గ్రామీణాభివృద్ధి ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేతమైన, వినూత్న చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయాల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూనే ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడం ఒక సాహసోపేతమైన ప్రయోగం. మొత్తంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు.
– కేంద్రానికి నిపుణుల బృందం నివేదిక
నిన్న ఆర్బీకేలు.. నేడు గ్రామ సచివాలయాలు!.. వ్యవసాయ ఉపకరణాల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ల దాకా.. అవసరం ఏదైనా సరే ఆగమేఘాలపై సేవలు అందిస్తున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ స్వరాజ్యం సాకారమైంది..
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలన్నీ సర్వత్రా ప్రశంసలు అందుకోగా దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్నదాతలకు ఆర్బీకేలు అందిస్తున్న సేవల పట్ల ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు సమర్ధంగా ప్రజలకు చేరే వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిఫుణుల కమిటీ సూచించింది.
పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ కార్యదర్శి ఆరుణాశర్మ, తమిళనాడు రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ నేతృత్వంలో సామాజిక, ఆర్థికాభివద్ది, సోషల్ ఇంజనీరింగ్ తదితర రంగాలకు చెందిన 32 మంది నిపుణులతో కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది ఓ కమిటినీ నియమించింది. కమిటీ సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో పర్యటించారు.
ఫిబ్రవరి 17 – 27వ తేదీల మధ్య నలుగురు సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని 23 గ్రామ పంచాయతీల్లో పర్యటించింది. క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
సొంత పథకాలతో మరింత సాయం
సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సహా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న విధానాలను అనుసరిస్తూ ప్రత్యేక స్థానంలో నిలిచిందని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. రెండు విధానాలు మన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి.
గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ఆంధ్రప్రదేశ్ పలు సొంత పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం ఇందులో ఒకటి. ఇక రెండోది.. కేంద్ర పథకాల ద్వారా లబ్ధిదారులకు అందించే ఆర్థిక సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత అదనపు సాయాన్ని జోడిస్తోంది. తద్వారా కేంద్రం నిర్దేశించిన దానికంటే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుస్తున్నట్లు కమిటీ తన నివేదికలో వెల్లడించింది.
పింఛన్ల పంపిణీ విధానం అనుసరణీయం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే రూ.2,500 – రూ.10,000 చొప్పున వివిధ కేటగిరీల వారికి సామాజిక పింఛన్లను టంచన్‌గా పంపిణీ చేయడాన్ని నిపుణుల కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో సైతం లేని విధంగా భారీ స్థాయిలో ప్రతి నెలా దాదాపు 62 లక్షల మందికి సక్రమంగా పింఛన్ల పంపిణీ జరుగుతున్న విషయాన్ని నివేదికలో ఉదహరించింది. పేదలకు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తోందని తెలిపింది.
ప్రతి నెలా ఒకటవ తేదీ సాయంత్రం 3 – 4 గంటలకే 90 శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతోందని, ఎలాంటి పడిగాపులు లేకుండా వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే డబ్బులు అందిస్తున్నారని ప్రశంసించింది. వివిధ కారణాలతో మిగిలిపోయిన మరో పది శాతం మందికి రెండు మూడు రోజుల్లోగా ఇళ్ల వద్ద డబ్బులు పంపిణీ చేస్తున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీలో ఈ విధానాన్ని అమలు చేయడం పేదలకు ఎంతో ప్రయోజనకరమని కమిటీ కేంద్రానికి సూచన చేసింది.
సచివాలయ ఉద్యోగుల సేవలతో..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాల తరహాలో దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలు కోసం సిబ్బంది నియామక నిష్పత్తిని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని కమిటీ తన నివేదికలో కేంద్రానికి సూచించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో దాదాపు పది మంది ఉద్యోగులు పని చేస్తుండడాన్ని కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకం, కార్యక్రమాన్ని అమలు చేసినా క్షేత్రస్థాయిలో సమర్ధంగా అందాలంటే గ్రామ స్థాయిలో తగినంత మంది సిబ్బంది అవసరమని కమిటీ పేర్కొంది. ‘పంచాయతీల స్థాయిలో సచివాలయ భావనతోపాటు ఉద్యోగులు రోజూ నిర్ణీత సమయం కార్యాలయంలో అందుబాటులో ఉండడం వల్ల ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజలకు సత్వర న్యాయం దక్కుతుంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment