citizen service portal 2.0: CM YS Jagan Unveil new software portal on 27th January, Details Inside - Sakshi
Sakshi News home page

CM YS Jagan: సిటిజెన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ఏపీ సేవగా పేరు మార్చాం

Published Thu, Jan 27 2022 3:46 AM | Last Updated on Thu, Jan 27 2022 2:54 PM

CM YS Jagan Unveil new software portal on 27th January - Sakshi

సాక్షి, అమరావతి: సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఓ అర్జీ పరిష్కారానికి సంబంధించి దరఖాస్తు ఎప్పుడు, ఏ అధికారి వద్ద ఏ దశలో ఉందన్న వివరాలను దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్‌ రూపంలో తెలియజేసే ప్రక్రియను తెచ్చింది. దీనికి సంబంధించి ‘ఏపీ సేవ పోర్టల్‌’ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. ఏపీ సేవ పేరును ఈ పోర్టల్‌కు పెడుతున్నాం. మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీ తనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగుపరచే గొప్ప కార్యక్రమం ఇది. ఏపీ సేవా పోర్టల్‌ ఓ గొప్ప ముందడుగు. గ్రామ స్వరాజ్యం అంటే గడచిన ఈ రెండేళ్లకాలంలో మన కళ్లముందే కనిపించేలా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది.

540కిపైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. ప్రతి 2వేల జనాభాకు ఒకటిచొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. మొత్తంగా దాదాపు 4 లక్షలమంది ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తున్నారు. గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో నిరంతరం పనిచేస్తున్నారు. ఈ 4 లక్షలమంది సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సేవలను మరింత మెరుగు పరుస్తూ ముందడుగు వేస్తూ 2.0ను ప్రారంభిస్తున్నామ'ని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

మీసేవలో లేనివి సైతం..
నగరాలు, పట్టణాలు, మారుమూల గ్రామాలనే తేడా లేకుండా ప్రజలకు సొంతూరిలోనే దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున  రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది. మీ–సేవా కేంద్రాలలో సైతం అందుబాటులో లేని 220కి పైగా కొత్త సేవలు సచివాలయాల ద్వారా అందుతున్నాయి. 2020 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు సచివాలయాల ద్వారా 3.47 కోట్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందాయి.


గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది (ఫైల్‌)

ఒకే పోర్టల్‌ పరిధిలోకి..
ప్రజల నుంచి అందే అర్జీలను ప్రస్తుతం సచివాలయాల సిబ్బంది ఎప్పటికప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. అర్జీ పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు ఆ సమాచారం సచివాలయ సిబ్బందికి తెలియడం లేదు. కేవలం సంబంధిత శాఖ పరిధిలోనే ఆ వివరాలు ఉంటాయి. దీనివల్ల అర్జీదారుడికి దరఖాస్తు స్థితిగతులను సచివాలయ సిబ్బంది తెలియచేయలేకపోతున్నారు. ఈ ఇబ్బందులన్నీ తొలగిస్తూ వివిధ శాఖలు ఆన్‌లైన్‌ ద్వారా అందజేసే సేవలన్నింటిని ఒకే పోర్టల్‌ పరిధిలోకి తెస్తున్నారు. తద్వారా సచివాలయాల సిబ్బందికి తమ పరిధిలోని అర్జీల పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి.

ఎవరి వద్ద, ఎంతకాలం పెండింగ్‌?
సచివాలయాల ద్వారా ప్రజలు అందజేసే దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం అంశాలవారీగా నిర్దిష్ట కాలపరిమితి విధించింది. అయితే ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం ఎన్ని రోజుల్లో వినతి పరిష్కరించారో మాత్రమే తెలుస్తోంది. ఏ అధికారి వద్ద అర్జీ ఎంత కాలం పెండింగ్‌లో ఉందన్న వివరాలు తెలియడం లేదు. కొత్త సాఫ్ట్‌వేర్‌ పోర్టల్‌ ప్రకారం ఒక అధికారి వద్ద అర్జీ ఎంత కాలం పెండింగ్‌లో ఉందన్న వివరాలను సచివాలయ శాఖ తెలుసుకునే వీలుంటుంది. నిర్దిష్ట కాలపరిమితికి మించి అర్జీని ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచే అధికారి వివరాలు పోర్టల్‌ డ్యాష్‌ బోర్డులో ఎప్పటికప్పుడు కనిపిస్తాయి. ఇది వేగంగా అర్జీల పరిష్కారానికి దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

20 రోజులుగా ట్రయల్‌ రన్‌..
సచివాలయాల ద్వారా పొందుతున్న సేవలలో 90 శాతం దాకా ఉండే ఐదు శాఖల సేవలను కొత్త సాఫ్ట్‌వేర్‌ పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రెవెన్యూ–సీసీఎల్‌ఏ, పట్టణాభివృద్ధి, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌ శాఖలకు సంబంధించి 135 సేవలను కొత్త పోర్టల్‌కు అనుసంధానించి గత 20 రోజులుగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. శాఖల వారీగా మిగిలిన సేవలను కూడా కొత్త పోర్టల్‌కు అనుసంధాన ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement