ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు. నవంబర్ 2న స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అక్టోబర్ 5న విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇదే రోజున పంటలకు గిట్టుబాటు ధరలను ఆర్‌బీకేలలో ప్రదర్శించాలని చెప్పారు. జేసీలు తరచూ సచివాలయాలను సందర్శించాలని, ప్రజలకు అందించే సేవల్లో వేగం పెరగాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని పునరుద్ఘాటించారు. కోవిడ్ సోకిన వారికి ఖర్చు లేకుండా చికిత్స చేయించడం బా«ధ్యతగా తీసుకోవాలని సూచించారు. అన్యాయమైన ప్రతిపక్షం, అదే మైండ్ సెట్ గల ఎల్లో మీడియా వల్ల ప్రతి మంచి పనీ ఆలస్యమవుతోందని, అవాస్తవాలు ప్రచారం చేస్తే నిలదీయాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే ప్రక్రియలో జాయింట్ కలెక్టర్లు కాస్త నెమ్మదిగా ఉన్నారు. వారానికి కనీసం నాలుగుసార్లు సచివాలయాలు సందర్శించి నివేదికలు పంపాలి. కలెక్టర్లు కూడా ఇంకాస్త చొరవ చూపాలి. జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే అవి గ్రామ స్థాయిలో పౌర సేవలకు ఎంతో కీలకం కాబట్టి. గ్రామ, వార్డు సచివాలయాల ప్రాతిపదికనే కలెక్టర్లు, జేసీల పని తీరును అంచనా వేస్తాం.
సాక్షి, అమరావతి: అక్టోబర్ 5వ తేదీన పిల్లలకు విద్యా కానుక కిట్‌లు అందజేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. నవంబర్ 2వ తేదీన స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని, అందువల్ల ఇప్పుడే పిల్లలకు కిట్ ఇస్తే స్కూళ్లు తెరిచేలోగా యూనిఫామ్ కుట్టించుకోగలుగుతారన్నారు. గతంలో అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నవంబరు 2వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్ణీత వ్యవధిలో సేవలు అందాలి
► ముఖ్యంగా బియ్యం కార్డులు, పెన్షన్ కానుక, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ.. ఈ నాలుగు నిర్దేశించుకున్న వ్యవధిలో అందేలా చూడాలి.
► బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు వేగంగా ప్రింట్ చేసి, పక్కాగా బయోమెట్రిక్ నమోదుతో పంపిణీ చేయాలి. సకాలంలో సేవలందించడంలో విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయి. ఇంధన శాఖ (విద్యుత్), మున్సిపల్, రవాణా విభాగాలలో సకాలంలో సేవలు అందడం లేదు.
► ఎవరైనా దేని కోసమైనా దరఖాస్తు చేసుకుంటే 6 పాయింట్ వాలిడేషన్ డేటా ఎంట్రీలో తప్పుడు వివరాలు నమోదు చేయకూడదు. పక్కాగా ఎస్‌ఓపీ ఫాలో కావాలి.
► ఎవరైనా సేవలకు సంబంధించి ఫిర్యాదు చేయగానే అన్ని స్థాయిల్లో వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారునిగా అర్హత ఉంటే 17 రోజుల్లో పేరు జాబితాలో చేర్చాలి. ఇలాంటి కేసులను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ర్యాండమ్‌గా 10 శాతం కేసులను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. జేసీలు కనీసం 1 «శాతం కేసులను ర్యాండమ్‌లో తనిఖీ చేయాలి. సచివాలయాల్లో ఉద్యోగుల నియామకం కోసం పరీక్షలు చాలా చక్కగా నిర్వహించినందుకు అభినందనలు.
పనుల్లో వేగం పెరగాలి
► అక్టోబర్ 2న దాదాపు 2 లక్షల మందికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేస్తున్నాం. అక్టోబర్ ఆఖరులో జగనన్న తోడు పథకం ప్రారంభిస్తాం. ఈ పథకం కింద వీధుల్లో చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. అర్హులందరికీ వచ్చే నెల 10లోగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చూడాలి.
► నాడు–నేడు (స్కూళ్లు) మొదటి దశలో ఇంకా పనులు మొదలు కాని స్కూళ్లలో వెంటనే పనులు మొదలు పెట్టాలి. 701 టాయిలెట్లకు వెంటనే శ్లాబ్ పనులు పూర్తి చేయాలి. జేసీలు రోజూ పర్యవేక్షించాలి.
► అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు స్థలాల గుర్తింపులో తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకా«శం, అనంతపురం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే చొరవ చూపాలి.
► గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పనులు వేగంగా జరిగేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణానికి సంబంధించి త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి.
► రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో అమలాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల, ఆదోని, ఏలూరు, పులివెందులలో భూసేకరణ జరగాల్సి ఉంది. కాకినాడ, ఒంగోలు, అనంతపురంలోని పాత కాలేజీలకు ఇంకా అదనపు భూమి కావాలి. వెంటనే ఆ మేరకు భూమి సేకరించాలి.
► ఇంకా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాల వద్ద భూములు గుర్తించాలి.
► వైఎస్‌ఆర్ బీమాకు సంబంధించి మొత్తం 111.35 లక్షల ఇళ్లకు సర్వే పూర్తి అయింది. యజమానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. దీనిపైనా కలెక్టర్లు చొరవ చూపాలి.
భారీ వర్షాలు, వరదలు.. నష్టం అంచనా
► 10 జిల్లాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. వరద తగ్గుముఖం పట్టింది. పంటల నష్టాన్ని వీలైనంత త్వరగా అంచనా వేసి, పంపించాలి. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లు చొరవ చూపాలి.
► ఆ జాబితాలను ఆర్బీకేల వద్ద ప్రదర్శించాలి. సహాయ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఈ వరదల్లో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. అన్యాయమైన ప్రతిపక్షం ఉండడంతో మంచి పని చేయాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పేదలకు ఇంటి స్థలం ఇవ్వడం కోసం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నాం. పెండింగ్‌లోఉన్న దరఖాస్తులను వెరిఫై చేసి పంపండి. సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, సీఎస్ సాహ్ని, డీజీపీ సవాంగ్ పాల్గొన్నారు.
వీటన్నింటినీ పరిశీలించాలి
► గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్ని సదుపాయాలు (ఎంటైర్ హార్డ్‌వేర్) అందుబాటులో ఉన్నాయా?
► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు ప్రదర్శిస్తున్నారా?
► అన్ని ముఖ్య నంబర్లు డిస్‌ప్లే చేస్తున్నారా?
► అన్ని ప్రభుత్వ సేవలు (543కు పైగా) సచివాలయాల్లో అందుతున్నాయా? లేదా?
► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్లు డిస్‌ప్లే చేస్తున్నారా?
► కోవిడ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ చికిత్స కేంద్రాలు, ఆస్పత్రుల వివరాలు ప్రదర్శిస్తున్నారా?
► సచివాలయాల సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు విధులకు హాజరవుతున్నారా? బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నారా?
► అన్ని ముఖ్య రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా జరుగుతోందా? నిర్ణీత వ్యవధిలో సేవలు అందుతున్నాయా?
Comments
Please login to add a commentAdd a comment