ఓటీఎస్ పథకం గురించి ఇవాళ ఇష్టాను సారం మాట్లాడుతున్న వారు ఒకసారి గతం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడంతా మాఫీ చేస్తామని చెబుతున్న వారు గతంలో ఏం చేశారు? ఒకరిద్దరు కాదు.. ఏకంగా 43 వేల మంది అసలు, వడ్డీ కట్టినప్పటికీ ఎందుకు రిజిస్టర్ చేయలేదు. ఇప్పటికీ వీరికి డీకేటీ పట్టాలే ఉన్నాయి. మిగతా వారికి అసలు కాదు కదా.. వడ్డీ కూడా మాఫీ చేయడానికి మనసొప్ప లేదు. ఇలాంటి వారు ఇప్పుడు పేదలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతున్నారు.
– సీఎం వైఎస్ జగన్
ఓటీఎస్ పథకానికి సంబంధించి 22–ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాం. ఓటీఎస్ వినియోగించుకున్న వారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, యూజర్ ఫీజులు రద్దు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నాం. ఓటీఎస్ వినియోగించుకున్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఫీల్డ్ స్కెచ్, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తున్నాం.
– సీఎం వైఎస్ జగన్‌తో అధికారులు
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా పేదలపై రూ.10 వేల కోట్ల భారాన్ని తొలగిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఓటీఎస్ కింద లబ్ధిదారుల రుణాలను మాఫీ చేయడంతో పాటు క్లియర్ టైటిల్‌తో ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నామని స్పష్టం చేశారు. తద్వారా ఆ ఆస్తిపై వారికి సంపూర్ణ హక్కులు వస్తాయన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్), పేదల ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటీఎస్ పథకం స్వచ్ఛందమని, దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
పేదలకు మేలు చేసే ఈ పథకం అమలు కాకుండా చాలా మంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనలను గత ప్రభుత్వం పరిశీలించలేదని తెలిపారు. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని చెప్పారు. ఇవాళ మాట్లాడుతున్న వారు ఆ రోజు ఎందుకు డబ్బు కట్టించుకున్నారని ఆయన ప్రశ్నించారు. వారికి ఇప్పటికీ డీకేటీ పట్టాలే ఉన్నాయన్నారు. గతంలో అసలు, వడ్డీ కడితే బి–ఫారం పట్టా మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఓటీఎస్ పథకం ద్వారా అన్ని రకాలుగా సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఓటీఎస్, పేదల ఇళ్ల నిర్మాణాలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
తనఖా పెట్టుకోవచ్చు.. అమ్ముకోవచ్చు
► ఓటీఎస్ ద్వారా లబ్ధిదారులు ఇంటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు. అమ్ముకునే హక్కు కూడా వస్తుంది. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టం. ఓటీఎస్ పథకం పూర్తిగా స్వచ్ఛందం.
► ఓటీఎస్ కింద డిసెంబర్ 21 నుంచి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తాం. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయి.
గృహ నిర్మాణాల్లో వేగం పెంచండి
► గృహ నిర్మాణాలపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయి. వర్షాలు కూడా ఆగిపోయాయిన నేపథ్యంలో ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో గేర్ మార్చాల్సిన సమయం వచ్చింది. పనుల్లో వేగం పెరగాలి.
► గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలి. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సొంతంగా ఇళ్లు కట్టుకునే వారికి నిర్మాణంలో మంచి సలహాలు ఇస్తూ పర్యవేక్షించాలి. ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గించేలా అన్ని రకాల విధానాలూ అవలంభించాలి. నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఆయా కాలనీలకు సమీపంలోనే తయారయ్యేలా చూడాలి. లేబర్ క్యాంపు, సిమెంటు గోదాముల వంటివి లే అవుట్లలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి.
► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment