శ్రీవారికి సమర్పించడానికి పట్టువ్రస్తాలను తీసుకువస్తున్న సీఎం జగన్
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో గడిపిన సీఎం జగన్ శ్రీవారి సేవలో పాల్గొనడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, ఎస్వీ హాస్టల్ నూతన భవనాలను ప్రారంభించడంతోపాటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు.
మంగళ వాయిద్యాల నడుమ...
మొదటి రోజైన సోమవారం రాత్రి శ్రీవారికి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత తిరుపతి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న సీఎం జగన్ భక్తుల కోసం దాతల సహకారంతో టీటీడీ నిర్మించిన రెండు విశ్రాంతి గృహాలను ప్రారంభించారు. పద్మావతి అతిథి గృహంలో కొద్దిసేపు గడిపారు. అనంతరం శ్రీవారి ఆలయానికి ఎదురుగా కొలువై ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
అక్కడ ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు. అనంతరం సీఎం జగన్ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపైన పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ధ్వజ స్తంభానికి నమస్కరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం జగన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవేంకటేశ్వర స్వామివారి కలంకారీ చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, కార్య నిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సీఎం వెంట ఉన్నారు.
మరోసారి శ్రీవారిని దర్శించుకున్న సీఎం
సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని మరోసారి దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి జగన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందచేశారు.
శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మకు పూజలు
ముఖ్యమంత్రి జగన్ సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు ప్రాచీన సంప్ర దాయాన్ని పాటిస్తూ తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్, రోజా, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ఏటా గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున సంప్రదాయంగా గంగమ్మకు సారె పంపుతారు. సీఎం తిరుమల చేరుకునే ముందు గంగమ్మను దర్శించుకునే సంప్రదాయం చాలా దశాబ్దాల తరువాత గత సంవత్సరం నుంచి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కృషితో పునఃప్రారంభమైంది.
- తిరుమలలోని పద్మావతి అతిథి గృహం ప్రాంతంలో దాతలు రాజేష్‌శర్మ, నరేంద్ర చౌదరి ఇ చ్చిన విరాళాలతో టీటీడీ వేర్వేరుగా నిర్మించిన 2 అతిథి గృహాలు వకుళామాత నిలయం, రచన విశ్రాంతి గృహాలను సీఎం ప్రారంభించారు.
- సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2024 డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇవి సెప్టెంబరు 22 నుంచి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.
రూ.600 కోట్లతో 7 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
అన్నింటికన్నా సంతోషించే విషయం.. టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఉండాలని, వారికి మంచి చేయాలన్న తపనతో వేగంగా అడుగులు వేశాం. రూ.313 కోట్లను ఖర్చు చేసి 3,518 మందికి ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో రూ.280 కోట్లు ఖర్చు చేసి ఇంకో 3,500 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. నెల నుంచి 45 రోజుల్లోగా ఇది కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7 వేల మంది టీడీపీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలిచ్చి వారి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం.
22 ఏ నుంచి తొలగించి పూర్తి హక్కులు
తిరుపతిలో దాదాపు 8,050 మంది ఇళ్లు కట్టుకుని 22 ఏ సమస్యలో ఇరుక్కుని అమ్ముకోవాలనుకున్నా, పిల్లలకు ఇవ్వాలనుకున్నా కుదరక ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల కిందట వరదల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని నా దృష్టికి తెచ్చారు. ఆ సమస్యను పరిష్కరించి తిరుపతి ప్రజలకు మంచి చేస్తూ 22–ఏ నుంచి వాటిని డిలీట్ చేయించాం. చంద్రగిరిలో కూడా 2,500 మందిని 22–ఏ నుంచి డిలీట్ చేసి వారికి కూడా ఉపశమనం కలిగించాం. దేవుడి దయతో వీటన్నింటి వల్లా మంచి కోరుకుంటూ దాదాపు రూ.1,300 కోట్లకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నాం.
టెంకాయ కొట్టి వదిలేసిన టీడీపీ సర్కారు
తిరుపతిలో గత ప్రభుత్వం టెంకాయ కొట్టి వదిలేసిన ప్రాజెక్టుని నాలుగేళ్లుగా చేయి పట్టుకుని నడిపిస్తూ శ్రీనివాస సేతుని పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీనివాస సేతు వంతెనను ప్రారంభించిన సీఎం జగన్ ప్రజలకు అంకితం చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు నిర్మించిన శ్రీవేంకటేశ్వర కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు.
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ‘శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు 2019లో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం టెంకాయ కొట్టి, జీవో ఇచ్చి వదిలేసింది. నాలుగేళ్లలో చిత్తశుద్ధితో పూర్తిచేసి ఇవాళ తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నాం. దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 కి.మీ. పొడవైన ఈ ఫ్లైఓవర్‌తో భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లకు సంబంధించి రూ.37.80 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను కూడా ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులకు మరింత మెరుగైన వసతి అందుబాటులోకి రానుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment