CM YS Jagan Review Meeting Over Telugu Students Stranded In Ukraine - Sakshi
Sakshi News home page

Telugu Students Stranded In Ukraine: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌

Published Fri, Feb 25 2022 12:00 PM | Last Updated on Sat, Feb 26 2022 4:09 AM

CM YS Jagan Revew Meeting To Bring Back Students Stranded In Ukraine - Sakshi

ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రష్యా– ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను, తెలుగు వారిని క్షేమంగా తిరిగి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుక్రవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో ఫోన్లో చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా జయశంకర్‌ సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఉక్రెయిన్‌ పక్కనున్న దేశాలకు వారిని తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ముప్పు లేకుండా వారిని భద్రంగా తీసుకురావాలని సీఎం జగన్‌ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.  

అంతకుముందు ఇదే అంశంపై ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా తీసుకు రావడంపై కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యిందన్నారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ల స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల వివరాల సేకరణతో పాటు, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలి. కాల్‌ సెంటర్లకు ఎలాంటి సమాచారం వచ్చినా, వెంటనే దాన్ని విదేశాంగ శాఖ అధికారులకు చేరవేసి.. ఫాలోఅప్‌ చేయాలి. 
అక్కడి వారిలో రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవాలి. వారి యోగ క్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలి.
ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలి. కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలి. అక్కడున్న తెలుగు వారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా, అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. దాన్ని విదేశాంగ శాఖ అధికారులకు చేర వేయాలి. 
అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపునకు రాష్ట్రం నుంచి తగిన సహకారం అందివ్వాలి.
 ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఢిల్లీలో ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రత్యేక అధికారి గితేష్‌ శర్మ పాల్గొన్నారు.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement