సీబీఐ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న దస్తగిరి (ఫైల్)
సాక్షి, అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పేరిట సీబీఐ మరోసారి తమ పంజరంలోని చిలక దస్తగిరిని బయటకు వదిలింది. తాము నెలల తరబడి నేర్పించిన చిలక పలుకులను అతనితో చెప్పించింది. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉచ్చులో చిక్కుకున్న సీబీఐ.. తాము సృష్టించిన అబద్ధాన్ని నిజం అని నిరూపించేందుకు మరిన్ని కట్టుకథలు అల్లిస్తోంది. న్యాయస్థానంలో విచారణ కంటే మీడియాకు లీకులు, టీవీ చానళ్ల మైకుల ముందు దస్తగిరి మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఎత్తుగడను మంగళవారం మరోసారి ప్రదర్శించింది. గతంలో దస్తగిరితో 161 స్టేట్‌మెంట్‌ను మీడియాకు లీకులిచ్చిన సీబీఐ... తాజాగా అతని 164 వాంగ్మూలాన్ని మీడియాకు అందించి హడావుడి చేసింది. తాజాగా.. సెప్టెంబరులో దస్తగిరి న్యాయస్థానానికి చెప్పినదాన్ని మంగళవారం మీడియాకు లీకులివ్వడం గమనార్హం.
అప్రూవర్‌గా మారిన తర్వాత ప్రలోభాలా!?
తాను అప్రూవర్‌గా మారిన తర్వాత తనను ప్రలోభ పెట్టేందుకు సెప్టెంబరులో యత్నించారని దస్తగిరితో సీబీఐ తాజాగా చెప్పించడం విస్మయపరుస్తోంది. అప్పటికే చాలా నెలలుగా దస్తగిరి, అతని కుటుంబాన్ని సీబీఐ అధికారులు ఢిల్లీలో తమ ప్రత్యేక అతిథులుగా చేసుకున్నారు. తాము తయారుచేసిన కట్టుకథ స్క్రిప్ట్‌ను ఎలా చెప్పాలో తర్ఫీదు ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. అంతా అనుకున్నట్లుగా ఉందని నిర్ధారించుకున్నాక దస్తగిరితో మొదట 161 కింద తమ వద్ద వాంగ్మూలం.. అనంతరం ఆగస్టులో 164 స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించారు.
వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని చెప్పిన అతన్ని అప్రూవర్‌గా మారేందుకు అవకాశమిచ్చారు. అంటే దస్తగిరి పూర్తిగా సీబీఐ అధికారుల గుప్పెట్లో ఉన్నాడన్నది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో.. ఎవరైనా దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తారా? పైగా.. భరత్ యాదవ్ అనే వ్యక్తిని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తన వద్దకు పంపించారని దస్తగిరి చెప్పడం విడ్డూరంగా ఉంది. అప్రూవర్‌గా మారిన వ్యక్తికి పదెకరాలు, రూ.10 లక్షలు ఇస్తామని ఎవరైనా ఎందుకు ప్రలోభ పెడతారు? అప్రూవర్‌గా మారి 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన తరువాత అతన్ని ప్రలోభపెడితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఏమీ ఉండదు. కానీ, దస్తగిరి మాత్రం తాను అప్రూవర్‌గా మారిన తరువాత వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తనను ప్రలోభ పెట్టేందుకు భరత్‌యాదవ్‌ను పలుమార్లు పంపించినట్లు చెప్పాడు. అంటే.. అంతకుముందు సీబీఐ అధికారులు 164 వాంగ్మూలం ద్వారా చెప్పించిన కట్టుకథకు బలం చేకూర్చేందుకే ఈ సరికొత్త డ్రామా ఆడించారన్నది స్పష్టమవుతోంది.
పరస్పర విరుద్ధంగా దస్తగిరి స్టేట్‌మెంట్లు
పూర్తిగా తమ నియంత్రణలో ఉన్న దస్తగిరితో సీబీఐ అధికారులు తాము కోరుకున్నట్లుగా చిలక పలుకులు పలికిస్తున్నారన్నది స్పష్టమైంది. అతనితో 161 కింద సీబీఐ అధికారులు నమోదు చేసిన స్టేట్‌మెంట్‌కు.. అనంతరం 164 కింద న్యాయస్థానంలో నమోదుచేసిన వాంగ్మూలానికి చాలా అంశాల్లో పొంతనలేదు. బెంగళూరులో భూవివాదం కారణంగానే ఎర్ర గంగిరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డిపై ఆగ్రహించి తనతోపాటు ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ద్వారా హత్య చేయించారని దస్తగిరి సీబీఐ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఆ స్టేట్‌మెంట్‌లో ఎలాంటి రాజకీయ అంశాలను ఆయన చెప్పనేలేదు. కానీ, 164 కింద న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో కడప ఎంపీ టికెట్‌ను తనకుగానీ, వైఎస్ షర్మిలకుగానీ, వైఎస్ విజయమ్మకుగానీ ఇవ్వాలని వైఎస్ వివేకానందరెడ్డి పట్టుబట్టినట్టు.. దాంతో వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకున్నట్లుగా చెప్పారు. కానీ, అది పూర్తిగా వాస్తవ విరుద్ధం. అప్పటికే కడప ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఖరారైంది. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వైఎస్ వివేకానందరెడ్డే ఇన్‌చార్జ్‌గా ఉంటూ పార్టీ విజయం కోసం అహరహం శ్రమిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరువాత కూడా ఆయన కుమార్తె సునీత వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి ప్రయత్నించారని చెప్పడం గమనార్హం. దాంతో సీబీఐ ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో.. సీబీఐ దస్తగిరితో మరిన్ని అసత్య ఆరోపణలను తాజాగా తెరపైకి తెచ్చింది. ఇక అప్రూవర్‌గా మారిన తరువాత కూడా తనను వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రలోభ పెట్టేందుకు యత్నించారని.. తనకు ప్రాణభయం ఉందని అతనితో చెప్పించడం ద్వంద్వ ప్రమాణాలు, ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
► 21వ తేదీన ఉదయం 8 గంటలకు సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల గెస్ట్ హౌస్‌కు వచ్చారు.
► 9 గంటలకు డ్రైవర్ దస్తగిరి గెస్ట్ హౌస్‌కు వచ్చాడు.
► మధ్యాహ్నం 3 గంటల వరకు దస్తగిరిని సీబీఐ అధికారులు తమ అదుపులో ఉంచుకున్నారు. అనంతరం గెస్ట్ హౌస్ నుంచి తమ వాహనంలోనే కోర్టుకు తీసుకెళ్లారు.
► 3 నుంచి 7 గంటల వరకు మేజిస్ట్రేట్ ముందు దస్తగిరి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.
► 7 గంటలకు దస్తగిరిని కోర్ట్ నుంచి సీబీఐ వాహనంలో ఇంటి వద్ద వదిలారు.
ప్రాణభయం పేరుతో మరో డ్రామా!
తనకు ప్రాణభయం ఉందని.. రక్షణ లేదని దస్తగిరి ద్వారా చెప్పించడం సీబీఐ ఆడించిన మరో డ్రామా. నిజానికి.. దస్తగిరి, అతని కుటుంబాన్ని ఢిల్లీలో నెలల తరబడి ఉంచి సీబీఐ వారిని తమ గుప్పెట్లోకి తీసుకుంది. తాను స్వయంగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశానని చెప్పినప్పటికీ అతన్ని వెంటనే అరెస్టు చూపించలేదు. అతను అప్రూవర్‌గా మారేందుకు అవకాశం కల్పించింది. అలాగే, ఆ తర్వాత దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ అధికారులు న్యాయస్థానంలో గట్టిగా వ్యతిరేకించలేదు. దాంతో దస్తగిరి బెయిల్‌పై విడుదలై హాయిగా తిరుగుతున్నాడు. అంతవరకులేని భయం.. ఒక్కసారిగా ఇప్పుడెందుకు వచ్చిందన్నది అంతుచిక్కడంలేదు. దస్తగిరికి ప్రాణభయం అనేది సీబీఐ ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. నిజానికి.. ఇప్పటికే సీబీఐ సూచనలతో పోలీసులు దస్తగిరికి రక్షణ కల్పించారు. అయినప్పటికీ తనకు భయంగా ఉందని అతను చెప్పడం విడ్డూరమే.
Comments
Please login to add a commentAdd a comment