సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. రికార్డు సమయంలో ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పిల్లర్ల (పియర్స్) నిర్మాణాన్ని 52 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేసింది. 48 గేట్లకుగానూ 28 గేట్లను స్పిల్ వేకు అమర్చింది. మిగతా 20 గేట్ల బిగింపు పనులను వేగవంతం చేసింది. గేట్లను ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు బిగించేందుకు ప్లాట్‌ఫామ్‌లను సిద్ధం చేసింది. స్పిల్ వేకు సమాంతరంగా స్పిల్ చానల్ పనులను వేగవంతం చేసింది. మేనాటికి స్పిల్‌వే, స్పిల్ చానల్‌ను పూర్తి చేసి, జూన్‌లో వచ్చే గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, 2022 ఖరీఫ్ లోగా ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా గ్రావిటీపై నీరు సరఫరా చేసే దిశగా పనులను వేగవంతం చేసింది.
ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను రచించారు. ఆ ప్రణాళిక మేరకు పనులు జరుగుతున్నాయా? లేదా? అనే అంశాన్ని నిత్యం సమీక్షిస్తూ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాక ముందు.. పోలవరం స్పిల్ వే పిల్లర్లను సగటున 23 మీటర్ల ఎత్తు వరకూ కూడా పూర్తి చేయలేదు. స్పిల్ వేకు గేట్లను 25.72 అడుగుల ఎత్తులో బిగిస్తారు. అంటే టీడీపీ సర్కార్ హయాంలో స్పిల్ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదని స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్‌లో హెడ్ వర్క్స్ పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. 2019 నవంబర్ 21న పనులు ప్రారంభించి వేగంగా చేస్తోంది. ప్రాజెక్టులోకి పులస చేపల రాకపోకలకు వీలుగా స్పిల్‌వే రెండో బ్లాక్‌లో ఫిష్ లాడర్ గేట్లను నిర్మించాల్సి ఉండటం, ఈ గేట్ల డిజైన్లకు సంబంధించి అనుమతులు ఆలస్యం కావడంతో రెండో పిల్లర్ నిర్మాణం ఆలస్యమైంది. కానీ ఇటీవలే అనుమతులు రావడంతో అన్ని పిల్లర్లను 52 మీటర్ల ఎత్తున నిర్మించారు. టీడీపీ సర్కార్ 60 నెలల్లో 23 మీటర్ల ఎత్తున పనులు చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం 14 నెలల్లో 29 మీటర్ల ఎత్తున 49 పిల్లర్లను పూర్తి చేసిందని స్పష్టమవుతోంది.
ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జి
స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ 1,128 మీటర్ల పొడవుతో నిర్మించాలి. స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్లను కాంట్రాక్టు సంస్థ 2020 జూలైలో ఏర్పాటు చేయడం ప్రారంభించింది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు అదే ఏడాది సెప్టెంబర్ 9న మొదలు పెట్టింది. స్పిల్ వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాగా 188 గడ్డర్లను ఇప్పటికే ఏర్పాటు చేయగా, 4 గడ్డర్లు మాత్రమే పెట్టాల్సి ఉంది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ పనులు 1,095 మీటర్ల మేర పూర్తి కాగా, మిగతా 33 మీటర్ల పనులు వారం రోజుల్లో పూర్తి కానున్నాయి. కేవలం ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేయడం చూస్తేనే పోలవరం పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్ధం అవుతుంది.
గేట్ల పనులూ ముమ్మరం
పోలవరం స్పిల్ వేకు 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇందుకు 49 పిల్లర్లపై ట్రూనియన్ బీమ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పటికే 28 గేట్లు బిగించారు. మిగిలిన 20 గేట్ల పనులూ వేగంగా సాగుతున్నాయి. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చాలి. ఇప్పటికే జర్మనీ నుంచి 70 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకున్నారు. మిగతా 26 సిలిండర్లను దిగుమతి చేసుకుంటున్నారు. గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చడానికి వీలుగా ప్లాట్‌ఫామ్‌లను సైతం సిద్ధం చేస్తున్నారు. గోదావరి వరదల్లోనూ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) పనులను నిర్విఘ్నంగా కొనసాగించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన ఈఎన్‌సీ
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను ఈఎన్‌సీ నారాయణరెడ్డి పరిశీలించారు. గురువారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ఆయన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఈ కె.నరసింహమూర్తి స్పిల్‌వే బ్రిడ్జి నిర్మాణం పనులు, గేట్లు అమరిక, ఎగువ కాఫర్ డ్యామ్ తదితర పనుల వివరాలను తెలియజేశారు. పవర్ ప్రాజెక్టు, కొండ తవ్వకం పనులను కూడా ఈఎన్‌సీ పరిశీలించారు.
(చదవండి: పరుగులు పెడుతున్న ‘పోలవరం’ పనులు)
బాబూ.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో..
Comments
Please login to add a commentAdd a comment