సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంగ్లిషు మీడియం చదువులు.. బాబు హయాంలో ఉన్నాయా? పేద పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తే.. ప్రశ్నిస్తారనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదని దుయ్యబట్టారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన ‘విద్యాదీవెన నగదు జమ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, ఎల్లో మీడియా తీరును ఎండగట్టారు.
అప్పుడు.. ఇప్పుడు తేడా చూడండి...
‘‘గత ప్రభుత్వంలో జగనన్న ‘అమ్మ ఒడి’ అనే పథకం ఎక్కడైనా ఉందా?. ఈ రాష్ట్రంలో ఏనాడైనా, ఎక్కడైనా ఇలా ఉందా?. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడులాంటి కార్యక్రమం గతంలో ఉందా?. చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమం ఏనాడైనా జరిగిందా?. ప్రభుత్వ బడులు మూసేసి, చదువుల భారాన్ని దించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించలేదా?. ఆ రోజుకూ, ఈ రోజు కూ తేడాలు చూడండి. పేదల పిల్లలు చదువులు ఎందుకు మానేస్తున్నారని ఎప్పుడైనా గతంలో ఆలోచించారా యూనిఫారం, షూలు, సాక్సులు, తెలుగు-ఇంగ్లిషుల్లో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, నోట్‌బుక్స్, స్కూల్‌బ్యాగ్.. ఇలాంటివన్నీ జగనన్న విద్యాకానుక మాదిరిగా ఎప్పుడైనా గతంలో ఇచ్చారా?. సరిగ్గా స్కూలు తెరిచే సమయానికి ఇచ్చారా? స్కూలు తెరిచిన ఆరేడు నెలలు తర్వాత టెక్ట్స్‌బుక్స్ ఇచ్చేవారంటూ’’ సీఎం మండిపడ్డారు.
అందుకే దొంగల ముఠాకు కడుపుమంట..
‘‘ఇంత మంచి జరిగింది కాబట్టే.... దొంగల ముఠాకు కడుపుమంట, బీపీ పెరుగుతూ ఉంది. పథకాలు మరిచిపోవాలని పేపర్, టీవీలు చూస్తే చాలు... అబద్ధాల మీద అబద్ధాలు చూపిస్తున్నారు. విద్యాదీవెన పథకం కింద ఇక్కడ ప్రారంభిస్తామని తెలిసి... ప్రశ్నపత్రాలను వారి హయాంలో మంత్రిగా పని చేసిన వారి స్కూళ్లనుంచే ప్రశ్నపత్రాలు ఫొటోలు తీసి... వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వారే నాశనం చేస్తారు, వారే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. మనం వచ్చాక 1.3లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ రోజు కూడా పేపర్ లీక్ అంటూ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా నానా యాగీ చేశారని’ సీఎం నిప్పులు చెరిగారు.
వీళ్లే చేస్తారు, మళ్లీ వీళ్లే ప్రచారం చేస్తారు..
‘‘మహిళలు తమ కష్టాలు చెప్పుకునే వ్యవస్థ ఉంది కాబట్టి, కేసుల నమోదు కూడా పెరిగింది. విజయవాడలో అత్యాచారం జరిగిందని నానా యాగీ చేశారు. గుంటూరులో ఏదేదో జరిగిపోయిందని యాగీ చేశారు. విశాఖలో ఏదేదో జరిగిపోతుందని మరో యాగీ కూడా చూశారు. బాలికలు మీద, మహిళల మీద అత్యాచారం రాసిన దుర్మార్గులు ఎవరు?అన్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్పదు, టీవీ–5 చూపదు. ఈ ఘటనల్లో నిందితులు టీడీపీ వారే. వీళ్లే చేస్తారు, మళ్లీ వీళ్లే ప్రచారం చేస్తారు. ఏడుకొండల వాడిని కోరగలిగేది ఒక్కటే..దేవుడా మా రాష్ట్రాన్నిరక్షించు ఈ ఎల్లోమీడియా నుంచి, ఈ ఎల్లో పార్టీ నుంచి. రెండు నాలుకలు సాచి, బుసలు కొట్టే కృపా సర్పాలనుంచి, ధూర్తుల నుంచి, దుష్టచతుష్టయం నుంచి, రక్షించు దేవా అని వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నానని’’ సీఎం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment