అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం | CM YS Jaganmohan Reddy comments at a meeting of state level bankers | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

Published Sat, Oct 24 2020 3:23 AM | Last Updated on Sat, Oct 24 2020 10:07 AM

CM YS Jaganmohan Reddy comments at a meeting of state level bankers - Sakshi

212వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌.

వ్యవసాయ రంగానికి, మహిళల స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది. అన్ని పథకాలకు బ్యాంకర్లు అండగా నిలవాలి. ‘జగనన్న తోడు’ కింద చిరు వ్యాపారులకు రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలి. కోవిడ్‌ సమయంలో నిధుల కొరత లేకుండా సహకరించినందుకు అభినందనలు.  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బ్యాంకర్లు మద్దతు ఇవ్వడంతో పాటు సహాయ, సహకారాలు అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ప్రధానంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలతో పాటు వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాలకు బ్యాంకర్లు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన తన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన 212వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడినందున, ఆ రంగం ప్రాధాన్యతను గుర్తించి పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రధానంగా ‘వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌’ పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం కోసం ఏటా రూ.13,500 ఇస్తున్నామన్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలో (జూన్‌లో) రూ.7500, రబీ ప్రారంభంలో (అక్టోబర్‌) రూ.4 వేలు, ఆ తర్వాత పంట చేతికొచ్చే సంక్రాంతి పండుగ సమయంలో రూ.2 వేలు ఇస్తున్నామని వివరించారు. దీని వల్ల 1.25 ఎకరాలు (అర హెక్టారు), అంత కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ మొత్తం పెట్టుబడిగా దాదాపు సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

 10,641 ఆర్బీకేల ఏర్పాటు 
► ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. మొత్తం 10,641 ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నాం. పరీక్షించిన, నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్డర్‌ చేసిన 48 గంటల్లోనే రైతులకు అందజేస్తున్నాం. రైతులు ఆర్డర్‌ పెట్టేందుకు వీలుగా ఆర్బీకేలలో కియోస్క్‌లు ఏర్పాటు చేశాం.  
► ఈ–క్రాపింగ్‌ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం. గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు.. అందరూ కలిసి ఈ–క్రాపింగ్‌ చేస్తున్నారు. అందువల్ల బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ రైతు ఈ–క్రాపింగ్‌ సరి్టఫికెట్‌ కలిగి ఉన్నాడా? లేదా అన్నది చూడాలి.    
► 2020–21 ఖరీఫ్‌లో రూ.75,237 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.62,650 కోట్లు పంపిణీ చేశారు. కోవిడ్‌ సంక్షోభంలోనూ చెప్పుకోదగిన స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇచ్చాయి.  
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్న బ్యాంకర్ల కమిటీ ప్రతినిధుల 

► గత ఏడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలు కొన్నాము. ఈసారి దాదాపు రూ.3,500 కోట్లతో ఆ నిధి ఏర్పాటు చేశాం. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి రోజూ ఆయా పంటల ధరలు, వాటి డిమాండ్‌ను ఈ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్‌ చేస్తారు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరం. 
► ప్రతి గ్రామంలో గోదాములు, జనతా బజార్లు, మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ ఏర్పడుతుంది. 
వీటన్నింటికీ మీ సహకారం కావాలి.. 
► ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. 51కి పైగా మందులతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అందుబాటులో ఉంటారు. ఆరోగ్యశ్రీకి ఈ క్లినిక్‌లు రిఫరల్‌గా ఉంటాయి.  
► వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతోంది. ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలతో వారికి స్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్నాం. ఇందుకు అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, రిలయెన్స్, అల్లానా గ్రూప్‌లతో ఒప్పందాలు చేసుకున్నాం. 
► వైఎస్సార్‌ ఆసరా ద్వారా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.1,100 కోట్లు అందజేశాం. ఈ కార్యక్రమాలు, పథకాలన్నీ మరింత సమర్థవంతంగా అమలు కావాలంటే బ్యాంకర్లు సహాయ, సహకారాలు అందించాలి.  ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement