సిటిజన్స్ ఫర్ డెమాక్రసీ సంస్థ ముసుగులో చంద్రబాబు కుట్ర
నిజానికి ఇది ఆయన జేబు సంస్థ
దీనికి బాబు నమ్మినబంటు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ నేతృత్వం
ఈయన ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి వలంటీర్లపై వరుస ఫిర్యాదులు
సాక్షి, అమరావతి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో ఎలాంటి పైరవీలు, లంచాలకు తావులేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలను ఠంఛనుగా అందజేయడంలో కీలకంగా ఉన్న వలంటీర్లపై చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో గ్యాంగ్ చివరకు తన పగ సాధించింది.
అవ్వాతాతలకు ఏ కష్టం లేకుండా నెలనెలా ఒకటో తారీఖు పొద్దున్నే తలుపుకొట్టి మరీ పింఛన్లు అందజేస్తున్న ఈ వలంటీర్లపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మొదటినుంచీ రకరకాల వివాదాస్పద ఆరోపణలు చేస్తూ తమ అక్కసును, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర దాదాపు 66.40 లక్షల మంది లబ్ధిదారులను మళ్లీ టీడీపీ పాలనలో మాదిరిగా ఇబ్బందులకు గురిచేయడానికే చంద్రబాబు బరితెగించారు. ఇందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను పావుగా వాడుకున్నారు.
చంద్రబాబు సేవలోనే తరిస్తున్న నిమ్మగడ్డ..
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ.. ఆయన పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే మొదటి నుంచీ పనిచేసిన వ్యక్తే. స్థానిక సంస్థల నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సిఫార్సు చేశారు.
వాస్తవానికి.. 2018లో రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసినా.. 2019 సాధారణ ఎన్నికల ముందు ఆ ఎన్నికల జరిగితే నాటి చంద్రబాబు ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి నిబంధనలకు విరుద్ధంగా కోర్టు సాకుల పేరుతో సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు సర్పంచి ఎన్నికలు జరగకుండా నిమ్మగడ్డ అడ్డుకున్నారు.
ఇక జగన్ సీఎం అయ్యాక కూడా.. 2020 ఆరంభంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేశారు. అప్పట్లో ఈ నిర్ణయం కూడా తీవ్ర వివాదాస్పదమైంది.
వలంటీర్లపై సుప్రీంకోర్టులోనూ నిమ్మగడ్డ కేసులు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత తన పూర్తి సమయాన్ని ఆయన తన బాస్ చంద్రబాబుకే కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన నేతృత్వంలో పలువురు ద్వారా చంద్రబాబు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను ఏర్పాటుచేసి, ఆ సంస్థ ద్వారా వలంటీర్ల వ్యవస్థపై పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తూ కోర్టులోనూ కేసులు దాఖలు చేయించారు.
వలంటీర్ల వ్యవస్థ చెల్లుబాటునే ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి, ఆ తర్వాత తనంతట తానుగా ఆ కేసును ఉపసంహరించుకున్నారని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులోనూ కేసు దాఖలు చేశారని, రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో వరుసగా రెండుసార్లు వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఫిర్యాదు చేసింది.
రూ.లక్షల్లో లాయర్లకు ఫీజులు..
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై మొత్తం కథ నడిపించిన చంద్రబాబు ఇందుకు లాయర్ల ఫీజుల నిమిత్తం రూ.లక్షల్లో వెచ్చించారు. సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసులు వాదించేందుకు ఖరీదైన లాయర్లను వినియోగించారు. నిజానికి.. అంత పెద్ద లాయర్లను భరించడం ఈ సంస్థవల్ల కాదు కాబట్టి చంద్రబాబే వెనుకనుండి ఇదంతా నడిపిస్తున్నారు. ఇక ఈ కేసులను కపిల్ సిబాల్, సిద్ధార్థ దవే., పీబీ సురేష్ వంటి సీనియర్ లాయర్లు వాదిస్తున్నారు. వీళ్ల ఫీజులు రోజుకు రూ.లక్షల్లో ఉంటుందన్నది తెలిసిందే.
నరకప్రాయమైన ఆ రోజులు మళ్లీ..
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర దాదాపు 66.40 లక్షల మంది లబ్ధిదారులు మళ్లీ రోడ్డున పడనున్నారు. అప్పట్లో చంద్రబాబు పాలనలో వీళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవి మళ్లీ పునరావృతం కానున్నాయి.
ఆ రోజుల్లో పింఛన్ల కోసం బ్యాంకులకు వెళ్తే చాంతాడంత క్యూలు.. మండే ఎండల్లో తిండి లేకుండా నిరీక్షణ.. ఈలోపు సమయం మించిపోతే మళ్లీ బ్యాంకుల నుంచి ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. కానీ, 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీరి కష్టాలన్నింటికీ మంగళం పాడుతూ వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇది ఎప్పటికైనా తన పుట్టి ముంచుతుందని చంద్రబాబు గ్రహించి సందర్భం వచ్చినప్పుడల్లా వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కేవారు.
బాబు జేబు సంస్థ ముసుగులో..
తన జేబు సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను చంద్రబాబు కొద్దిరోజుల ముందే ఏర్పాటు చేయించారు. దీని ముసుగులో చంద్రబాబు తన కుట్రలకు ఎప్పటినుంచో పదునుపెట్టారు. ఎన్నికల సమయంలో ఈ వలంటీర్లను ఎలాగైనా విధుల నుంచి దూరం పెట్టాలని పచ్చబ్యాచ్ కుట్ర పన్నింది.
ఇందులో భాగంగా.. తన నమ్మినబంటు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ సంస్థకు నేతృత్వం వహించి బాబు డైరెక్షన్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి మొన్న ఫిబ్రవరి నుంచి అదేపనిగా వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి నగదు పంపిణీ చేపట్టవద్దంటూ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ విషయం ఈసీ కూడా తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment