
చిన్నారిని ఆడిస్తున్న పోలీసు కానిస్టేబుల్ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
సాక్షి, అనంతపూరం: ఖాకీలు అనగానే.. కటువు మాటలు, కరడు గట్టిన హృదయం, కర్కోటకులు అనే భావన ఏళ్లుగా సమాజంలో స్థిరపడిపోయింది. అయితే పోలీసుల్లో అందరు ఇలానే ఉండరు. వారిలో కూడా మంచి, మానవత్వం ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటనలను ఎన్నింటినో చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నెల రోజుల పసిబిడ్డను తీసుకుని ఓ తల్లి ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఎర్రటి ఎండ.. క్యూలైన్లో నిల్చోవడంతో చిన్నారికి ఉక్కపోత పోసి.. ఏడవడం ప్రారంభించింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇది గమనించి.. బిడ్డను తనతో పాటు తీసుకుని టెంట్ కిందకు వచ్చాడు. ఏడవకూడదంటూ ఊరడించాడు. చిన్నారి తల్లి ఓటు వేసి వచ్చేవరకు బిడ్డను ఎత్తుకుని ఆడించాడు.
బిడ్డను ఎత్తుకున్న కానిస్టేబుల్ ఫోటోని ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతుంది. తమిళనాడులో చోటు చేసుకున్న సంఘటనను, అక్కడి పోలీసు కానిస్టేబుల్‌ని ఏపీ పోలీసులు ఎందుకు ప్రశంసిస్తున్నారంటే.. సదరు కానిస్టేబుల్‌ది అనంతపురం కాబట్టి. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా ఈ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తునాడు.
ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్‌లో ‘‘తమిళనాడు ఎన్నికల్లో మానవత్వం చాటుకున్న ఏపీ పోలీసు కానిస్టేబుల్. ఈ అనంతపురం పోలీసు కానిస్టేబుల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ తల్లి తన నెల రోజుల పసికందును తీసుకుని ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఇక ఆ మహిళ ఓటు వేసి వచ్చేవరకు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఈ కానిస్టేబుల్ చేసిన పనిని అక్కడున్న వారందరు ప్రశంసించారు’’ అంటూ ట్వీట్ చేసింది.
#APPolice's humane face at #TamilNaduElections: @AnantapurPolice constable deployed to #TamilNadu for #TamilNaduElections2021 carried & lulled a 1-month-old crying baby until the mother's return from the voting booth, winning the hearts of many.#AndhraPradesh#Elections2021 pic.twitter.com/vk0DO2doJN
— Andhra Pradesh Police (@APPOLICE100) April 6, 2021
ఏపీ పోలీసు శాఖ సదురు కానిస్టేబుల్ పేరును వెల్లడించలేదు. ఈ ఫోటోని చూసిన వారంతా తెగ ప్రశంసిస్తున్నారు. గుడ్ జాబ్.. హ్యాట్సాఫ్ అంటూ పొగుడుతున్నారు. ఇక తమిళనాడు 38 జిల్లాలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3998 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 62.86 శాతం ఓటింగ్ నమోదయ్యింది. మే 2న వీరి భవితవ్యం తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment