక్కడకు నేచురోపతి చికిత్స కోసం వచ్చానన్నారు. ఇక్కడైతే ఎలాంటి హడావుడి ఉండదని, ప్రశాంతత కోసం వచ్చానని ఆయన చెప్పారు. వైజాగ్ చాలా బాగుందని ఖట్టర్ కితాబిచ్చారు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను కలవడానికి వచ్చారని.. ఇరువురం కలిసి లంచ్ చేశామని.. సుహృద్భావ వాతావరణంలో తమ భేటీ జరిగిందని.. ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన తెలిపారు.