సాక్షి, అమరావతి: రిసార్ట్ ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా విశాఖలోని రుషికొండపై చేపడుతున్న నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవని హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన సంయుక్త కమిటీ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం నివేదికను కమిటీ బుధవారం హైకోర్టుకు సమర్పించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అనుమతించిన మేరకు 9.88 ఎకరాల ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ రుషికొండ రిసార్ట్ ప్రాజెక్టు భవనాలను చేపట్టిందని తెలిపింది.
వ్యక్తిగత భవనాల ప్రదేశాల్లో స్వల్ప మార్పులు మినహా ఎలాంటి ఉల్లంఘనలు లేవని కమిటీ తేల్చింది. మొత్తం 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు బ్లాకులు నిర్మించాలని టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీటీడీసీ) ప్రతిపాదించింది. 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు బ్లాకుల నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతించినా టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులకే పరిమితం చేసిందని కమిటీ పేర్కొంది.
వాస్తవంగా సీఆర్‌జెడ్ అనుమతి మేరకు 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే 2.71 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం 1.84 ఎకరాల్లో అంటే 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులకే పరిమితమైనట్లు కమిటీ వివరించింది. మొత్తం 9.88 ఎకరాల ప్రాజెక్టులో 3.86 ఎకరాల్లో ఉన్న వాలు ప్రాంతంతో పాటు 4.225 ఎకరాలున్న మట్టి డంప్ ప్రాంతాన్ని కమిటీ పరిశీలించింది.
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం దాదాపుగా సరిపోతున్నట్లు కమిటీ పేర్కొంది. మట్టిడంప్ ప్రాంతమే అథారిటీ పేర్కొన్న దాని కన్నా కొంచెం ఎక్కువగా ఉందని, అయితే నిర్మాణం పూర్తయిన తరువాత డంప్ చేసిన మట్టిని తొలగిస్తారని కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ కేంద్ర పర్యావరణ శాఖ ముందస్తు అనుమతి లేకుండా భూ వినియోగ నమూనాలు, ప్రతి బ్లాక్‌లో బిల్డ్ అప్ ఏరియాతో ఉన్న బ్లాకుల సంఖ్యలో సవరణలు చేసిందని కమిటీ వ్యాఖ్యానించింది.
అయితే ఏపీటీడీసీ బిల్డప్ ఏరియాను తొలుత ప్రతిపాదించిన 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణం నుంచి 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణానికే నాలుగు బ్లాకులకే కుదించిందని కమిటీ పేర్కొంది. ఇందులో భూ వినియోగ విధానంలో ఎటువంటి మార్పులు లేవని, ఆమోదించిన బిల్డ్ అప్ ఏరియాలో నిర్మించిన ప్రాంతం సరిగానే ఉందని కమిటీ తెలిపింది. తొలుత 15,364 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించినట్లు అంకెల్లో పొరపాటు దొర్లిందని పేర్కొంది. 13,542 చదరపు మీటర్లలో నిర్మాణాలు, ఆమోదించిన ప్రాంతంలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది.
ప్రాజెక్టు పూర్తయ్యాక డంప్ తొలగింపు
రుషికొండకు దక్షిణం వైపున సీఆర్‌జెడ్–2 ప్రాంతంలో తవ్విన మట్టిని ఏపీటీడీసీ డంప్ చేస్తున్నట్లు కమిటీ పరిశీలనలో తేలిందని పేర్కొంది. అయితే ఇది మెటీరియల్ తాత్కాలిక నిల్వ కోసం ఉద్దేశించినందున అభ్యంతరకరం కాకపోవచ్చని తెలిపింది. పాక్షికంగా ల్యాండ్ స్కేపింగ్, హార్డ్ స్కేపింగ్ పనుల కోసం దీన్ని వినియోగిస్తున్నారని, ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఏవైనా ఉంటే ఆ స్థలం నుంచి తొలగిస్తారని పేర్కొంది. మొత్తం మీద కోస్టల్ రెగ్యులేషన్ జోన్, పర్యావరణ శాఖ అనుమతుల్లో పేర్కొన్న షరతుల ప్రకారమే ఉన్నాయని, ఎటువంటి ఉల్లంఘనలు లేవని కమిటీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment