AP CM YS Jagan Review Meeting On Higher Education - Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Fri, Apr 29 2022 2:26 PM | Last Updated on Sat, Apr 30 2022 8:11 AM

CM YS Jagan Review Meeting On Higher Education - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగాలు కల్పించే చదువుల దిశగా కోర్సులు ఉండాలని, ఇందుకోసం ఇప్పుడున్న కోర్సులకు అనుబంధ, ప్రత్యేక కోర్సులు తీసుకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత విద్యా శాఖను ఆదేశించారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు వీలుగా ఇంగ్లిష్‌పై పట్టు, ప్రావీణ్యం వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జీఆర్‌ఈ, జీ మ్యాట్‌ పరీక్షల కోసం మంచి శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

శుక్రవారం ఆయన ఉన్నత విద్య కార్యకలాపాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) గణనీయంగా పెరగడం కోసమే విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామని, వసతి ఖర్చులూ పెట్టుకోలేక చదువులు ఆపేసే పరిస్థితులు ఉండకూడదని ఈ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తద్వారా గతంలో కన్నా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) పెరిగిన మాట వాస్తవమేనని, అయితే మనం దీంతో సంతృప్తి చెందకూడదన్నారు. జీఈఆర్‌ 80 శాతానికి పైగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

చదవండి👉: ప్రజా సంక్షేమం ఆగదు: సీఎం వైఎస్‌ జగన్‌

ఎంత మంది పిల్లలున్నా అందరికీ వర్తింపు

  • ఫీజురీయింబర్స్‌ మెంట్, వసతి దీవెనలను ఓ కుటుంబంలో ఒకరికే పరిమితం చేయడం లేదు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ విద్యా దీవెన, వసతి దీవెన ఇస్తున్నాం. 
  • ఇదివరకు చదివించే స్తోమత లేక, చాలా మంది అబ్బాయిలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, అమ్మాయిలను పై చదువులకు పంపలేని పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితులను పూర్తిగా మారుస్తూ ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ ఈ పథకాలు అమలు చేస్తున్నాం.
  • రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిలో చైతన్యం తీసుకురావాలి. కర్నూలు పశ్చిమ ప్రాంతం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ

  • రాష్ట్రంలో నాలుగైదు యూనివర్సిటీలను ఎంపిక చేసుకుని, వాటిని దేశంలో ఉత్తమ యూనివర్సిటీల స్థాయికి తీసుకెళ్లడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. కోర్సులో భాగంగా పట్టభద్రులకు తప్పనిసరిగా మూడు విడతల్లో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ (మొదటి ఏడాది 2 నెలలు, రెండో ఏడాది 2 నెలలు, మూడో ఏడాది 6 నెలలు) ఉండాలి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్య కాలేజీల్లో కూడా ఇంటర్న్‌షిప్‌ కోసం ఏర్పాట్లు చేయాలి.
  • రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో ఉన్న జూనియర్‌ కాలేజీని డిగ్రీ కాలేజీ స్థాయికి తీసుకెళ్లాలి. ఇందుకు సంబంధించి నాడు– నేడు కింద పనులు చేపట్టాలి.

డిగ్రీ కాలేజీల కోసం ప్రత్యేక వ్యవస్థ

  • రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక వ్యవస్థను తీసుకురావాలి. చదువులు ఏదోరకంగా సాగితే చాలు అన్న వాళ్లు డిగ్రీ కోర్సులను ఎంచుకునే భావన ఇవాళ దేశంలో ఉంది. అయితే విదేశాల్లో డిగ్రీ అన్నది చాలా అత్యుత్తమ కోర్సుగా భావిస్తారు. 
  • మన రాష్ట్రంలో కూడా డిగ్రీ కోర్సులను సమర్థవంతంగా తీసుకురావాలి. ఇప్పుడున్న డిగ్రీ కాలేజీలను ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి. మన ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కాలేజీలో జాయిన్‌ అయ్యారంటే.. ఆ విద్యార్థికి మంచి విజ్ఞానం రావాలి. ఆ స్థాయిలో డిగ్రీ కాలేజీలను తీర్చిదిద్దాలి.
  • ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్, ఆర్‌జీయూకేటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.సి.రెడ్డి, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్సిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలి. మంచి పరిజ్ఞానం ఉన్న వారు ఈ ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలి. డిగ్రీ కోర్సులకు విలువను జోడించాలి. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలనుకునేట్టుగా ఉండాలి. ఏపీలో డిగ్రీ చదివితే.. మంచి జీతాలతో ఉద్యోగాలొచ్చే పరిస్థితి తీసుకురావాలి.  – సీఎం వైఎస్‌ జగన్‌

బోధన సిబ్బంది భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ 
టీచింగ్‌ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌  అధికారులను ఆదేశించారు. టీచింగ్‌ స్టాఫ్‌ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని, సమర్థులైన వారిని, ప్రతిభ ఉన్న వారిని టీచింగ్‌ స్టాఫ్‌గా తీసుకోవాలని చెప్పారు. వారికీ పరీక్షలు నిర్వహించి, ఎంపిక చేయాలని, టీచింగ్‌ స్టాఫ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవని అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement