
సాక్షి, వైఎస్సార్ జిల్లా:సచివాలయాల ద్వారా ప్రజల లోగిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్ష ఉండకూడదని చెప్పారు. నా వాడు, నీ వాడు అన్న భేదాలు లేకుండా వ్యవస్థ సమాంతరంగా కొనసాగాలని, ప్రభుత్వ పాలసీల అమలుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన ఇడుపులపాయ నెమ్మళ్ల పార్కు వద్ద పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై మూడు విడతలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేతలు, అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు నేతలు, కార్యకర్తలు, స్థానిక బంధువులు, స్నేహితులను ఒకే చోట చూసిన ఆనందంలో అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. అందరితో మమేకమై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. కలెక్టర్ వి.విజయరామరాజు, పాడా ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు.
చదవండి: ‘ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి’.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
ఈ సందర్భంగా చక్రాయపేట, వేంపల్లె రూరల్, అర్బన్ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయా ప్రాంతాల నేతలు ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి గురించి తెలిపారు. తమ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడంపై వారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు నేతలు వినతి పత్రాలు అందజేశారు. వాటిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా కుల, మత, వర్గ ప్రాంతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, అధికారులందరికీ సీఎం అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, పాడా ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment