పిల్లలు చిన్న వయసులోనే ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. అందువల్ల అంగన్‌వాడీల నుంచే వారికి భాషపై గట్టి పునాది అందించాలి. అంటే అభ్యాస సామర్థ్యం (లర్నింగ్ ఎబిలిటీ) పొంపొందించుకునేలా మాంటిస్సోరీ విధానంతో కూడిన కరికులమ్ (బోధనాంశం) అందుబాటులోకి తేవాలి. అప్పుడే వారి మెదడు పరిణతి చెందుతుంది. చాలా విషయాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇందుకు అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలి. ఈ మార్పుల కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. నాడు–నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. ఈ దిశగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాలను అన్ని సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తనిఖీలు, నాణ్యత, నాడు–నేడు పనుల పురోగతి వంటి అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వీటిలో మార్పు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
సిబ్బంది నియామకాలతోపాటు ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా రావాల్సి ఉందన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్‌వైజర్స్ సక్రమంగా పనిచేస్తే అంగన్‌వాడీల పనితీరు మెరుగు పడటంతోపాటు నాణ్యత కూడా పెరుగుతుందన్నారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్‌వైజర్ల సహాయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సూపర్‌వైజర్ల పనితీరుపైనా తనిఖీలు ఉండాలని చెప్పారు. అంగన్‌వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం అన్నారు.
సార్టెక్స్ బియ్యం సరఫరా చేయాలని, న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దని ఆదేశించారు. పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు అన్నింటిలోనూ నాణ్యత పెరగాలని, ఆ ఫలితాలు కనిపించాలని చెప్పారు. గతంలో కన్నా పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలని, ఇందు కోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలని స్పష్టం చేశారు.
క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఖాళీలు భర్తీ చేయండి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా సీడీపీఓ నియామకాలు చేపడతామని అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే తదతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment