
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చాం.. ఇచ్చిన మాట కంటే మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి తీరతామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నవరత్నాల్లో భాగంగా.. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ ఒక్కకాలనీలోనే దాదాపుగా 10,228 ప్లాట్లు ఇళ్ల నిర్మాణం జరగబోతోందని, పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందని సీఎం జగన్ చెప్పారు. ‘‘ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా. తర్వాతి తరానికి ఇచ్చే ఆస్తి. అలాంటి ఇళ్లను ఇవ్వడం ద్వారా ఒక సామాజిక హోదా కల్పించినట్లు అవుతుంది. స్థలం, ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు.. మొత్తం కలిపి అక్షరాల పదిలక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ఒక అన్నగా, తమ్ముడిగా అక్కాచెల్లెమ్మల తరపున భరించే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు’’ అంటూ సీఎం జగన్ తెలియజేశారు.
‘‘ఈ మంచి పనికి పదహారు నెలల కిందటే అడుగులు వేశాం. కానీ, మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారు. మన పాలనకు, నాకు ఎక్కడ మంచి పేరు దక్కుతుందోనేమోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పటికి కల సాకారమైంది. కోర్టు వ్యవహారాలు పూర్తికావడానికి సుమారు 489 రోజులు పట్టిందని.. ఈ కార్యక్రమం కోసం ఎప్పటికప్పుడు ఏజీతో చర్చిస్తూ వచ్చామని ఆయన అన్నారు. దేవుడి దయ వల్ల సమస్య తీరిపోయి.. లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంద’’ని సీఎం జగన్ అన్నారు.
పాదయాత్రలో, ఎన్నికల ప్రణాళికలో 25 లక్షల మందికి పైగా ఇళ్లు కటిస్తామని మాటిచ్చాం. కానీ, అదనంగా, మెరుగైన సౌకర్యాలతోనే ఇళ్లులు కట్టిస్తామని సీఎం జగన్ సగర్వంగా తెలియజేశారు. ఇప్పటికే రెండో దశ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. అర్హులైన వాళ్లకు ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత తనదని, ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో ఇంటి అడ్రస్ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదని సీఎం జగన్ ఉద్ఘాటించారు. రోజుకో అబద్ధప్రచారంలో మునిగిపోతున్న దుష్టచతుష్టయం చేస్తున్న కుయుక్తులను, మంచిని చేస్తుంటే అడ్డుకుంటున్న ప్రయత్నాలను గమనించాలని ప్రజలను కోరారు సీఎం జగన్. కానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా మాట తప్పమని, ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment