సమావేశమైన టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్న తదితరులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడలోని కేశినేని భవన్‌లో స్ట్రామ్ వాటర్ అంశంపై ఎంపీ నాని సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి బొండా ఉమ, బుద్దా అనుయాయులైన ఆరుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. 14 మంది కార్పొ రేటర్లలో ఆరుగురు రాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఆ పార్టీలో వర్గాలు ఉన్నాయని అనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కరోనా వేవ్‌ల్లో వివిధ వేరియంట్లు వృద్ధి చెందినట్లు విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని టీడీపీ నేతల్లో విభిన్న స్పర్థలు పుట్టుకొస్తున్నాయి.
కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ ముఖ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో మట్టికరచిన పార్టీ తాజా పరిణామాలతో అంతకన్నా అడుగంటుతోంది. రహస్య భేటీలు ఓ వైపు, పోటాపోటీ పరామర్శలు, ఓదార్పులను మరోవైపు నాయకులు కొనసాగిస్తున్నారు. బెజవాడ పార్లమెంటు పరిధిలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయని, చివరకు పార్టీ ఏ దరికి చేరుతుందో కూడా అంతుచిక్కడం లేదని క్యాడర్ అంచనాకు వస్తోంది.
విజయవాడ మేయర్ అభ్యర్థిగా తన కుమార్తె శ్వేత మాత్రమే పోటీలో ఉంటుందని తనదైన శైలిలో ఏకపక్షంగా ప్రకటించి రచ్చకు తెర తీశారని పార్టీ లో విమర్శలు ఎదుర్కొన్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) నేటికీ అదేతీరుతో వ్యహరిస్తున్నారని ఆయన వ్యతిరేకులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కార్పొరేటర్ అయిన తన కుమార్తె శ్వేతను విజయవాడ వెస్ట్, సెంట్రల్‌తో పాటు లోక్‌సభ పరిధిలోని తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోనూ నాని తిప్పుతు న్నారని స్వపక్షీయులు గుర్తు చేస్తున్నారు. స్థానిక పార్టీ బాధ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ హోదాలో కార్పొరేటర్ పర్యటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు వర్గీయులకేమైనా పార్టీలో ప్రత్యేకతలు ఉన్నాయా అని బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల నేతలు నిలదీస్తున్నారు. ఎంపీ హోదాలో కేశినేని నాని ఎక్కడికైనా వెళ్లవచ్చని, శ్వేత తమ నియోజకవర్గాల్లో పర్యటనలు ఏంటని ఇటీవల వెస్ట్, సెంట్రల్‌లో నిలదీశారని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇటీవల కేశినేని భవన్‌లో నిరసన దీక్ష చేపట్టగా తూర్పు నియోజకవర్గంలో వెళ్లి చేసుకోవాలంటూ నాగుల్ మీరా, బుద్దా వెంకన్న వర్గీయులు ధ్వజమెత్తారు. సెంట్రల్‌లోని శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమంలో, వెస్ట్‌లో 45వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం ప్రారంభం సందర్భంగానూ రగడ చోటుచేసుకుంది.
ఆ నలుగురు రహస్య భేటీ
కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ తీవ్ర విమర్శలు చేసిన బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తాజాగా బొండా నివాసంలో రహస్య భేటీ నిర్వహించారు. గతంలో కేశినేని భవన్‌లో ఉంటూ నానితో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొమ్మారెడ్డి పట్టాభి కూడా బొండా బృందంతో జత కట్టారు. కేశినేనికి వ్యతిరేకంగా ఎంత బలంగా పని చేయాలి, ఎంపీని ఎలా ఒంటరిని చేయాలనే సమాలోచనలు నలుగురు చేశారని సమాచారం. అందులో భాగంగానే అధిష్ఠానంపై నానిది ధిక్కారస్వరమని, కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం వల్ల పార్టీ సర్వ నాశనమైందని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు వైరల్ చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బుద్దా వెంకన్న గట్టి పోటీ ఇస్తారని విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఇంకోవైపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ లోక్‌సభ పరిధిలో ఏదో ఒక కార్యక్రమం పేరిట రహస్య పర్యటనలు కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేశినేనికి వ్యతిరేకంగా బొండా బృందానికి మాజీ మంత్రి దేవినేని ఉమ పరోక్ష మద్దతు లేకపోలేదని స్వపక్షీయులు అంటున్నారు. మచిలీపట్నం లోక్ సభ పరిధిలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు పదవి ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ గుర్రుగా ఉన్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ సర్కారు విజయవాడ నగర అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీని పటిష్ట పరచుకుంటోందని టీడీపీ వర్గీయులు విశ్లేషి స్తున్నారు. నగరంలోని పేదల విషయంలో భారీఎత్తున చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం తీరు సర్కారు వైఖరిని తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ప్రజా మద్దతును కూడగట్టుకుంటున్న సర్కారు వైఖరిని టీడీపీ వర్గీయులు గుర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment