దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడు: సీఎం జగన్‌  | CM YS Jagan Slams TDP Chandrababu At Tenali Sabha | Sakshi
Sakshi News home page

కడుపు మంటకు, అసూయకు మందు లేదు: సీఎం జగన్‌

Published Tue, Feb 28 2023 12:47 PM | Last Updated on Tue, Feb 28 2023 5:29 PM

CM YS Jagan Slams TDP Chandrababu At Tenali Sabha - Sakshi

సాక్షి, గుంటూరు జిల్లా: నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం జరిగింది. రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ.13,500 చొప్పున వరుసగా 3 ఏళ్లు రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం అందించడంతో పాటు నాలుగో ఏడాది ఇప్పిటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున సాయం అందించారు. నేడు మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1096.76 కోట్ల రైతు భరోసా సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తెనాలిలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు. 

ఈ సందర్బంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..: 
చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ఆప్యాయతల మధ్య, మీ ప్రేమ అభిమానాలకు ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరునా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

రైతన్నలకు రెండు మంచి కార్యక్రమాలు..
ఇవాళ దేవుడి దయతో రైతన్నలకు సంబందించి రెండు మంచి కార్యక్రమాలు మన గుంటూరు జిల్లా తెనాలి నుంచి చేస్తున్నాం. అరకోటికిపైగా రైతు కుటుంబాలకు ఈ కార్యక్రమం వల్ల ఈ రోజు మంచి జరుగుతుంది. ఇందులో మొదటిది వరుసగా నాలుగో ఏడాదికి సంబంధించి వైయస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌కు సంబంధించిన నిధులు ఇవాళ బటన్‌ నొక్కి విడుదల చేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో నాలుగోఏడాదికి సంబంధించి చివరి విడతగా ఇవాళ రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నాం.

రెండోది పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ– పరిహారం చెల్లించే కార్యక్రమం చేస్తున్నాం. వైయస్సార్‌ రైతు భరోసా పథకం అమలు చూస్తే... రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతిఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50వేలు ఇస్తామని ఎన్నికల వేళ మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టాం. కానీ మీ బిడ్డ చెప్పినదానికన్నా మిన్నగా ప్రతి ఏటా రూ.13,500 నాలుగు సంవత్సరాలు కాస్తా ఐదు సంవత్సరాలకు పెంచి ప్రతి రైతన్నకు రూ.50వేలు కాకుండా.. రూ.67,500 ప్రతి రైతన్న చేతిలో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

నాలుగో ఏడాదికి సంబంధించిన రైతు భరోసా కార్యక్రమంలో ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి రూ.11వేలు ప్రతి రైతన్నకు ఇచ్చాం. ఇందులో మొట్టమొదటిది మే నెలలో రూ.7,500, రెండోది అక్టోబరు నెలలో మరో రూ.4వేలు ఇచ్చాం. ఇక ఈసంవత్సరానికి సంబంధించి మూడో విడతగా ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో ఇవాళ బటన్‌ నొక్కి రూ.1090 కోట్లు జమ చేస్తున్నాం. 

నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54 వేల సాయం
ఈ రోజు మనం ఇచ్చే సహాయంతో కూడా కలుపుకుంటే ఇప్పటివరకూ కేవలం వైయస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ కార్యక్రమం ద్వారానే రాష్ట్రంలో రైతన్నల కుటుంబాలకు నాలుగేళ్లలో ఒక్కొక్క కుటుంబానికి రూ.54వేలు సాయం అందించాం. వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందుకున్న ప్రతి రైతు కుటుంబానికి వచ్చే ఏడాది కూడా మనమివ్వనున్న రైతు భరోసా రూ.13,500 కలుపుకుంటే.. మొత్తంగా ఈ ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి కేవలం ఈ ఒక్క రైతుభరోసా పథకం ద్వారానే రూ.67,500 వాళ్ల చేతిలో పెట్టినట్టువుతుంది.

నాలుగేళ్లలో రైతన్నలకు రూ.27వేల కోట్ల సాయం
నేడు ఈ కార్యక్రమంలో అందిస్తున్న రూ.1090 కోట్లను కలుపుకుంటే.. రైతు భరోసా పథకంలో నాలుగేళ్లు కూడా గడవకమునుపే రైతన్నల కుటుంబాలకు అందించిన సాయం... రూ.27,062 కోట్లు. రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇది. రైతన్నల మీద మమకారం అంటే ఇది. వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇలా ఉంటుంది. 

71,237 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ
ఇవాళ చేస్తున్న రెండో కార్యక్రమం పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగానే పంట నష్టం పరిహారం అందిస్తున్నాం. అదే దిశగా అడుగులు వేస్తూ మరోసారి ఆ మాట నిలబెట్టుకుంటూ... మొన్ననే డిసెంబరులో మాండోస్‌ తుపాను వల్ల నష్టపోయిన 91,237 మంది రైతులకు నేడు రూ.77 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రబీ 2022 ముగియకమునుపే నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. నేడు జమ చేయనున్న ఈ రూ.77 కోట్లతో కలుపుకుంటే 22.22లక్షల మంది రైతులకు నాలుగేళ్లు ముగియకమునుపే కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపేణా రూ.1911 కోట్లు ఇచ్చాం. 

మీతో మరికొన్ని విషయాలు పంచుకోవాలి
మనందరికి ఆహార భద్రతతో పాటు 62 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయమంటే మనందరికీ గౌరవం, కృతజ్ఞత. వర్షాలు బాగా కురిసినప్పుడు మాత్రమే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు. రైతు, రైతు కూలీ వీరిద్దరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇదంతా జరగాలంటే దేవుడి దయ చాలా అవసరం. నాలుగు సంవత్సరాలు గమనించండి. 

ఇప్పుడు రెయిన్‌ గన్లు లేవు– రెయిన్‌ మాత్రమే ఉంది
మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దేవుడి దయ వలన వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. గతంలో మాదిరిగా రెయిన్‌ గన్లు లేవు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ మాత్రమే ఉంది. 2019లో మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాలుగు సంవత్సరాలలో కూడా దేవుడి దయ వలన ఎక్కడా కరువు ఊసే లేదు. 

గత ముఖ్యమంత్రి.. అన్యాయస్తుడు..
ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకొండి. 2014 నుంచి 2019 మధ్య గత ప్రభుత్వ హయాలంలో ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆ కాలంలో ప్రతిఏటా కరువే. కనీసం ప్రతిఏటా 300 కరువు మండలాలు ప్రకటించే పరిస్థితి. అలాంటి దుస్థిది దేవుడి దయ వలన నాలుగేళ్లలో ఎక్కడా లేదు. ఈ రోజు మీ బిడ్డ మీ అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా దేవుడి దయతో పరిపాలన కొనసాగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి.

కరవుకు కేరాఫ్‌ అడ్రస్‌... 
1995 నుంచి 2004 వరకు అప్పట్లో ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. మరలా 2014 నుంచి 2019 వరకు అప్పడూ ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. ఈ అన్యాయస్తుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా, ఎప్పుడు ఈ పెద్దమనిషి అధికారంలో ఉన్నా, ఈయన వచ్చినప్పుడల్లా కరువు కూడా కచ్చితంగా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇది నేను చెప్పడం లేదు. గతాన్ని ఎవరు చూసినా కనిపించే నగ్న సత్యమిది. 

వైఎస్సార్‌ పాలన-సమృద్ది వర్షాలు...
గతంలో వైయస్సార్‌ గారి 5 సంవత్సరాల 3 నెలల పరిపాలనాకాలంలో కానీ, మనం అధికారంలోకి వచ్చిన 2019 జూన్‌ తర్వాత కానీ, ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. 

దేవుడి దయతో ఎక్కడా కరువు లేదు. ఇదంతా మంచి మనసుతో చేసిన పరిపాలనను దేవుడు కూడా ఆశీర్వదించినట్టుగా  ఈ రోజు వర్షాలు కూడా సమృద్ధిగా పడుతున్నాయి. ఈ నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి రిజర్వాయరు నిండింది. ఈ నాలుగేళ్లగా మూడు ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క చెరువు నిండింది. నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా భూగర్భ జలాలు పెరిగాయి.

చివరకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి కుప్పం నియోజకవర్గం తీసుకున్నా.. ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందన్న అనంతపురం జిల్లాను తీసుకున్నా.. ఎక్కడ చూసినా భూగర్భ జలాలన్నీ గణనీయంగా పెరిగాయి.

మంచి మనసు, మంచి పరిపాలన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఆశీస్సులు కూడా కచ్చితంగా ఉంటాయి. ఇక పంట దిగుబడి చూస్తే.. నాలుగేళ్ల కాలంలో ప్రతియేటా 12లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిన పరిస్థితిలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో..బాబు గారి పాలనలో ఆహార ధాన్యాల దిగుబడి సగటున 154 లక్షల టన్నుల అయితే.. ఇవాళ మీ బిడ్డ పాలనలో ఆహార ధాన్యాల దిగుబడి 166 లక్షల టన్నులకు పెరిగింది. అంటే 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి పెరుగుదల ఈ రోజు కనిపిస్తుంది.

నాలుగేళ్లలో ధాన్యం సేకరణ– రికార్డు.. 
మరోవైపు  ఈ నాలుగు సంవత్సరాల కాలంలో రికార్డు స్ధాయిలో ధాన్యం సేకరణ పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు కలిపి వాళ్లు సేకరించిన ధాన్యం 2.65 కోట్ల టన్నుల అయితే మనందరి ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో సేకరించిన ధాన్యం 2.94 కోట్ల టన్నులు.

ధాన్యం సేకరణమీద గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన వ్యయం రూ.40,237 కోట్లు అయితే మన ప్రభుత్వం హయాంలో ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో ధాన్యం సేకరణకు మీ బిడ్డ చేసిన ఖర్చు రూ.55,444 వేల కోట్లు. 

ఉద్యాన పంటల సాగులోనూ..
మీ బిడ్డ పరిపాలనలో ఉద్యాన పంటల పరిస్థితి చూస్తే ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే మొత్తం 1,43,901 హెక్టార్లలో అదనంగా ఉద్యానపంటల విస్తీర్ణం పెరిగింది. ఉద్యాన పంటల నుంచి దిగుబడి తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నులు మాత్రమే ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో రైతన్నల కష్టం వల్ల అది ఇప్పుడు ఏటా 332 లక్షల టన్నులకు పెరిగింది. అంటే ఏకంగా 104 లక్షల టన్నుల దిగుబడి ప్రతి సంవత్సరం ఎక్కువగా నమోదు అవుతుంది. 

మన ప్రార్ధనలు దేవుడు చూశాడు...
రైతు బాగుండాలని మనమంతా చేసే పూజలు, ప్రార్ధనలు, మనందరి ప్రభుత్వం రైతులకు అండగా ఉండటాన్ని దేవుడు చూశాడు. దేవుడు విన్నాడు, దేవుడు దీవించాడు. 
ఇవన్నీ మన కళ్లెదుటే జరుగుతున్న వాçస్తవాలు. అభివృద్దికి సూచికలు. అభివృద్ధి అంటే ఎక్కడో కాదు... ప్రతి ఇంటా కనిపిస్తున్న సూచికలు. ఇదే సమయంలో రైతుకు తోడుగా మానవ ప్రయత్నంగా మనందరి ప్రభుత్వం 2019 నుంచి ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో మనమేం చేశామో జ్ఞాపకం తెచ్చుకుందాం.

కేవలం రైతు భరోసా..
ఈ ఒక్క పథకం ద్వారా రైతన్నల కుటుంబాలకు రూ.27వేల కోట్లు అందజేశాం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. పట్టా ఉన్న రైతులకు మాత్రమే కాకుండా.. అసైన్డ్‌ భూములున్న రైతులకు, పేద సామాజిక వర్గాల కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు, దేవాదయభూములు సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా సాయాన్ని... ఈ స్ధాయిలో దేశం మొత్తమ్మీద సాయమందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. 

విత్తనం నుంచి విక్రయం వరకూ ఆర్బీకేలు..
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామస్ధాయిలోనే రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేసి అడుగులు వేగంగా ముందుకు వేస్తోంది. ఈ ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి అడుగులోనూ రైతులను చేయిపట్టుకుని నడిపిస్తూ అడుగులు ముందుకు వేస్తుంది.
యంత్రపరికరాలను కూడా గ్రామస్దాయిలోనే రైతున్నలకు అందుబాటులో ఉంచేవరకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నాం.

ఇ–క్రాప్‌తో ఇన్సూరెన్స్‌...
ఆర్బీకే స్ధాయిలోనే ఇ– క్రాప్‌ వ్యవస్ధను తీసుకొచ్చాం.  దేశంలోనే తొలిసారిగా ప్రారంభించి అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరగకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ దేశం మొత్తమ్మీద మన రాష్ట్రం ఒక్కటే. ఇప్పుడు ఈ విధానాన్ని దేశమంతటా కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొదలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లు కూడా వచ్చి మన ఆర్భీకేలను చూసి వెళ్తున్నారు. పంటల బీమాగా రూ.1 కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం తానే భరిస్తున్న రాష్ట్రం కూడా మన రాష్ట్రమే.

44.48 లక్షల మంది రైతులకు రూ.6,685 కోట్ల బీమా
వైయస్సార్‌ పంటల బీమాపథకం ద్వారా రాష్ట్రంలోని 44.48 లక్షల మంది రైతన్నలకు ఇప్పటివరకూ చెల్లించిన బీమా సొమ్ము రూ.6,685 కోట్లు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొండి. గత ప్రభుత్వ హయాంలో ఇదే పంటల బీమా పథకాన్నే తీసుకొంటే... కేవలం 30.85 లక్షల మంది రైతన్నలకు అది కూడా 5 సంవత్సరాలు కలిపితే... గత ప్రభుత్వంలో ఇచ్చినది కేవలం రూ.3411 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడ చూసినా కరువు విళయతాండవం చేస్తున్న రోజుల్లో ఐదేళ్లలో గత ప్రభుత్వం ఇచ్చిన రూ.3411 కోట్లు ఎక్కడ? కేవలం 3 సంవత్సరాల 8 నెలల కాలంలో రూ.6,685 కోట్లు ఎక్కడ ? దాదాపుగా రెట్టింపు సొమ్ము.

ఇవాళ నోటిఫై చేసిన ప్రతి పంటకూడాఈ రోజు ప్రతి రైతన్నకు ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్‌ అయ్యే పరిస్థితి. ఇవాల రైతులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండానే ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ వస్తుంది. తేడా గమనించండి. గతంలో తుపానులు వచ్చినా, వరదలు వచ్చినా రైతన్నల పరిస్ధితి దయనీయం. ఎప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుందో తెలియని పరిస్థితి.

అలాంటిది ఈరోజు రైతన్నలకు ఏ కష్టం వచ్చినా, తుపానులు వచ్చినా, వరదలు వచ్చినా ఆ సీజన్‌ ముగియకమునుపే ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా రైతన్నల ఖాతాల్లోకి వస్తుంది. ఎక్కడా వివక్ష లేదు. లంచాలు లేవు. గ్రామ స్దాయిలో ఆర్బీకేలలో సోషల్‌ ఆడిట్‌ కోసం రైతుల జాబితాను ప్రదర్శిస్తున్నాం. ఏ ఒక్కరూ మిగిలిపోకుండా, అన్యాయం జరగకుండా, నష్టం జరగకుండా రైతన్నకు మంచి చేసే అడుగులు పడుతున్నాయి. ఈ ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో రూ.1912 కోట్లు ఇవ్వగలిగాం.

ఆక్వా రైతులకు రూ.2647 విద్యుత్‌ సబ్సిడీ...
ఆక్వా రైతులకు రూ.1.50కే కరెంటు సబ్సిడీ ఇచ్చే విధంగా అడుగులు వేసి ఇప్పటివరకూ ఆక్వారైతులకు రూ. 2647 కోట్లు సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. ఉచిత విద్యుత్‌ మన మనసులోకి వస్తుంది అంటే మనకు గుర్తుకొచ్చే పేరు వైయస్సార్‌ గారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన ఖర్చు రూ.27,800 కోట్లు.

నాణ్యమైన విద్యుత్‌ పగటిపూటే తొమ్మిది గంటలపాటు ఇవ్వడానికి  ఫీడర్ల సామర్ధ్యం సరిపోదంటే.. దానికోసం మరో రూ.1700 కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్ల సామర్ధ్యం పెంచేందుకు అడుగులు వేశాం. అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు రూ.8845 కోట్లు ఆయన వదిలేసి పోతే.. మీ బిడ్డ ప్రభుత్వం రైతుల కోసం చిరునవ్వుతో ఆ బకాయిలు తీర్చింది. 

సున్నావడ్డీ పథకం అమలు చేస్తూ.. 
పంట రుణాల మీద ప్రభుత్వమే కడుతున్న వడ్డీకి రూ.73.88 లక్షల మంది రైతులు సున్నా వడ్డీ పథకం కింద గత బకాయిలతో కలుపుకుని చెల్లించిన సొమ్ము రూ.1834 కోట్లు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.384 కోట్ల విత్తన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. రైతులకు ఇవ్వాల్సిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు కూడా గత ప్రభుత్వం ఎగరగొట్టి పోతే వాటిని కూడా మన ప్రభుత్వమే తీర్చింది. ఇలా కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో రైతన్నలకు భరోసా ఇస్తూ, వారికి అండగా నిలుస్తూ.. వారి మీద చేసిన ఖర్చు రూ.1.45 లక్షల కోట్లు. 

చంద్రబాబుకూ – మనకూ తేడా ఇదే...
ఇంత నిబద్దతతో చేశాం కాబట్టే.. ఏమీ చేయని చంద్రబాబుకు, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు, రైతుకు ఇచ్చిన ప్రతి మాటా తప్పిన చంద్రబాబుకు ఆయన భజన బృందానికి, దుష్ట చతుష్టయానికి, మన ప్రభుత్వం మీద కడుపు మండిపోతుంది. కడుపు మంటకు మందు లేదు. అసూయకు అసలే మందు లేదు. మనది పేదల ప్రభుత్వం. మనది రైతన్నల ప్రభుత్వం. చంద్రబాబునాయుడిది పెత్తందార్ల పార్టీ. రైతన్నలకు నేను ఇవాళ ఒకటే మాట చెబుతున్నాను. ఆలోచించమని కోరుతున్నాను. 

యుద్ధం జరుగుతుంది..
రాష్ట్రంలో ఇవాళ యుద్ధం జరుగుతుంది. రైతులను వంచించిన చంద్రబాబు ఒకవైపున ఉంటే... రైతన్నకు అండగా ఉంటున్న మనందరి ప్రభుత్వం మరోవైపున ఉండి ఈ రోజు యుద్ధం జరుగుతుంది. 

కరువు– చంద్రబాబు ఫ్రెండ్స్‌....
వచ్చే ఎన్నికల్లో యుద్ధం కరువుతో ఫ్రెండ్‌షిప్‌ ఉన్న చంద్రబాబు, వరుణ దేవుడి ఆశీస్సుల ఉన్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది. వచ్చే ఎన్నిక్లలో యుద్ధం గవర్నమెంట్‌ బడులలో పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియం వద్దన్న బాబుకు, అదే గవర్నమెంట్‌ బడులలో నాడు–నేడుతో రూపురేఖలు మారుస్తూ, సీబీఎస్‌ఈ ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతుంది.

వచ్చే ఎన్నికల్లో యుద్ధం..
మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డుమీదకు తీసుకొచ్చిన చంద్రబాబుకు, వైయస్సార్‌ఆసరా, సున్నావడ్డీ, వైయస్సార్‌ చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మఒడి, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది.

వచ్చే ఎన్నికల్లో యుద్ధం గ్రామాలలో జన్మభూమి కమిటీల గజదొంగల ముఠా నుంచి మొదలుపెడితే పై స్ధాయిలో రామోజీ రావు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈ ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడుతో కలిసిన  ఈ గజదొంగల ముఠా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) స్కీంలు సృష్టించిన చంద్రబాబుకు, గ్రామ రూపురేఖలు మారుస్తూ మన కళ్లెదుటనే కనిపిస్తున్న గ్రామ సచివాలయాలు..

గ్రామ వాలంటీర్లు, గ్రామాల్లో కనిపిస్తున్న ఆర్బీకేలు, గ్రామాలలో ఉన్న గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిషు మీడియం చదువులు, విలేజ్‌ క్లినిక్కులు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టులు, రాబోతున్న డిజిటల్‌ గ్రంధాలయాలు.. ఇటువంటి వాటి ద్వారా గ్రామ స్వరూపాన్ని మారుస్తూ ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏఒక్క అర్హుడు కూడా మిస్‌ కాకూడదన్న ఉద్దేశ్యంతో సోషల్‌ ఆడిట్‌ కోసం అర్హుల జాబితాను కూడా ప్రదర్శించి వాలంటీర్ల వ్యవస్ధ, సచివాలయ వ్యవస్ధ ద్వారా పేదలకు రూ.1.93 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అంటే బటన్‌ నొక్కిన వెంటనే అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా అందించిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతుంది.
అందరూ ఆలోచన చేయాలి. ఆ రోజు కూడా ఇదే బడ్జెట్‌. ఇదే రాష్ట్రం. 

అదే రాష్ట్రం– బడ్జెట్‌ అయినా తేడా ఏంటంటే...
ఆ రోజు కన్నా..   ఈ రోజు ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం అయినా అప్పులలో పెరుగుదల గ్రోత్‌ రేటు మాత్రం అప్పటికన్నా తక్కువే. అయినా మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్‌ నొక్కగలుగుతున్నాడు. అప్పట్లో చంద్రబాబు ఎందుకు బటన్‌ నొక్కే స్కీంలు లేవు అన్నది ఆలోచన చేయండి. అప్పట్లో ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోయాయన్నది ఆలోచన చేయండి. ఆ డబ్బులన్నీ కూడా గ్రామస్ధాయిలో మొదలుపెడితే జన్మభూమి కమిటీలు. ఆ తర్వాత గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు వీళ్లందరికీ బాసు చంద్రబాబు. వీళ్లు దోచుకో, పంచుకో, తినుకో అని పంచుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో యుద్ధం.. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా ? బీసీల తోకలు కత్తిరిస్తాం, ఇంగ్లిషు మీడియంకు వ్యతిరేకం, పేదలు ఇళ్లు, ఇళ్ల స్ధలాలు ఇవ్వడానికి వ్యతిరేకం అన్న పెత్తందారీ పార్టీ చంద్రబాబుకు, బలహీన వర్గాలను దళిత, గిరిజన,మైనార్టీ వర్గాలకు మండల అధ్యక్షులు నుంచి కేబినెట్‌ వరకూ రాజకీయ సాధికారిత ఇచ్చి ప్రతి మాటకూ ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా పేదవర్గాలు అని చెప్పి వారి మీద చరిత్రలో ఎప్పుడూ, ఎవ్వరూ చేయని విధంగా వారి మీద ప్రేమ చూపిస్తూ నామినేటెడ్‌ పదవులు దగ్గర నుంచి మొదలుపెడితే పాలించే పదవులు వరకూ ఈరోజు ప్రతి అడుగులోనూ భాగస్వామ్యులను చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికీ మధ్య యుద్ధం జరుగుతున్నది.

క్యాస్ట్‌ వార్‌ కాదు– క్లాస్‌ వార్‌...
ఈ రోజు యుద్ధం జరుగుతున్నది కులాల మధ్య కాదు.. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపు ఉన్నాడు.  మరోవైపు పెత్తందార్లు ఉన్నారు. పొరపాటు జరిగిందంటే.. రాజకీయాల్లో ఇక ఎవ్వరూ కూడా మాట ఇవ్వడం, మాట మీద నిలబడ్డం  అన్న మాటకు అర్ధమే లేకుండా పోతుంది.

పొరపాటు జరిగిందంటే.. పేదవాడు అనేవాడు ఎక్కడా కూడా మటుమాయం అయ్యే పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయండి.  రాజకీయ వ్యవస్ధలోకి మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం తెలియాలి. ఒక మాట చెబితే ఆ మాట నిలబెట్టుకోలేతపోతే ఆ వ్యక్తి రాజకీయాలలో ఉండడానికి అర్హుడు కాదు అన్న పరిస్థితులు మళ్లీ రావాలి. 

గర్వంగా చెపుతున్నా..
ఇవాల నేను గర్వంగా చెబుతున్నాను. ఎన్నికల ప్రణాళికలో చూపించిన మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలను నెరవేర్చి ఈ రోజు మీ బిడ్డ మీ దగ్గర ఓటు అడగడానికి వస్తున్నాడు. మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గడప, గడపా ధైర్యంగా తిరుగుతున్నారు. ప్రతి గడపకూ వచ్చి అక్కా మీ ఇంట్లో ఇవన్నీ జరిగాయా ? అని అడుగుతున్నారు. ఆడిగిన తర్వాత చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ఆశీస్సులు తీసుకుని ఎమ్మెల్యేలు అందరూ బయలుదేరుతున్నారు.

మీ బిడ్డకు మీ ఆశీస్సులు, దేవుడి దయ కావాలి
ఈ రోజు మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడు దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే. మీ బిడ్డకు ఈనాడు ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు. టీవీ5 ఉండకపోవచ్చు. దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏరోజూ వాళ్లమీద ఆధారపడలేదు. మీ బిడ్డ ఆధారపడింది ఒక్కటే ఒక్కటి. మంచి చేశాం. ఒకవేళ ఆ మంచి మీకు జరిగి ఉందిఅని అనిపిస్తే.. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే కోరుతున్నాను. మీ బిడ్డ దేవుడు దయ మీద, మీ చల్లని ఆశీస్సులు మీద మాత్రమే ఆధారపడతాడు కాబట్టి మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175 కు 175 నియోజకవర్గాల టార్గెట్‌ అని అడుగులు ముందుకు వేస్తున్నాడు.

చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్‌ విసురుతున్నా...
చంద్రబాబుకు కానీ, దత్తపుత్రుడికి నేను సవాల్‌ విసురుతున్నా ?  ధైర్యం ఉందా ? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకు ఉందా ? అని సవాల్‌ విసురుతున్నా.

ఆ ధైర్యం వాళ్లకు లేదు. కారణం ఏ రోజూ వాళ్ల జీవితాల్లో వాళ్లు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్లకు ఆ ధైర్యం లేదు. మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది. కారణం మంచి చేశాం కాబట్టి ఆ మంచి చెప్పుకుని మీ బిడ్డ మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం, ధైర్యం ఉంది.

మీకు మంచి జరిగితే తోడుగా నిలబడండి..
ఇది మీ బిడ్డకు, వాళ్లకూ ఉన్న తేడా. ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. రాజకీయాల్లో అన్యాయాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. అన్నీ గమనించండి. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొండి.

వాళ్ల మాటలు నమ్మకండి. కేవలం మీ ఇంటిలో మంచి జరిగిందా?లేదా ?అన్న ఒకే ఒక్కదాన్ని ప్రామాణికంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి. మీ చెరగని చిరునవ్వులకు, మీ ఆప్యాయతలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు మీ బిడ్డకూ, మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటున్నాను.

చివరిగా..
తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే శివ కుమార్‌ ఎస్సీ కాలనీలో ఇంతకముందు స్మశానవాటిక కోసం రూ.9 కోట్లు ఖర్చువుతుందని అడిగారు. వెంటనే ఆ నిధులు మంజూరు చేస్తున్నాను. షాదీ ఖానా కోసం ముస్లిం సోదరులు అడుగుతున్నారు. దాని కోసం రూ.4 కోట్లు ఖర్చవుతుందన్నారు. అది కూడా కేటాయిస్తున్నాం.

అగ్రికల్చర్‌ మినీ మార్కెట్‌ యార్డు కోసం, కొల్లిపరలో భూములు కొనుగోలు కోసం మరో రూ.5 కోట్లు అడిగారు. దాన్ని కూడా మంజూరు చేస్తున్నాం. దుగ్గిరాల, కొల్లిపర రోడ్డు విస్తరణకు మరో రూ.10 కోట్లు అడిగారు. అదీ ఇస్తున్నాం. తెనాలిలో మున్సిపల్‌ భవనం కోసం రూ.15 కోట్లు అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement