ఏపీలో అభివృద్దే లేనట్లు విషం చిమ్ముతున్న వారికి ఇది సమాధానం. ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా ఒక్కసారి వీటిని తిలకిస్తే ఏపీలో ప్రగతి జరుగుతుంది, లేనిది తెలుస్తుంది. కావలి సమీపంలోని రామాయపట్నం, జువ్వలదిన్నె గ్రామాల వద్దకు వెళ్లి వీరు చూస్తే కుళ్లు కుంటారేమో! లేకపోతే అందులోనూ ఏదో ఒకటి వక్రీకరించి పెడబొబ్బలు పెడతారేమో తెలియదు. రామాయపట్నం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణం వేగంగా సాగుతోంది. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఐదు పోర్టులు ఉండగా, కొత్తగా నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. కేవలం ఓడరేవులకే పదహారువేల కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారు.
గత 70ఏళ్లలో ఏపీ చరిత్రలో ఇన్ని ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఒకేసారి ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొరవ తీసుకుని తీర ప్రాంతంపై దృష్టి పెట్టారు. తీరం వెంబడి కార్యకలాపాలు చేపడితే ఏపీలో గ్రోత్ పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇన్నేళ్లుగా ఏపీకి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, తగు అభివృద్ది జరగడం లేదని రాసేవారం. ఇప్పుడు మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలతో ఆ పరిస్థితి మారుతోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం చేపట్టారు.
కాకినాడ పోర్టు తప్ప మిగిలిన వాటిని ప్రైవేటు రంగంలో సిద్దం చేస్తున్నారు. వారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నట్లు కనిపించింది. బందరు పోర్టు నిర్మాణం కూడా చురుకుగా సాగుతోంది. కాకినాడ పోర్టు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టారు. కొత్త ఓడరేవులకు అనుసంధానంగా పరిశ్రమలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటివల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కొద్ది రోజుల క్రితం రామాయపట్నం ఓడరేవు నిర్మాణాన్ని, అలాగే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించడానికి నేను వెళ్లాను. ఫిషింగ్ హార్బర్ 95 శాతం పూర్తి అయిందని అధికారవర్గాలు తెలిపాయి. చివరి దశలో కొంత ఆర్దిక సమస్యలు ఎదురైనట్లు చెబుతున్నారు. అవి లేకుంటే ఈ పాటికి ఆపరేషన్‌లోకి వచ్చేది. వేలాది బోట్లు అక్కడ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళుతుండేవి. ఇప్పటికే పలు బోట్లు అక్కడ తవ్విన బారీ చానల్ ద్వారా సముద్రంలోకి తేలికగా వెళుతున్నాయి. వారు మత్స్య సంపదను తెచ్చి అమ్మకానికి పెడుతున్నారు.
మత్స్యకారులు, వ్యాపారుల సదుపాయార్దం పలు భవనాలు, స్టాక్ యార్డులు, ఇతర సదుపాయాల నిర్మాణం పూర్తి అయిపోయింది. దీనిని బహుశా కొద్ది నెలల్లోనే ఆరంభించే అవకాశం ఉంది. రామాయపట్నంలో నాన్ మేజర్ ఓడరేవు నిర్మాణం సాగుతున్న తీరును అక్కడ ఉన్న నిర్మాణ సంస్థ అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ దీనిని నిర్మిస్తోంది. దీని తరపున నవయుగ, అరవిందో సంస్థలు సంయుక్తంగా ఈ నిర్మాణం చేపట్టాయి. అరవిందో సంస్థ జనరల్ మేనేజర్ పెరుమాళ్, టెక్నికల్ హెడ్ సుధాకర్ రావు తదితరులు ఒక ప్రజెంటేషన్ ద్వారా పోర్టు ప్రగతిని వివరించారు. రామాయపట్నం పోర్టుకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే అది జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో, ప్రధాన రైల్వే మార్గంలో తెట్టు రైల్వే స్టేషన్ నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దగ్గరగా రవాణా సదుపాయాలు ఉన్న అతి కొద్ది పోర్టులలో ఇది ఒకటి అవుతుంది.
జాతీయ రహదారిని కలపడానికి పోర్టు నుంచి ఆరు లైన్ల రోడ్డును వేస్తున్నారు. అలాగే రైల్వే లైన్ నిర్మాణం కూడా చేస్తారు. రామాయపట్నం పోర్టు వద్ద పరిశ్రమలు, ఎగుమతి వ్యాపారం నిమిత్తం సుమారు నాలుగువేల ఎకరాల భూమి కూడా గుర్తించారు. పోర్టుకోసం 850 ఎకరాల భూమి సేకరించారు. ఈ పోర్టు పనులు వేగంగా జరుగుతుండటంతో అక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. ఒక్కసారిగా తమ భూముల విలువలు పెరిగాయని వారు చెబుతున్నారు. కొన్ని పరిశ్రమలు తమకు అవసరమైన భూమిని కొనుగోలు చేస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ,హైదరాబాద్‌లకు చెందిన వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఈ ఓడరేవు సదుపాయాలను వాడుకోగలుగుతారు.
మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ రేవు ఉపయోగపడుతుంది. మొదటి దశలో 34 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణాకు ప్లాన్ చేశారు. తుది దశలో 138 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయవచ్చు. మొత్తం నాలుగు బెర్తులు నిర్మాణం చేస్తున్నారు. వీటిలో ఒకటి ఈ డిసెంబర్‌లో పూర్తి అవుతుందని, తొలి సరుకుల నౌక వస్తుందని నిర్మాణ సంస్థలవారు తెలిపారు. ఈ పోర్టు మొదటి దశ నిర్మాణానికి రూ.3,736 కోట్లకు పాలన అనుమతి మంజూరు కాగా, అంతర్గత బెంచ్ మార్క్ అంచనా రూ.2,647 కోట్లుగా ఉంది. ఈ బెర్తులలో రెంటిని ఇప్పటికే జేఎస్‌డబ్ల్యు, ఇండోసోల్ కంపెనీలకే ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ఓడరేవులో కీలకమైన ఉత్తర, దక్షిణ బ్రేక్ వాటర్ పనులు చాలావరకు జరిగాయి. సముద్రంలోకి దక్షిణ బ్రేక్ వాటర్ 3700 మీటర్లు, ఉత్తర బ్రేక్ వాటర్ 1350 మీటర్లు ఉంటుంది. ఓడలు రావడానికి అనువుగా చానల్ తవ్వకం జోరుగా సాగుతోంది. అక్కడ నుంచి డ్రెడ్జర్ ద్వారా తీసిన మెటీరియల్‌ను పర్యావరణం దెబ్బతినకుండా సముద్రంలో నిర్ణీత దూరంలో పడవేస్తున్నారు.
దక్షిణ బ్రేక్ వాటర్ వైపు 60 లక్షల మెట్రిక్ టన్నుల మెటీరియల్ తీయాల్సి ఉండగా, ఇప్పటికే 43 లక్షల మెట్రిక్ టన్నుల మెటీరియల్ తీశారు. నార్త్ బ్రేక్ వాటర్ వైపు 83 శాతం మెటీరియల్ తొలగింపు పూర్తి అయింది. అప్రోచ్ ఛానల్, ఓడలు తిరగడానికి వీలుగా 500 మీటర్ల టర్నింగ్ సర్కిల్ తయారు చేస్తున్నారు. ఒకసారి ఈ ఓడరేవు ఆపరేషన్‌లోకి వచ్చిందంటే దక్షిణ కోస్తాకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే అక్కడ కృష్ణపట్నం పోర్టు ఉండగా, ఇప్పుడు రామాయపట్నం రేవు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ముఖ చిత్రం మారిపోతుంది.
తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ఈ అభివృద్దిని ప్రొజెక్టు చేయలేవు కనుక వారి నుంచి ప్రత్యేకంగా ఆశించలేం. పైగా అసలు ఏమీ అభివృద్ది జరగడం లేదని ప్రచారం చేస్తుంటాయి. వారి భయాలను అర్థం చేసుకోవచ్చు. కానీ, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రస్తుతం తెలుగుదేశం కోసమే పనిచేస్తూ, ఈ అభివృద్దిని చూడడానికి ససేమిరా అంటున్నాయి. అవి కళ్లున్న కబోదులుగా మారాయి. అయినా ఇవి పూర్తి అయిన రోజున వీరు ఎంత మభ్యపెట్టాలనుకున్నా, వాస్తవ ప్రగతి ప్రజలకు అర్ధం అవుతుంది. ఎంతమంది ఇబ్బంది పెట్టినా, వ్యతిరేక ప్రచారం చేసినా ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి అభివృద్దిని మరింత చేయాలని ఆకాంక్షిద్దాం.
కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment