
సాక్షి, అమరావతి: నరసాపురం పర్యటన సందర్భంగా పాలకొల్లులో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అబద్ధాలు చెప్పారంటూ పచ్చపత్రిక తప్పుడు ప్రచారానికి దిగింది. అయితే ఈ వ్యవహారం వెనుక వాస్తవాలు ఓ సారి గమనిస్తే.. వైద్యశాఖలో సమూల మార్పులకు సీఎం జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమం కింద 17 కొత్త వైద్యకళాశాలల నిర్మాణం చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రూ.475 కోట్లతో ప్రభుత్వం వైద్యకళాశాల నిర్మాణం చేపట్టింది. ప్యాకేజ్–3 కింద పాలకొల్లు, ఏలూరు వైద్యకళాశాలల నిర్మాణం చేపడుతుండగా ఈ కాంట్రాక్టును మెగా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ ఏడాది జూన్ 28వ తేదీన ఆ సంస్థకు ఎల్‌వోఏ జారీచేశారు. పాలకొల్లు వైద్యకళాశాల నిర్మాణానికి నాబార్డు ఈ ఏడాది సెప్టెంబర్ 27న రూ.275 కోట్ల రుణం మంజూరు చేసింది. దీంతో వైద్యకళాశాల నిర్మాణ పనులు మొదలయ్యాయి.
పాలకొల్లులో వైద్య కళాశాల నిర్మాణం కోసం పనులు జరుగుతున్న దృశ్యాలు
ప్రీ కన్‌స్ట్రక్షన్ కార్యకలాపాలను ప్రారంభించి మానవ, ఇతర వనరులను సమకూరుస్తోంది. పేదప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వరంగంలో అందించడమే లక్ష్యంగా కొత్త వైద్యకళాశాలల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. ఇటీవల వరదల నేపథ్యంలో ఆ ప్రదేశంలో నీరు చేరడంతో పనులు ఆలస్యమయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న దుష్టచతుష్టయం పనిగట్టుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment