నంద్యాల ఘటన బాధాకరం: సీఎం జగన్‌ | CM YS Jagan Pays Tribute To Abul kalam Azad On His Birth Anniversary | Sakshi

అబుల్‌ కలాం ఆజాద్‌కు సీఎం జగన్‌ నివాళులు

Nov 11 2020 12:54 PM | Updated on Nov 11 2020 1:31 PM

CM YS Jagan Pays Tribute To Abul kalam Azad On His Birth Anniversary - Sakshi

సాక్షి, తాడేపల్లి : దేశానికి తొలి విద్యా శాఖ మంత్రిగా అబుల్ కలాం సేవలందించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా సీఎం జగన్‌ ప్రకటించారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. అబుల్‌ కలాం జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ విద్య వరకు అబుల్‌ కలాం అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. చదవండి: టపాసుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అబుల్‌ కలాం హయాంలో స్థాపించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నిరుపేద విద్యార్థులకు మంచి చదువు అందించేలా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం అందించేలా మార్పులు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు వసతి దీవెన అందిస్తున్నామని, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.3,428 కోట్లు అందించినట్లు వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నమన్న సీఎం జగన్ మైనార్టీలపై ట్విట్టర్‌, జూమ్‌ల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, చంద్రబాబు పాలనలో కేవలం రూ.2500 కోట్లు మాత్రమే మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని దుయ్యబట్టారు. 

నంద్యాల ఘటన బాధాకరమని తెలిపిన సీఎం జగన్‌ తన దృష్టికి రాగానే చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నంద్యాల ఘటనలోనూ పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారని తెలిపారు. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్‌ కూడా మంజూరైందని, బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు. మంచి చేయాలని తాము ఆలోచిస్తుంటే..  ఎలా బురద జల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. 

వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేస్తున్నమని తెలిపారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను కూడా ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. మదర్సాలకు అమ్మ ఒడిని అనుసంధానించామని, వచ్చే ఏడాది నుంచి పెళ్లి కానుక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ భాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి  వెంకటేశ్వరరావు(నాని), సీఎస్‌ నీలం సాహ్ని, మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement