ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దు: సీఎం జగన్‌ | CM YS Jagan Review On Ration Door Delivery And Essentials Supply | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దు: సీఎం జగన్‌

Published Fri, May 7 2021 3:10 PM | Last Updated on Fri, May 7 2021 4:45 PM

CM YS Jagan Review On Ration Door Delivery And Essentials Supply - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్‌ చేయాలని, అన్ని అంశాలపై వ్యవసాయ సలహా కమిటీలకు పూర్తి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్రాప్‌ ప్లానింగ్‌ మొదలు రైతులకు అండగా ఆ కమిటీలు ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో మహిళా రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలన్నారు. ఎక్కడా రైతులకు ఏ విధంగానూ నష్టం కలగకూడదని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని, రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ, రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

మిల్లర్ల ప్రమేయం వద్దు:
ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు. ఏ ఊరి పంట ఏ మిల్లర్‌ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలి. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం, ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయి. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్‌ వద్దకు పంపించవద్దు. అందుకోసం జిల్లా యూనిట్‌గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలి. మనం కొనుగోలు చేస్తామని చెప్పిన టైంకు మనమే కొనుగోలు చేయాలి.  మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి. 

రెండు శాఖలు ఓన్‌ చేసుకోవాలి:
ఆర్బీకేకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను ఓన్‌ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయ శాఖ చూడాలి. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ క్రాపింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకూ రెండూ కలిసి పనిచేయాలి

వ్యవసాయ సలహా కమిటీలు:
వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్‌ చేయాలి. ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలి. క్రాప్‌ ప్లానింగ్‌ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. ఆ కమిటీల బాధ్యతలు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదు. 

రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి:
ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు ఆ కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల), ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు చెప్పాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప రైతుల ఆదాయం మాత్రం తగ్గకూడదు.

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ:
రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్‌ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌)లు పని చేయాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలి.  కావాల్సినన్ని వేయింగ్‌ స్కేల్స్‌ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండి. బియ్యం క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ అవ్వద్దు, ఎవరైనా ఇంటి వద్ద రేషన్‌ మిస్‌ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్దం చేయండి.

చదవండి: ‘సీఎం జగన్‌ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’
ఏలూరు కార్పొరేషన్‌ ఎలక్షన్‌: కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement