సాక్షి, అమరావతి: పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని ఇందులో భాగంగా వచ్చే 4 నెలల్లో ఒక పోర్టును, నాలుగు ఫిషింగ్ హర్బర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో, ఏపీఐఐసీ వీసీ, ఎండీ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. రామాయపట్నం పోర్టులో కార్గో బెర్త్ పనుల్ని డిసెంబర్ నాటికి పూర్తిచేసి జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా సుమారు రూ.20 వేలకోట్లతో నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ సెజ్ పోర్టు), 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆయన గురువారం నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తొలిదశలో నిర్మాణం చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలుత జువ్వలదిన్నె, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లను ప్రారంభిస్తామన్నారు. నాలుగు పోర్టులతో పాటు వాటి పక్కనే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment