ఒకరికి ఒక చోటే ఓటుండాలి | Complaint of YSRCP team to the Chief Electoral Officer of the state | Sakshi
Sakshi News home page

ఒకరికి ఒక చోటే ఓటుండాలి

Published Thu, Nov 30 2023 3:48 AM | Last Updated on Thu, Nov 30 2023 3:48 AM

Complaint of YSRCP team to the Chief Electoral Officer of the state - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో ఒకరికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. ఇది వైఎస్సార్‌సీపీ సిద్ధాంతమని మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్‌ స్పష్టం చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితాలో కొందరికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న వారికి సైతం ఇక్కడ ఓట్లు ఉన్నాయన్నారు. వాస్తవానికి ఆధార్‌ కార్డు ఎక్కడ ఉంటే.. అక్కడే ఓటు హక్కు ఉండటం న్యాయమని స్పష్టం చేశారు.

బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధి­కారి ముఖేష్‌కుమార్‌ మీనాను కలిసి ఓటర్ల జాబితా­లో చోటుచేసుకున్న అవకతవకలు, డూప్లికేట్‌ ఓట్లు, డీ రిజిస్ట్రేషన్‌ (తెలంగాణ), ఓటర్ల రీఎన్‌రోల్‌మెంట్‌ (ఆంధ్రప్రదేశ్‌) అంశాలపై  ఫిర్యాదు చేశారు. ఈ మే­రకు మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ లేళ్ల అప్పిరెడ్డి, ఎ­మ్మె­ల్యే మల్లాది విష్ణుతో కూడిన వైఎస్సార్‌సీపీ ప్రతి­నిధి బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖేష్‌­కుమార్‌ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు.

తొలగించారని ఒకరోజు.. చేర్పించారని మరో రోజు: మంత్రి రమేష్‌
ప్రధాన ఎన్నికల అధికా­రికి ఫిర్యాదు చేసిన అ­నంతరం మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఒకచోట మా­త్రమే ఓటు ఉండాలని.. కానీ.. ఒకే వ్యక్తికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్టు తమ పార్టీ గు­ర్తించిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండుచోట్ల కొందరికి ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇలాంటివి కొన్ని తాము గుర్తించామని.. వాటి గురించి రా­ష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ నేతలు కొందరు తమ పార్టీపై రోజూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారని విమర్శించా­రు.

ఎన్నికల సిబ్బంది లక్షల ఓట్లు తొలగించార­ని ఒక రోజు.. లక్షల ఓట్లు చేర్పించారని ఇంకో రోజు రాస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసే టీడీపీ అనుకూల పచ్చమీడియా అలాంటి రాతలు రాస్తోందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత 70 రోజులు పత్తా లేకుండా పారిపోయిన లోకేశ్, మంత్రులకు భయం చూపెడతానంటున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు.

పీపుల్స్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు కోరాం: మంత్రి మేరుగు నాగార్జున
మంత్రి మేరుగు నాగా­ర్జున మాట్లాడుతూ.. గత నెలలో ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుచోట్ల 16 లక్షలకు పైగా ఓటర్లుగా నమోదయ్యారన్నారు. అలాంటి వాటిని తొలగించాలని కోరామన్నారు. 1950 పీపుల్స్‌ యాక్ట్‌ సెక్షన్‌–17 ప్రకారం ఏ నియోజకవర్గంలో అయినా ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.

తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని, అక్కడ ఓట్లు క్యాన్సిల్‌ చేయించుకుని ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేలా కొందరు చూస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు ఓటు వేసి.. ఆ తర్వాత మన రాష్ర్టంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరినట్టు వివరించారు.

ఈ మేరకు అధికారులకు క్లియర్‌గా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అనేది తమ నినాదమన్నారు. యుద్ధానికి రాకుండానే.. అస్త్ర సన్యాసం చేసే సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణే అని మేరుగ ఎద్దేవా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement